పారిశుధ్య పనులను పరిశీలించిన మేయర్
ABN, Publish Date - May 11 , 2025 | 01:10 AM
నగరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకుగాను రాత్రి పారిశుధ్య కార్మికుల పనితీరును మెరుగుపరచడంపై జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు.
రాత్రిపూట నగరంలో తనిఖీలు
ఎటువంటి అలసత్వం, లోపాలు లేకుండా చూడాల్సిందిగా అధికారులకు ఆదేశం
వెంకోజీపాలెం, మే 10(ఆంధ్రజ్యోతి):
నగరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకుగాను రాత్రి పారిశుధ్య కార్మికుల పనితీరును మెరుగుపరచడంపై జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన ఆర్కే బీచ్, జగదాంబ జంక్షన్ పరిసరాల్లో రాత్రిపూట చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. మేయర్ ముందుగా ఆర్కే బీచ్ వద్ద ఉన్న పారిశుధ్య కార్మికుల హాజరుపట్టికను తనిఖీ చేసి...రోజూ కార్మికులు ఎన్ని గంటలకు హాజరవుతున్నారని కాంట్రాక్టర్‌ను ఆరా తీశారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ వారికి సరఫరా చేసిన చీపుళ్లను తనిఖీ చేసి నాణ్యత బాగుండలేదని, వాటిని మార్చాలని, ఇంకా కార్మికులకు అవసరమైన డస్ట్ బిన్లు, తోపుడుబండ్లు సమకూర్చాలని సహాయ వైద్యాధికారి డాక్టర్ కృష్ణంరాజును ఆదేశించారు. బీచ్‌లో ప్రతి దుకాణం దగ్గర డస్ట్ బిన్ తప్పకుండా ఉండాలని, అందుకు సహకరించని వారి షాపులను తొలగించాలని సూచించారు. బీచ్ కాలుష్యానికి గురికాకుండా సందర్శకులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. అనంతరం జగదాంబ జంక్షన్‌లో పనులు పరిశీలించారు. కొన్ని షాపుల వద్ద అధికంగా వ్యర్థాలు రోడ్లపై వేస్తున్నారని ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు కొందరు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. అటువంటి దుకాణాలు, షోరూమ్స్ వద్ద ప్రత్యేకంగా డస్ట్ బిన్స్ వారే ఏర్పాటుచేసుకుని జీవీఎంసీ వాహనాలకు రోజూ అందించేలా నోటీసులు జారీచేయాలని అధికారులకు సూచించారు. రాత్రి పారిశుధ్య పనులలో ఎటువంటి అలసత్వం, లోపాలు లేకుండా నిత్యం విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సహాయ వైద్యాధికారి డాక్టర్ సునీల్‌కుమార్‌ను మేయర్ ఆదేశించారు.
ఏప్రిల్‌లో పెరిగిన విమానయానం
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి):
గత ఏడాదితో పోల్చుకుంటే విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో విమానాల సంఖ్య, దానికి తగ్గట్టుగానే ప్రయాణికుల సంఖ్య పెరిగాయి. విమానాలు 7.32 శాతం పెరగ్గా, ప్రయాణికులు 11.58 శాతం పెరిగారు. 2024 ఏప్రిల్‌లో 1,776 విమానాలు రాకపోకలు సాగించగా, ఈ ఏప్రిల్‌లో వాటి సంఖ్య 130 పెరిగి 1,906కు చేరింది. అలాగే గత ఏప్రిల్‌లో ప్రయాణికుల సంఖ్య 2,19,265 మంది కాగా ఈ ఏప్రిల్‌లో 2,44,665 మంది ప్రయాణించారు. 25,400 మంది పెరిగారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు విషయానికి వచ్చేసరికి గత ఏప్రిల్‌లో 58 రాకపోకలు సాగించగా, ఈ ఏప్రిల్‌లో వాటి సంఖ్య 86కు పెరిగింది. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గత ఏప్రిల్‌లో 8,009 కాగా ఈ ఏప్రిల్‌లో 9,801 మంది ప్రయాణించారని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కుమార్‌రాజా, నరేశ్‌కుమార్, డీఎస్ వర్మలు తెలిపారు. విశాఖ నుంచి మరిన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలు నడపడానికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలల పునర్వ్యవస్థీకరణ
ఇకపై 7 ఏడు రకాలు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,158 పాఠశాలలు, పూర్తయిన కసరత్తు...
ప్రభుత్వానికి నివేదిక
నేడే, రేపో అధికారికంగా ఉత్తర్వులు
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి):
పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117ను ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఐదు రకాల పాఠశాలలను ఏర్పాటుచేయాలని తొలుత భావించిన విద్యా శాఖ...తాజాగా తొమ్మిదిగా విభజించాలని నిర్ణయించింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ కూడా ప్రాథమిక పాఠశాలలు మూసివేయనందున శాటిలైట్ పాఠశాలల ఏర్పాటు అవసరం పడలేదు. దీంతో మిగిలిన జిల్లాలకు భిన్నంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం ఏడు రకాల పాఠశాలలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అవి...ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక, మోడల్ ప్రాథమిక పాఠశాలలు, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ప్లస్ బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు.
ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న 3,158 పాఠశాలలను ఏడు రకాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ప్రకారం 228 ఫౌండేషన్ పాఠశాలలు, 1,921 బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 563 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 89 యూపీ పాఠశాలలు, 237 ఉన్నత పాఠశాలలు, 88 ఉన్నత పాఠశాలలు ప్లస్ బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 32 ఉన్నత పాఠశాలలు ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. వీటికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కొత్తగా అమలులోకి రానున్న విధానం ప్రకారం అనకాపల్లి జిల్లాలో 1,396, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,200, విశాఖపట్నం జిల్లాలో 562 పాఠశాలలు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 36 ఫౌండేషన్, 925 బేసిక్ ప్రాథమిక, 199 మోడల్ ప్రాథమిక, 13 యూపీ, 16 ఉన్నత, 4 ఉన్నత పాఠశాలలు ప్లస్ బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో 151 ఫౌండేషన్, 764 బేసిక్ ప్రాథమిక, 187 మోడల్ ప్రాథమిక, 55 యూపీ, 145 ఉన్నత పాఠశాలలు, 78 ఉన్నత పాఠశాలలు ప్లస్ బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 18 ఉన్నత పాఠశాలలు ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో 41 ఫౌండేషన్, 232 బేసిక్ ప్రాథమిక, 178 మోడల్ ప్రాథమిక, 21 యూపీ, 76 ఉన్నత పాఠశాలలు, 10 ఉన్నత పాఠశాలలు ప్లస్ బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి.
Updated Date - May 11 , 2025 | 01:10 AM