మాడుగులలో భారీ చోరీ
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:47 AM
మాడుగుల రాజువీఽదిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.2 లక్షల నగదు అపహరణకు గురైంది. బంధువుల ఇంటికి వెళ్లిన బాధితులకు ఈ విషయం సోమవారం ఉదయం తెలిసింది.
40 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ
మాడుగుల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మాడుగుల రాజువీఽదిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.2 లక్షల నగదు అపహరణకు గురైంది. బంధువుల ఇంటికి వెళ్లిన బాధితులకు ఈ విషయం సోమవారం ఉదయం తెలిసింది. దీనికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మాడుగుల రాజువీఽదిలో రిటైర్డ్ ఉద్యోగిని కోడూరు లక్ష్మి, ఆమె కుమార్తె మామిడి రమణమ్మ నివాసముంటున్నారు. అయితే రమణమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, మొదటి ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. మూడో కుమార్తె పెళ్లి కోసం 40 తులాల బంగారం, కిలోన్నర వెండి సమకూర్చింది. అలాగే రూ.2 లక్షల నగదును బీరువాలో పెట్టింది. కాగా విశాఖపట్నం మల్కాపురంలో ఉంటున్న రమణమ్మ పెద్ద అల్లుడి ఆరోగ్యం బాగోకపోవడంతో వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తల్లితో సహా ఆమె అక్కడికి బయలుదేరి వెళ్లింది. అయితే సోమవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఆ పక్కనే ఉంటున్న బంధువులు ఫోన్ చేసి ఈ విషయాన్ని రమణమ్మకు చెప్పారు. ఆమె ఇంటికి వచ్చి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, కె.కోటపాడు సీఐ పైడిపినాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు ఇంటి తాళాలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించి బీరువాను ఇనుప రాడ్డుతో వంచి చోరీకి పాల్పడినట్టు నిర్ధారించుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. బీరువాలోని 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.2 లక్షల నగదు అపహరణకు గురైనట్టు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జి.నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:47 AM