ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాజంగికి మహర్దశ

ABN, Publish Date - Jun 09 , 2025 | 12:03 AM

మండలంలోని తాజంగి జలాశయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రతి పంట పొలానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో కుడి, ఎడమ కాలువల మరమ్మతులు, పూడికతీత, గట్లు పటిష్ఠం చేసేందుకు రూ.55 లక్షల ఎన్‌ఆర్‌జీఎస్‌, ఎస్‌ఎంఐ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

తాజంగి జలాశయం

జలాశయం అభివృద్ధికి రూ.55 లక్షలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కుడి, ఎడమ కాలువల మరమ్మతు పనులు ప్రారంభం

750 ఎకరాలకు అందనున్న సాగునీరు

చౌడుపల్లి చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు

చింతపల్లి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి జలాశయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రతి పంట పొలానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో కుడి, ఎడమ కాలువల మరమ్మతులు, పూడికతీత, గట్లు పటిష్ఠం చేసేందుకు రూ.55 లక్షల ఎన్‌ఆర్‌జీఎస్‌, ఎస్‌ఎంఐ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఖరీఫ్‌ సాగు నాటికి కుడి, ఎడమ కాలువల పరిధిలో ఉన్న 750 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు నీటి సంఘం పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు.

తాజంగి గ్రామ పంచాయతీ కేంద్రంలో సుమారు 65 ఏళ్ల క్రితం మాచ్‌ఖండ్‌ జలాశయం నిర్మాణంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించి వ్యవసాయ భూములను కేటాయించారు. స్థానిక గిరిజనుల పంట పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 164 ఎకరాల విస్తీర్ణంలో జలాశయాన్ని నిర్మించారు. 750 ఎకరాల సాగు భూములకు నీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. పదేళ్ల క్రితం కుడి, ఎడమ కాలువ గట్లు తెగిపోవడంతో పంట పొలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదు. దీంతో ప్రతి ఏడాది ఖరీఫ్‌లో గిరిజన రైతులు కాలువలను మరమ్మతులు చేసుకుని పంట పొలాలకు సాగునీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కుడి, ఎడమ కాలువల నుంచి కేవలం 150 ఎకరాల పంట పొలాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. 2017లో తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసేందుకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.కోటి ప్రపంచ బ్యాంక్‌ నిధులను మంజూరు చేసింది. జలాశయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ టెండర్‌ను రద్దు చేసింది. దీంతో తాజంగి జలాశయం అభివృద్ధి మరుగునపడిపోయింది.

కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు

కూటమి ప్రభుత్వం తాజంగి కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.35 లక్షల ఉపాధి హామీ పథకం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఎస్‌ఎంఐ రూ.20 లక్షల నిధులను గట్టు పటిష్ఠం, పూడికతీతకు కేటాయించింది. దీంతో గిరిజన రైతులు పదేళ్లగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఫలితం దక్కింది. 750 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కుడి, ఎడమ కాలువల మరమ్మతులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తి చేస్తే జలాశయం దిగువనున్న వ్యవసాయ భూములకు ఖరీఫ్‌, రబీ రెండు కాలాల్లోనూ పుష్కలంగా సాగునీరు అందుతుంది.

చౌడుపల్లి చెరువుకి రూ.20 లక్షల నిధులు

చౌడుపల్లి చెరువు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం చెరువు పూడికతో నిండిపోయింది. పంట కాలువ పూర్తిగా పాడైపోయింది. ఈ చెరువు పరిధిలో ఉన్న 150 ఎకరాల పంట పొలాలకు రెండు కాలాలు సాగునీరు అందడం లేదు. ఖరీఫ్‌లో రైతులు పంట కాలువలను మరమ్మతులు చేసుకుని పొలాలకు సాగునీరు పెట్టుకుంటున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం చెరువు అభివృద్ధికి ఉపాధి హామీ పథకం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో చెరువులో పూడిక తొలగింపు, పంట కాలువ మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఖరీఫ్‌లో పంట పొలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందనుంది.

పులిగొంది చెక్‌డ్యామ్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు

సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన పులిగొంది చెక్‌డ్యామ్‌ను అభివృద్ధి చేసేందుకు ఎస్‌ఎంఐ ఇంజనీరింగ్‌ అధికారులు రూ.80 లక్షల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ చెక్‌డ్యామ్‌ పరిధిలో 100 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ చెక్‌ డ్యామ్‌ ఆయకట్టు పూర్తిగా ధ్వంసమైపోయింది. దీంతో సాగునీరు వృథాగా పోతున్నది. చెక్‌డ్యామ్‌ ఉన్నప్పటికి ఈ ప్రాంత గిరిజన రైతులు వర్షాధారంగానే పంటలను సాగు చేసుకుంటున్నారు. చెక్‌డ్యామ్‌ మరమ్మతులకు వారం, పది రోజుల్లో నిధులు విడుదల కానున్నాయి. దీంతో ఈ చెక్‌డ్యామ్‌ రైతులకు అందుబాటులోకి రానున్నది.

Updated Date - Jun 09 , 2025 | 12:03 AM