అచ్యుతాపురానికి మహర్దశ
ABN, Publish Date - May 11 , 2025 | 12:50 AM
గాజువాక నుంచి పరవాడ, అచ్యుతాపురం మీదుగా ఎలమంచిలి వద్ద హైవే వరకు ప్రస్తుతం వున్న ఆర్‌అండ్‌బీ రహదారిని 180 అడుగులకు విస్తరించడానికి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చెప్పారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి దేశపాత్రునిపాలెం వరకు స్టీల్ ప్లాంట్‌పరిధిలో ఫ్లై ఓవర్ వంతెన వస్తుందని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురానికి నాలుగువైపులా వున్న రహదారులను అనుసంధానం చేయడానికి ప్రణాళికను రూపొందించామని చెప్పారు.
గాజువాక నుంచి ఎలమంచిలి వరకు 180 అడుగుల రోడ్డు
స్టీల్ ప్లాంట్ పరిధిలో ఫ్లైఓవర్ వంతెన
100 నుంచి 120 అడుగుల వెడల్పుతో అచ్యుతాపురానికి రింగ్ రోడ్డు
ఇప్పటికే భూసేకరణ పూర్తి
మూడు నెలల్లో పనులు ప్రారంభం:
ఎమ్మెల్యే విజయ కుమార్ వెల్లడి
అచ్యుతాపురం, మే 10 (ఆంధ్రజ్యోతి): గాజువాక నుంచి పరవాడ, అచ్యుతాపురం మీదుగా ఎలమంచిలి వద్ద హైవే వరకు ప్రస్తుతం వున్న ఆర్‌అండ్‌బీ రహదారిని 180 అడుగులకు విస్తరించడానికి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చెప్పారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి దేశపాత్రునిపాలెం వరకు స్టీల్ ప్లాంట్‌పరిధిలో ఫ్లై ఓవర్ వంతెన వస్తుందని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురానికి నాలుగువైపులా వున్న రహదారులను అనుసంధానం చేయడానికి ప్రణాళికను రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు వంద అడుగుల మేర విస్తరణ పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలిపారు. అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ వంతెన, హరిపాలెం, మునగపాకల వద్ద భారీ వంతెనల నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయన్నారు. అచ్యుతాపురం జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని మరింత తగ్గించడానికి రింగ్ రోడ్డు నిర్మిస్తామని, దీనికి ప్రతిపాదనలు కూడా సిద్ధ్దమయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. గాజువాక-అచ్యుతాపురం రోడ్డులో అప్పన్నపాలెం జంక్షన్ నుంచి తమ్మయ్యపేట, భోగాపురం మీదుగా ప్రత్యేక ఆర్థిక మండలి ముఖద్వారం వరకు, అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డులో చోడపల్లి నుంచి గాజువాక-అచ్యుతాపురం రోడ్డులో రామన్నపాలెం, ఇటు చోడపల్లి నుంచి ఎలమంచిలి రోడ్డులో వున్న వెంకటాపురం మీదుగా ఎస్‌ఈజడ్‌లోని యోకోహామా టైర్ల కర్మాగారం వరకు 100 నుంచి 120 అడుగుల వెడల్పుతో రింగు రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని చెప్పారు. భూసేకరణ కూడా దాదాపు పూర్తయ్యిందని, మరో మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే విజయకుమార్ వెల్లడించారు.
Updated Date - May 11 , 2025 | 12:50 AM