జనసేన కార్పొరేటర్లలో లుకలుకలు
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:55 AM
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల వేళ జనసేనకు చెందిన కార్పొరేటర్లలో విభేదాలు తలెత్తాయి.
ఫ్లోర్ లీడర్‌ను మార్చాలంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఫిర్యాదు
డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేయాలని మరికొందరు యోచన
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల వేళ జనసేనకు చెందిన కార్పొరేటర్లలో విభేదాలు తలెత్తాయి. జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ముగ్గురు గెలుపొందారు. అయితే ఇండిపెండెంట్‌లుగా గెలిచిన ఇద్దరు, వైసీపీ నుంచి గెలిచిన మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు ఇటీవల జనసేనలో చేరారు. దీంతో ప్రస్తుతం జనసేన కార్పొరేటర్ల సంఖ్య 14కి పెరిగింది. త్వరలో జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ సమక్షంలో కార్పొరేటర్లు నిర్ణయించారు. అయితే మంగళవారం ఉదయం అనూహ్యంగా ఆ పార్టీ కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ఆ పార్టీ కార్పొరేటర్లు కొందరు సాదిక్‌ను ప్రశ్నించగా, తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినట్టు తెలిసింది. దీనిపై మేయర్ పీలా శ్రీనివాసరావు ఛాంబర్‌లో జనసేన కార్పొరేటర్ల మధ్య చర్చ జరగ్గా, 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను ధిక్కరించి, ఫ్లోర్‌లీడర్‌కు సమాచారం ఇవ్వకుండా ఎలా నామినేషన్ వేస్తారంటూ ప్రశ్నించారు. అదే సమయంలో జీవీఎంసీలో జనసేన ఫ్లోర్‌లీడర్‌గా పనిచేస్తున్న బీశెట్టి వసంతలక్ష్మి సమర్థంగా పనిచేయలేకపోతున్నారని, ఆమెను ఆ పదవి నుంచి తొలగించి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని కోరుతూ జనసేనకు చెందిన కొందరు కార్పొరేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. దానికి సంబంధించిన ఫోటోను మీడియాకు విడుదల చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు నేరుగా ఫిర్యాదు చేయాలని కొందరు కార్పొరేటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పార్టీ కార్పొరేటర్లలో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులావున్న విభేదాలు ఒక్కసారిగా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Jul 30 , 2025 | 12:55 AM