లోకేశ్ ప్రజా దర్బార్
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:53 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
పార్టీ కార్యాలయంలో వినతుల స్వీకరణ
కొన్నింటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు
ఇంటర్ జోనల్ బదిలీలు చేయాల్సిందిగా డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకుల వినతి
పదోన్నతులు కల్పించాల్సిందిగా తెలుగు పండిట్ల విజ్ఞాపన
లంకెలపాలెంలో కోనేరు అభివృద్ధిలో నిధులు గోల్‌మాల్‌పై విచారణ చేయండి
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వినతులు స్వీకరించిన ఆయన...పలు సమస్యలపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. తమకు నెలవారీ జీతం చెల్లించడంతోపాటు ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఏపీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపక అసోసియేషన్ వినతిపత్రం అందజేయగా, సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతారని భరోసా ఇచ్చారు. ఇటీవల తన భర్త చనిపోయారని, ముగ్గురు పిల్లలు ఉన్నారని పింఛన్ మంజూరుచేసి ఆదుకోవాలని నగరానికి చెందిన అవ్వా కాంతం వినతిపత్రం అందజేశారు. పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్యా శాఖలో పనిచేస్తున్న తెలుగు పండిట్లు కోరారు. గడచిన ఐదేళ్లలో నాలుగుసార్లు తమను బదిలీ చేసి ప్రస్తుతం విశాఖ డీఈవో పూల్‌లో కొనసాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమను పనిచేసే చోట స్థిరంగా ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2020 ఫిబ్రవరిలో విపక్ష నేతగా ఉన్నప్పుడు నారా చంద్రబాబునాయుడును వైసీపీ నాయకులు ఎయిర్‌పోర్టులో అడ్డుకుని నానా బీభత్సం సృష్టించారని, దీనిపై పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదుచేసి చేతులు దులుపుకున్నారని విశాఖ టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ కె.గోపాలరెడ్డి ఫిర్యాదుచేశారు. దీనిపై మరోసారి విచారణ జరపాలని కోరారు.
కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించండి
ఆనందపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో తనకు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన 1.09 ఎకరాలు ఉందని, అయితే 2022లో రీసర్వే నిర్వహించిన తరువాత ఎఫ్‌ఎంబీలో సదరు భూమిని తప్పుగా నమోదు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని నగరంలోని శాతవాహన నగర్‌కు చెందిన వై.వసంతలక్ష్మి వినతిపత్రం అందజేశారు. ఎఫ్‌ఎంబీలో తప్పులు సరిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నగర శివారు లంకెలపాలెంలో కోనేరు అభివృద్ధి పనుల్లో రూ.1.2 కోట్లు గోల్‌మాల్ జరిగిందని 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. నిధుల గోల్‌మాల్‌పై విచారణ చేపట్టాలని కోరారు. వినతులు స్వీకరించిన లోకేశ్, ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా లోకేశ్‌ను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఆయన ఫొటో దిగారు. పార్టీ కార్యాలయంలో లోకేశ్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఇంకా దాడి వీరభద్రరావు, బుద్దా నాగజగదీష్, దాడి రత్నాకర్, మహ్మద్ నజీర్, పీవీజీ కుమార్, పార్టీ నాయకులు కలిశారు.
పల్లా కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ పరామర్శ
సీతంపేట (విశాఖపట్నం), జూన్ 10 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఈ నెల ఏడో తేదీన శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే సింహాచలం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని సీతంపేట రాజేంద్రనగర్‌లో గల పల్లా శ్రీనివాసరావు నివాసానికి మంగళవారం ఉదయం మంత్రి లోకేశ్ వెళ్లారు. తొలుత సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సింహాచలం మంచికి మారు పేరుగా నిలిచారని, విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారంటూ ఆయన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. పల్లా శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సింహాచలం మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎంపీ ఎం.శ్రీభరత్, ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 11 , 2025 | 12:53 AM