ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నవజాత శిశువులకు అరకొర వైద్య సేవలు

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:39 PM

స్థానిక ఏరియా ఆస్పత్రిలో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎన్‌ఎస్‌సీయూ)లో వైద్యుల కొరత వేధిస్తోంది.

ఎన్‌ఎస్‌సీయూలో శిశువులకు చికిత్స అందిస్తున్న స్టాఫ్‌ నర్సులు

ఎన్‌ఎస్‌సీయూలో వేధిస్తున్న వైద్యుల కొరత

మూడేళ్లగా భర్తీకి నోచుకోని చిన్నపిల్లల వైద్యుల పోస్టులు

ఏరియా ఆస్పత్రి వైద్యులతో నెట్టుకొస్తున్న వైనం

అత్యవసర సమయాల్లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి

పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎన్‌హెచ్‌ఎం

చింతపల్లి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎన్‌ఎస్‌సీయూ)లో వైద్యుల కొరత వేధిస్తోంది. మూడేళ్లగా చిన్నపిల్లల వైద్యనిపుణుల పోస్టులు భర్తీకి నోచుకోలేదు. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో శిశువులకు చికిత్స అందించాల్సిన ఎన్‌ఎస్‌సీయూలో ఏరియా ఆస్పత్రి వైద్యులతో నెట్టుకొస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంత శిశువులకు అత్యాధునిక వైద్యసేవలు దూరమయ్యాయి.

చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో శిశు మరణాలను నియంత్రించడంతో పాటు సకాలంలో శిశువులకు అత్యాధునిక వైద్య సేవలందించేందుకు పదేళ్ల క్రితం జాతీయ ఆరోగ్య మిషన్‌ చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో రూ.1.5 కోట్ల ఎన్‌హెచ్‌ఎం నిధులతో అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. ఆరేళ్ల క్రితం రూ.10 లక్షల నిధులతో మదర్‌ కేర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌సీయూలో శిశువులకు వైద్య సేవలందించేందుకు ఇద్దరు వైద్యులు(చిన్నపిల్లల వైద్యనిపుణులు), ఆరుగురు స్టాఫ్‌ నర్సులు, నలుగురు సహాయక నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక డీఈవోతో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డుల పోస్టులను కేటాయించారు. అయితే ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీయూలో రెండు వైద్యుల పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇతర పోస్టుల్లో ఉద్యోగులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు.

అందుబాటులో ఉన్న పరికరాలు

నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఫొటో థెరపీ, రేడియెంట్‌ వార్మర్‌, నెబ్యులైజర్‌, మల్టీమోనిటర్‌ పరికరాలు, అన్నిరకాల పరీక్షల ల్యాబ్‌ శిశువుల వైద్యానికి అందుబాటులో వున్నాయి.

శిశువులకు అందించే సేవలు

పుట్టిన వెంటనే శిశువుకి వచ్చే పచ్చకామెర్ల వ్యాధి నివారించేందుకు ఫొటో థెరఫీ ద్వారా చికిత్స అందిస్తారు. లోబర్త్‌ వెయిట్‌(బరువు తక్కువగా జన్మించిన శిశువులు) 2.5 కిలోల కంటే తక్కువగా ఉన్న శిశువులను రేడియెంట్‌ వార్మర్‌లో పెడతారు. ఈ చికిత్స అందించడం వల్ల లోబర్త్‌ వెయిట్‌ శిశువులకు కలిగే ప్రాణహాని నుంచి కాపాడవచ్చు. శ్వాస సంబంధమైన సమస్యలు, ఆస్తమా, ఉబ్బసంతో బాధపడుతున్న శిశువులకు నెబ్యులైజర్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. మల్టీ మోనిటర్‌ ద్వారా శిశువు ఆక్సిజన్‌ తీసుకుంటున్న విధానం, గుండె పనితీరు, వేగం, ఊపిరి తీసుకునే విధానం పరీక్షించి సంబంధిత సమస్యలకు చికిత్స అందిస్తారు. దీంతో పాటు జననంలో ఉమ్మనీరు తాగిన శిశువులకు కూడా ప్రాణపాయం లేకుండా చికిత్స చేస్తున్నారు.

వెంటాడుతున్న వైద్యుల కొరత

నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో మూడేళ్లగా వైద్యుల కొరత వెంటాడుతున్నది. ఎన్‌ఎస్‌సీయూలో విధులు నిర్వహించే చిన్నపిల్లల వైద్యనిపుణులకు రూ.1.5 లక్షల నుంచి 1.8 లక్షల వేతనం, ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వైద్యులకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వేతనం ఇస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండు వైద్యుల పోస్టుల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు భర్తీకాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్నపిల్లల వైద్యనిపుణులు ఎన్‌ఎస్‌సీయూలో పనిచేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వైద్యులను భర్తీ చేసి, ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెరుగైన వైద్యం అందించేవారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీయూలో చిన్నపిల్లల వైద్యులు గాని, ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వైద్యులు గాని అందుబాటులో లేరు. ఏరియా ఆస్పత్రిలో ఉన్న చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ జి.ప్రభావతి ఎన్‌ఎస్‌సీయూలో అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఏరియా ఆస్పత్రితో పాటు ఎన్‌ఎస్‌సీయూ బాధ్యతలు నిర్వహించడం, ఏరియా ఆస్పత్రి మొత్తానికి ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండడంతో వైద్యురాలికి అదనపు పనిభారం పెరిగిపోతున్నది. అలాగే చిన్నపిల్లల వైద్యనిపుణులు సెలవుపెట్టినా, రాత్రివేళ శిశువులకు అత్యవసర వైద్యం అవసరమైనా ఏరియా ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఇతర వైద్యులు, ఎన్‌ఎస్‌సీయూ స్టాఫ్‌నర్సులు సాధారణ వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, పాడేరు జిల్లా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఎన్‌ఎస్‌సీయూలో ఖాళీగా ఉన్న ఇద్దరు చిన్నపిల్లల వైద్యనిపుణుల పోస్టులు భర్తీ చేస్తే ఇక్కడే శిశువులకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా కలెక్టర్‌, ఎన్‌హెచ్‌ఎం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్‌ఎస్‌సీయూలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ఈ ప్రాంత గిరిజనులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:39 PM