ప్రాణం తీసిన ఈత సరదా
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:42 AM
ఈత సరదా ఒక వ్యక్తి ప్రాణాలు బలిగొంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మాడుగుల మండలం శివారు ఏజెన్సీ ముఖ ద్వారం గరికబంద సమీపాన బిల్లలపాలెం వద్ద తాచేరు గెడ్డలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
- గెడ్డలో మునిగి ఒకరి మృతి - మరొకరి పరిస్థితి విషమం
మాడుగుల రూరల్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఈత సరదా ఒక వ్యక్తి ప్రాణాలు బలిగొంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మాడుగుల మండలం శివారు ఏజెన్సీ ముఖ ద్వారం గరికబంద సమీపాన బిల్లలపాలెం వద్ద తాచేరు గెడ్డలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన రంభ ఖ్యాతితేజ, ఆర్.కె.కౌశిల్, లెక్కల కుమారస్వామి, పైల బాలకృష్ణ, తాటికొండ సురేశ్‌లు స్నేహితులు. వీరిలో కుమారస్వామిది మాడుగుల స్వగ్రామం. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఈ ఐదుగురు స్నేహితులు మాడుగులలో ఓ శుభకార్యానికి ఆదివారం కారులో వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అక్కడ నుంచి బయల్దేరి పాడేరు, అరకు మీదుగా విశాఖపట్నానికి వెళదామని నిర్ణయించుకున్నారు. మాడుగుల నుంచి కారులో బయల్దేరి పాడేరు వెళుతుండగా ఏజెన్సీ ముఖద్వారం గరికబంద నుంచి పక్కగా లోపలికి సుమారు కిలోమీటరు దూరంలోని బిల్లలపాలెం వద్ద గల తాచేరు గెడ్డలో సరదాగా ఈత కొడదామని అక్కడికి వెళ్లారు. తాటికొండ సురేశ్ మినహా మిగిలిన నలుగురు(ఖ్యాతితేజ, కౌశల్, కుమారస్వామి, బాలకృష్ణ) తాచేరు గెడ్డలోకి దిగారు. కుమారస్వామి, బాలకృష్ణ ఒక దగ్గర, వీరికి కొంచెం దూరంలో కౌశల్, మరికొంత దూరంలో ఖ్యాతితేజ స్నానాలు చేస్తున్నారు. అయితే లోతు ఎక్కువగా, ఊబి ఉన్న ప్రాంతంలో ఖ్యాతితేజ మునిగిపోయాడు. కౌశల్ కూడా మునిగిపోతుండడాన్ని గమనించి కుమారస్వామి, బాలకృష్ణ రక్షించి ఒడ్డుకు లాక్కుని వచ్చారు. ఖ్యాతితేజను కూడా అతికష్టమ్మీద ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే ఖ్యాతితేజ నీరు ఎక్కువగా తాగేయడంతో స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో ఉన్నాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఖ్యాతితేజ, కౌశల్‌లను స్నేహితులు మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఖ్యాతితేజ(33) మృతి చెందినట్టు నిర్ధారించారు. కౌశిల్‌కి ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు ఖ్యాతితేజ విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం. కౌశల్ విశాఖపట్నంలో సీలింగ్ వర్క్ చేస్తుంటాడు. ఇతనికి కూడా వివాహమైంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాడుగుల ఎస్‌ఐ నారాయణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించామని, మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jun 30 , 2025 | 12:42 AM