ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీబీఎస్‌ఈ వైపు మొగ్గు

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:46 AM

స్టేట్‌ కంటే సీబీఎస్‌ఈ సిలబస్‌ అయితే తమ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

  • తగ్గుతున్న స్టేట్‌ సిలబస్‌ విద్యార్థులు

  • ప్రభుత్వ, స్టేట్‌ సిలబస్‌ కలిగిన ప్రైవేటు పాఠశాలల్లో కలిపి గత విద్యా సంవత్సరం 3,44,209 మంది విద్యార్థులు

  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3,24,180 మంది

  • గత ఏడాది పోల్చితే 16,587 తగ్గుదల

  • ఒకటో తరగతిలో పడిపోయిన అడ్మిషన్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టేట్‌ కంటే సీబీఎస్‌ఈ సిలబస్‌ అయితే తమ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కార్పొరేట్‌, పెద్దస్థాయి సీబీఎస్‌ఈ పాఠశాలల్లో మాత్రం పెరిగాయి. నగరంలో పిల్లలు ఎక్కువగా సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించే పాఠశాలల్లో చేరుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతంలో తల్లికి వందనం పథకం అందిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు.

గత విద్యా సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు 16,587 మంది తగ్గారు. గత విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ 72,678 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుత ఏడాది బుధవారం వరకు 66,515 మంది ఉన్నారు. అంటే గత ఏడాది కంటే 6,163 మంది తగ్గారు. ఒకటో తరగతిలో గత ఏడాది 4,011 మంది చదవగా, ప్రస్తుతం అదే తరగతిలో ఇంతవరకు 3,048 మందే ప్రవేశాలు పొందారు. అంటే 963 మంది తగ్గారని విద్యా శాఖ గుర్తించింది. అలాగే గత ఏడాది ఐదో తరగతిలో 7,777 మంది ఉండగా వారిలో 7,169 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరారు. మిగిలిన తరగతుల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు (స్టేట్‌ సిలబస్‌) కలిపి గత విద్యా సంవత్సరంలో 3,44,209 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో బుధవారం వరకు 3,24,180 మంది ఉన్నారు. అంటే 16,587 మంది తగ్గారన్నమాట. గత ఏడాది ఒకటో తరగతిలో 33,531 మంది ఉండగా, ఇప్పుడు 26,813 మంది చేరారు. ఒకటో తరగతిలోనే 6,718 మంది తగ్గారు. ఐదో తరగతిలో 34,068 మంది ఉండగా వారంతా ఆరో తరగతిలో చేరాలి. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో 31,892 మంది చేరగా 2,194 మంది సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేరి ఉంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మిగిలిన తరగతులకు సంబంధించి గత ఏడాదితో పోల్చితే తగ్గుదలే కనిపించింది.

ఒకటో తరగతిలో ప్రవేశాల తగ్గడానికి జనన రేటు తగ్గడం ఒక కారణం కాగా, సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివించాలని చాలామంది తల్లిదండ్రులు భావించడం మరో కారణమని ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు. స్టేట్‌ సిలబస్‌తో పోల్చితే సీబీఎస్‌ఈ సిలబస్‌ వైపునకు మొగ్గుచూపడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. స్టేట్‌ సిలబస్‌ ప్రశ్నలు, జవాబులతో సాగుతుందని, గైడ్లు, మెటీరియల్‌ నోట్స్‌ చదువుకుంటే పరీక్షలలో 90 శాతానికి మించి మార్కులు వస్తున్నాయని, అయితే జాతీయ స్థాయిలో పరీక్షల్లో చతికిలపడుతున్నారని ఆనందరావు అనే గణితం టీచర్‌ వ్యాఖ్యానించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేర్పిస్తే ఉదయం వెళ్లిన విద్యార్థి రాత్రి వరకు స్కూలులో ఉండే అవసరం లేదని, మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటికి చేరతాడని, సాయంత్రం ఆటలు, ఇతర యాక్టివిటీస్‌ దిశగా వెళ్లేందుకు సమయం ఉంటుందని పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో పూర్తిగా పాఠ్యపుస్తకం చదవాల్సి ఉంటుందని, దాంతో పోటీ పరీక్షలలో సునాయాసంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని నారాయణ మెడికల్‌ అకాడమీ డీన్‌ హనుమంతరావు అన్నారు. జిల్లాలో సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఏడాది నీట్‌, ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో మన పిల్లలకు జాతీయ స్థాయి ర్యాంకులు తగ్గాయని పేర్కొన్నారు. పిల్లలు మానసికంగా అభివృద్ధి చెందేందుకు చదువుతోపాటు ఆటలు, ఇతరత్రా కోర్సులు నేర్చుకోవడం ముఖ్యమని, అందుకు సీబీఎస్‌ఈ స్కూళ్లలో సమయం దొరుకుతుందని కేంద్రీయ విద్యాలయం టీచర్‌ లలితకుమారి వివరించారు. భవిష్యత్తులో రాష్ట్ర సిలబస్‌ నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌లో మారే పిల్లల సంఖ్య పెరుగుతుందని అన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:46 AM