చెలరేగిపోతున్న భూ కబ్జాదారులు
ABN, Publish Date - Jul 15 , 2025 | 01:16 AM
నగర శివారు ప్రాంతాల్లో భూ కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. చెరువులు, వాగులు, గెడ్డలు, కొండ పోరంబోకు భూములు, గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుంటున్నారు.
నరవలో గెడ్డ పోరంబోకులో ఇళ్ల నిర్మాణం
రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు విక్రయం
గవర జగ్గరాజుపాలెంలో ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠం భూములు అమ్మకం
సత్తివానిపాలెంలో లక్ష్మీసాగర్ చెరువు ఆక్రమణకు యత్నం
ఆక్రమణదారులకు రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలు
రెవెన్యూ, పంచాయతీ, జీవీఎంసీ అధికారుల మొద్దునిద్ర
విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):
నగర శివారు ప్రాంతాల్లో భూ కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. చెరువులు, వాగులు, గెడ్డలు, కొండ పోరంబోకు భూములు, గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుంటున్నారు. అందుకు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వారి బంధువులు అండగా నిలుస్తున్నారు.
పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో కొండ పోరంబోకు భూమిని కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అటువంటి ఆక్రమణలు అనేకం ఉన్నాయని ఆ నియోజకవర్గంలోని గ్రామాల నుంచి కొందరు సమాచారం అందించారు. నరవ గ్రామంలోని సర్వే నంబర్ 36లో ప్రభుత్వ గెడ్డవాగు సుమారు 1.7 ఎకరాలు ఉంది. దీనిని రెవెన్యూ రికార్డుల్లో గెడ్డగా క్లాసిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఖాతా నంబరు 20001202. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గెడ్డవాగుల్లో ఎవరికీ పట్టాలు ఇవ్వకూడదు. నిర్మాణాలు చేయకూడదు. కానీ గ్రామానికి చెందిన కొందరు కొద్దికొద్దిగా ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించి, ఒక్కొక్కటి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ గెడ్డ అని తెలియక కొనుగోలుచేసినవారు...తరువాత విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. గెడ్డవాగులో నిర్మాణాలు చేస్తున్నా రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.
గవర జగ్గరాజుపాలెంలో గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠాన్ని కొందరు చోటా నాయకులు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మిస్తున్నారు. జీవీఎంసీ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదు. రెవెన్యూ సిబ్బంది కొద్దిరోజుల క్రితం వచ్చి ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఇంటికి తూతూమంత్రంగా నాలుగు సిమెంటు పలకలు తొలగించి వెళ్లిపోయారు. అక్కడ కూడా ఇళ్లు నిర్మించి రూ.20 లక్షలకు అమ్ముకుంటున్నారు. చోటా నాయకులకు కూటమి పార్టీ నేతలు వత్తాసుపలుకుతున్నారు. సత్తివానిపాలెంలో లక్ష్మిసాగరం చెరువు కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అయినా ఎవరూ అడ్డుకోకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చినముషిడివాడ, పెందుర్తి, కోటనరవ...ప్రతిచోట ప్రభుత్వ సెలవు రోజులు వస్తే ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి ప్రభుత్వ స్థలాల ఆక్రమణను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jul 15 , 2025 | 01:16 AM