లంబసింగికి తలమానికం గిరిజన మ్యూజియం
ABN, Publish Date - Apr 28 , 2025 | 11:35 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం తలమానికం కానున్నదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు.
భావితరాలకు ఆదివాసీ వీరుల చరిత్ర
నిర్మాణాలు వేగవంతానికి ప్రభుత్వం చర్యలు
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు
చింతపల్లి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం తలమానికం కానున్నదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. సోమవారం లంబసింగి వచ్చిన ఆయనకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తొలుత ఆయన తాజంగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని సందర్శించారు. నిర్మాణాలపై జేసీ, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మ్యూజియం ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుందన్నారు. లంబసింగి పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం పొందిందని, ఈ ప్రాంత ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. లంబసింగి వచ్చిన పర్యాటకులు మ్యూజియాన్ని సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం కేవలం సీజనల్‌గా పర్యాటకులు వస్తున్నారని, మ్యూజియం అందుబాటులోకి వస్తే ఏడాది పొడవునా సందర్శనలు ఉంటాయన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆదివాసీ పోరాట యోధులు ప్రత్యేక భూమిక పోషించారన్నారు. మ్యూజియంలో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న గిరిజన వీరుల విగ్రహాలు, వ్యక్తిగత వివరాలు ప్రదర్శిస్తారని చెప్పారు. దీంతో భావితరాలకు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలుస్తుందన్నారు. కాంట్రాక్టర్‌ను తొలగించడం వల్ల పనులు జాప్యమయ్యాయని, కొత్తగా టెండర్లు పిలిచి నూతన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్టు గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారన్నారు. మ్యూజియం నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. తన పర్యాటనలో లంబసింగి, తాజంగి ప్రాంత ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ గుర్తించిందని, ప్రభుత్వపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జీసీసీ డివిజనల్ మేనేజర్ పి.దేవరాజు, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రజని, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, ఈఈ డేవిడ్ రాజు, డీఈ రఘునాథరావు నాయడు, ఏఈఈ యాదకిశోర్, క్యూరేటర్ శంకరరావు, తహసీల్దార్ బి.రవికుమార్ పాల్గొన్నారు.
Updated Date - Apr 28 , 2025 | 11:35 PM