ఆగిన లగిశపల్లి రోడ్డు పనులు
ABN, Publish Date - May 25 , 2025 | 11:27 PM
కలెక్టర్ అనుమతి లేకుండా చేపడుతున్న లగిశపల్లి రోడ్డు పనులను ఆదివారం కాంట్రాక్టర్ నిలిపివేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాక సందర్భంగా నిర్మించ తల పెట్టిన లగిశపల్లి రోడ్డుకు కలెక్టర్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీరాజ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్ కుమ్మక్కై అనధికారికంగా చేపడుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘పంచాయతీరాజ్ ఇష్టారాజ్యం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తమై సదరు కాంట్రాక్టర్‌తో తాత్కాలికంగా రోడ్డు పనులను నిలిపివేయించారు.
తప్పును కప్పిబుచ్చేందుకు పీఆర్ అధికారుల మల్లగుల్లాలు
రోడ్డు వ్యవహారం కలెక్టర్ వరకు వెళ్లకుండా లాబీయింగ్
పాడేరు, మే 25(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ అనుమతి లేకుండా చేపడుతున్న లగిశపల్లి రోడ్డు పనులను ఆదివారం కాంట్రాక్టర్ నిలిపివేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాక సందర్భంగా నిర్మించ తల పెట్టిన లగిశపల్లి రోడ్డుకు కలెక్టర్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీరాజ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్ కుమ్మక్కై అనధికారికంగా చేపడుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘పంచాయతీరాజ్ ఇష్టారాజ్యం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తమై సదరు కాంట్రాక్టర్‌తో తాత్కాలికంగా రోడ్డు పనులను నిలిపివేయించారు. ఆదివారం కావడంతో ఈ విషయం కలెక్టర్ దినేశ్‌కుమార్ వరకు వెళ్లకుండా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు జాగ్రత్త పడ్డారు. దీంతో ఇదే అదనుగా మరొక అధికారితో లాబీయింగ్ చేసి తాము చేసిన తప్పు నుంచి బయట పడేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి..
వాస్తవానికి కలెక్టర్ అనుమతి లేకుండా అనధికారికంగా రూ.3 కోట్ల విలువ చేసే రోడ్డు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌కు అవకాశం కల్పించిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. అలాగే రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి మంజూరు/అనుమతి లేకుండా ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ సైతం లేకుండానే రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అక్రమ వ్యవహారంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, సదరు కాంట్రాక్టర్ కుమ్మక్కు కావడంతో కలెక్టర్ వంటి ఉన్నతాధికారులను సైతం మభ్యపెట్టి ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనధికారికంగా చేపట్టిన లగిశపల్లి రోడ్డు పనుల వ్యవహారంపై కలెక్టర్ ఉన్నతాధికారిలో సమగ్ర విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు అంటున్నారు.
Updated Date - May 25 , 2025 | 11:27 PM