వరి రైతుకు దక్కని మద్దతు
ABN, Publish Date - May 30 , 2025 | 01:10 AM
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం ప్రకటించిన ధాన్యం మద్దతు ధరలు అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. పెరిగిన పెట్టుబడులతో బేరీజు వేస్తే మద్దతు ధరల పెంపు కంటి తుడుపుగానే వుందని పెదవి విరుస్తున్నారు. గత ఏడాది ధరలపై క్వింటాకు కేవలం రూ.69 మాత్రమే పెంచడం శోచనీయమని అంటున్నారు. వాస్తవ సాగు వ్యయానికి, పెంచిన మద్దతు ధరలకు పొంతన లేదని వాపోతున్నారు. పెట్టుబడుల వ్యయం 10 నుంచి 15 శాతం వరకు పెరగ్గా, ధాన్యం మద్దతు ధరలను మాత్రం మూడు శాతమే పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 17 రకాల పంటల మద్దతు ధరల్లో వరి చివరి స్థానంలో వున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
సాగు వ్యయం బారెడు.. పెంచిన మద్దతు ధర జానెడు
కంటితుడుపుగా ధాన్యం మద్దతు ధర
క్వింటాకు రూ.69 మాత్రమే పెంపు
క్రితం ఏడాది కన్నా రూ.48 తక్కువ
గత ఐదేళ్లలో ఇదే అత్యల్పం
మిగిలిన అన్ని పంటలకన్నా వరికే తక్కువ
అన్నదాతలను నిరాశపరిచిన కేంద్ర ప్రభుత్వం
చోడవరం, మే 29 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం ప్రకటించిన ధాన్యం మద్దతు ధరలు అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. పెరిగిన పెట్టుబడులతో బేరీజు వేస్తే మద్దతు ధరల పెంపు కంటి తుడుపుగానే వుందని పెదవి విరుస్తున్నారు. గత ఏడాది ధరలపై క్వింటాకు కేవలం రూ.69 మాత్రమే పెంచడం శోచనీయమని అంటున్నారు. వాస్తవ సాగు వ్యయానికి, పెంచిన మద్దతు ధరలకు పొంతన లేదని వాపోతున్నారు. పెట్టుబడుల వ్యయం 10 నుంచి 15 శాతం వరకు పెరగ్గా, ధాన్యం మద్దతు ధరలను మాత్రం మూడు శాతమే పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 17 రకాల పంటల మద్దతు ధరల్లో వరి చివరి స్థానంలో వున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం సాధారణ రకం ధాన్యంకు క్వింటా రూ.2,369, ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,389. గత ఏడాది ఇవే రకాలు రూ.2300, రూ.2320గా వున్నాయి. అంతకుముందు సంవత్సరం (2023-24) క్వింటాకు రూ.117 పెంచగా, ఈసారి రూ.69 మాత్రమే పెంచింది. విత్తనాలు, కూలి ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇటువంటి తరుణంలో మద్దతు ధర కనీసం పది శాతం అయినా పెంచాల్సి వుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడు శాతం మాత్రమే పెంచి, కేంద్ర ప్రభుత్వం తమను తీవ్ర నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వరి సాగు వ్యయం ఏటేటా పెరిగిపోతుండగా, మరోవైపు తుఫాన్లు, భారీ వర్షాలు, తెగుళ్లు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ధాన్యం దిగుబడులు తగ్గిపోతున్నాయి. యూరియా మినహా, ఇతర ఎరువులు, పురుగు మందుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వివిధ కారణాల వల్ల గ్రామాల్లో వ్యవసాయ పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతున్నది. ఈ కారణంగా కూలి రేట్లు పెరుగుతున్నాయి. అయినాసరే అవసరమైన సమయంలో కూలీలు లభించడంలేదు. గతంలో రోజు కూలీకి వరినాట్లు వేసేవారు. ఎకరాకు రూ.2,000 వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడా పరిస్థితి లేదు. గుత్తంగా ఎకరాకు రూ.5-6 వేలు డిమాండ్ చేస్తున్నారు. దుక్కి దున్నడానికి ట్రాక్టర్‌కు ఎకరాకు రూ.1,000 నుంచి రూ.1,200 తీసుకుంటున్నారు. దమ్ము పని అయితే రూ.1,200-రూ.1,500 వుంది. ఎకరా విస్తీర్ణంలో వరి సాగు చేయాలంటే రూ.35-40 వేలు వ్యయం అవుతున్నది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు అటుఇటుగా 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. తెగుళ్లు ఆశించినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా.. దిగుబడి మరింత తగ్గిపోతుంది. ఇటువంటి తరుణంలో వరి రైతుకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర పెంచాల్సిన ప్రభుత్వం.. అత్యంత దారుణంగా క్వింటాకు రూ.69 మాత్రమే పెంచడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే వరి సాగుకు స్వస్తి చెప్పి సరుగుడు, యూకలిప్టస్ తోటలు వేసుకుంటున్నామని చెబుతున్నారు.
వరి మద్దతు ధర రూ.3,500 ఉండాలి
యల్లపు శ్రీను, చోడవరం
వరి సాగు ఖర్చులు గత నాలుగైదేళ్ల నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యులు సైతం పొలంలో పనులు చేసుకుంటున్నప్పటికీ ఇతర ఖర్చులన్నీ కలిసి రూ.30 వేలకు తగ్గడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ధాన్యం క్వింటా రూ.3,500 అయితేనే వరి సాగు గిట్టుబాటు అవుతుంది. లేదంటే ఎరువులు, విత్తనాలను సగం రాయితీపై అందజేయాలి. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి.
Updated Date - May 30 , 2025 | 01:10 AM