అడుగడుగునా సమన్వయలోపం
ABN, Publish Date - May 01 , 2025 | 01:13 AM
సింహాచలం చందనోత్సవంలో ఈసారి కూడా భక్తులు ఇబ్బందిపడ్డారు.
చందనోత్సవం నిర్వహణలో అధికారులు వైఫల్యం
దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగిన పలువురు భక్తులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సింహాచలం చందనోత్సవంలో ఈసారి కూడా భక్తులు ఇబ్బందిపడ్డారు. బస్సులు అందుబాటులో లేక కాలినడకకే కిందికి దిగి వెళ్లారు. ఉత్సవ నిర్వహణలో ఏటా అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ఈసారీ అదే జరిగింది. వివిధ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. గత ఏడాది ఎన్నికల కారణంగా ప్రొటోకాల్ లేకపోవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా అంతకు ముందు ఏడాది చేదు అనుభవాలతో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కొండపైకి ప్రైవేటు వాహనాల సంఖ్య తగ్గించారు. బస్టాండులో రోప్ పార్టీలను పెట్టి వచ్చిన భక్తులను వచ్చినట్టుగా బస్సుల్లో ఎక్కించి కిందికి పంపించారు. ఎవరినీ బస్సు కోసం ఐదు నిమిషాలు కూడా వేచి ఉంచలేదు. దాంతో ఉత్సవం విజయవంతమైంది. ఈ ఏడాది కూడా ప్రైవేటు వాహనాలను అనమతించడం లేదని, వీవీఐపీలకు కూడా కొండ కింది నుంచి ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు పెట్టామని ప్రకటించారు. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటుచేశారు. అయితే ప్రతి ఒక్కరూ ప్రకటనలకే పరిమితమై, విధి నిర్వహణలో చిత్తశుద్ధి చూపించలేదు. ఊహించని విధంగా గోడ కూలి ఏడుగురు మరణించడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. పైకి వచ్చే వాహనాలను తగ్గించేశారు. కిందనే ఆపేశారు. అయితే ఆ ఘటనతో సంబంధం లేకుండా భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం వస్తూనే ఉన్నారు. భక్తులు వేల సంఖ్యలో వస్తుంటే బస్సులు ఒకటి, రెండు రావడంతో తోపులాటలు జరిగాయి. వీవీఐపీలు కొండ దిగువనే ఏసీ బస్సుల కోసం వేచి చూసి చూసీ పైకి వెళ్లే అవకాశం లేకపోవడంతో చాలామంది దర్శనం చేసుకోకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ప్రైవేటు వాహనాలు అనుమతించక, ప్రత్యేక వాహనాలు లేకపోతే ఎలా ఉంటూ భక్తులు శాపనార్థాలు పెట్టారు.
క్యూలైన్ల వద్ద కనిపించని స్కానింగ్
ప్రతిసారి క్యూలైన్ల వద్ద తోపులాటలు జరుగుతాయి. అక్కడే జెరాక్స్ కాపీ టిక్కెట్లు తెచ్చి క్యూలైన్‌లో దూరే ప్రయత్నం చేస్తారు. పోలీసులు టిక్కెట్లు లేని తమవారిని అక్కడే లోపలకు పంపిస్తారు. గత ఏడాది ప్రతి ఒక్కరి టిక్కెట్ తీసుకొని స్కానింగ్ చేసి, ఆ తరువాత మరో గేటు వద్ద దానిని పరిశీలించి పంపించారు. ఈసారీ అలాగే చేస్తామని ప్రకటించారు. కానీ ఆచరించలేదు. ఆలయ గోపురం ముందు ఏర్పాటుచేసిన రూ.వేయి, రూ.1,500 క్యూలైన్ల వద్ద తోపులాటలు జరిగాయి. వీటిని పరిమిత సంఖ్యలో ఇచ్చామని అధికారులు చెప్పగా, వందల సంఖ్యలో ఒకేసారి వచ్చి మీద పడిపోయారు. అక్కడే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నా పెద్దగా పట్టనట్టు ఊరుకున్నారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిస్థితిని గమనించి, అక్కడికి వెళ్లి దేవదాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడే ఉండి ఒకరి తరువాత మరొకరు రావాలని సూచించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. క్యూలైన్లను సరిగ్గా నడపాల్సిన పోలీసులు ఆ విధులు వదిలి ఇంకెక్కడో ఉండడంతో పర్యవేక్షించే దిక్కు లేకుండా పోయింది. దీనివల్ల టిక్కెట్లను స్కానింగ్ చేయలేదు. అది రూ.300 టిక్కెటా? వేయి రూపాయల టిక్కెటా? అని చూడకుండానే చింపేసి లోపలకు వదిలేశారు. ఇక్కడి నుంచే ఎక్కువ మంది అనధికారికంగా లోపలకు వెళ్లారు. ఒకసారి క్యూలైన్‌లోకి వెళితే ఆ తరువాత మళ్లీ చెక్ చేసే ఏర్పాట్లు చేయకపోవడంతో చాలామంది నేరుగా లోపలకు వెళ్లిపోయారు.
బస్సుల వెంట సీపీ పరుగులు
కొండపైన బస్డాండులో వేలాది జనం, ఒకటి అరా బస్సులు వస్తుండడంతో సీట్ల కోసం భక్తులు పరుగులు పెట్టారు. వేలాడుతూ కిందికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితిని గమనించిన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వారిని నివారించే ప్రయత్నం చేశారు. బస్సులు వస్తాయని, కాసేపు ఆగి వెళ్లాలని, బస్సుల వెంట పరుగులు తీయొద్దని సూచించారు. ఫుట్‌రెస్ట్‌పై వేలాడుతున్న వారిని కిందికి దించే ప్రయత్నం చేశారు. కళ్ల ముందు వైఫల్యం కనపడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
Updated Date - May 01 , 2025 | 01:13 AM