ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జిగా కోన తాతారావు

ABN, Publish Date - May 30 , 2025 | 12:49 AM

విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జిగా కోన తాతారావు నియమితులయ్యారు.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

వచ్చే నెల 27 నుంచి చైర్‌పర్సన్‌ ఇన్‌చార్జి హోదా

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జిగా కోన తాతారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కోన తాతారావు పర్సన్‌ ఇన్‌చార్జిగా వచ్చే నెల 26వ తేదీ వరకు ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం గత ఏడాది డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జిగా జాయింట్‌ కలెక్టర్‌ను నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వచ్చే నెల 26వ తేదీ వరకు అమల్లో వుంటాయి. అందువల్ల జేసీ స్థానంలో కోన తాతారావును నియమించారు. వచ్చే నెల 27వ తేదీ నుంచి ఆరు నెలల కాలానికి మరో జీవో తరువాత జారీచేస్తారు. సాధారణంగా డీసీసీబీ పాలకవర్గాన్ని అనధికార వ్యక్తులతో భర్తీ చేసేటప్పుడు చైర్‌పర్సన్‌ ఇన్‌చార్జి, మరో ఆరుగురు పర్సన్‌ ఇన్‌చార్జిలుగా (సభ్యులు) నియమించాలి. అయితే ప్రభుత్వం ఒక్కరినే నియమించడంతో కోన తాతారావును పర్సన్‌ ఇన్‌చార్జిగా పరిగణిస్తారు. వచ్చే నెలలో జారీచేయనున్న జీవోలో మొత్తం ఏడుగురితో పాలకమండలిని నియమించిన తరువాత కోన తాతారావును చైర్‌పర్సన్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు.


ఉక్కు యాజమాన్యం తీరుపై కాంట్రాక్టు కార్మికుల కన్నెర్ర

దశాబ్దాల నుంచి పనిచేస్తుంటే ఎలా తీసేస్తారని ఆందోళన

గంగవరం పోర్టులా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

ఉక్కు కర్మాగార యాజమాన్యం తీరుపై కాంట్రాక్టు కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి తామంతా ప్లాంటులో వివిధ పనులు చేస్తున్నామని, ఇప్పుడు అర్ధంతరంగా గేట్‌ పాసులు ఆపేసి, తీసేశామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉండి, చెప్పిన పనంతా చేస్తుంటే తమను పనుల నుంచి ఎలా తొలగిస్తారని వారు వాదిస్తున్నారు. యాజమాన్యానికి తాము ఆర్థిక భారంగా అనిపిన్తే ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ద్వారా ఎలా పరిహారం ఇచ్చారో.. అదేవిధంగా తమకూ పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో గంగవరం (అదానీ) పోర్టులో నిర్వాసిత కార్మికులు తక్కువ వేతనాలు ఇస్తున్నారని సుమారు 45 రోజులపాటు సమ్మె చేశారని, వారు తమకు అవసరం లేదని యాజమన్యం చెబితే అధికారులతో చర్చలు జరిగి ఒక్కో కార్మికుడికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇప్పించారని, తమకూ ఆ విధంగానే పరిహారం ఇప్పించాలని కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు. ‘కాంట్రాక్టు కార్మికుల సమ్మె-పరిష్కారం’ అనే అంశంపై కార్మికశాఖ అధికారులతో శుక్రవారం చర్చలు జరగనున్నాయని, అక్కడ కూడా తాము ఇదే డిమాండ్‌ను వెల్లడిస్తామని చెబుతున్నారు. ప్లాంటులో ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుందని, వారికి పరిహారం ఇవ్వడానికి కూడా బడ్జెట్‌ పెట్టుకుందని, అందులో కాంట్రాక్టు కార్మికులను ఎందుకు చేర్చడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ‘గేట్లు మూసేసి.. పనుల నుంచి తీసేశాం వెళ్లిపోండి’ అంటే ఎలా వెళ్లిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటును నమ్ముకుని 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని, ఏదో దారి యాజమాన్యమే తమకు చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

నేడు ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చలు

ఉక్కుటౌన్‌షిప్‌: స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం, కాంట్రాక్టు కార్మిక సంఘాల మధ్య రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో శుక్రవారం చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెలో ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు ఆసక్తికరంగా మారాయి. గతంలో పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ కార్మికులకు అనుకూలంగా ఏ నిర్ణయం రాలేదని, ఈసారైనా కార్మికులకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై ఇప్పటికే తాము స్పష్టమైన నిర్ణయం చెప్పామని, ఎవరినీ తొలగించబోమని ఉక్కు యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మిక నాయకులు కోరుతున్నారు.

Updated Date - May 30 , 2025 | 12:49 AM