ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఊపందుకున్న ఖరీఫ్‌ పనులు

ABN, Publish Date - Jul 25 , 2025 | 10:53 PM

ఏజెన్సీలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది మన్యంలో వర్షాలు పుష్కలంగా కురిశాయి. వరినారును సిద్ధంగా ఉండడంతో గిరిజన రైతులు వరినాట్లు వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.

హుకుంపేట మండలంలో జోగులపుట్టు ప్రాంతంలో వరి నాట్లు పూర్తయిన పంట పొలాలు

సమృద్ధిగా వర్షాలు

మే, జూన్‌ నెలల్లోనే వేసవి దుక్కులు పూర్తి

జూలై మొదటి వారం నుంచే నారుపోత

ప్రస్తుతం ముమ్మరంగా వరి నాట్లు పనులు

జిల్లా వ్యాప్తంగా 55,919 హెక్టార్లలో వరి సాగు

ప్రస్తుతానికి 12,239 హెక్టార్లలో వరి నాట్లు పూర్తి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో ఖరీఫ్‌ వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమయ్యారు. ఏజెన్సీలో ఎటు చూసినా వరినారుతో ఉన్న పంట పొలాలు, నాటు వేస్తున్న రైతులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లోనే సమృద్ధిగా వర్షాలు కురవడంతో వేసవి దుక్కి పనులను ఇప్పటికే పూర్తి చేశారు. అలాగే జూన్‌, జూలై నెలల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో ఆఖరు దుక్కి పనులు చేపట్టి, జూలై మొదటి వారం నుంచే వరినాట్లు వేస్తున్నారు. అలాగే ఆగస్టు ముగిసే నాటికి వరి నాట్లు పూర్తి చేసేలా వ్యవసాయ పనులను ముమ్మరం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 83,990 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతుండగా.. దానిలో వరి 55,919 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో వరి సాగవుతున్నప్పటికీ ఏజెన్సీలోని గిరిజన రైతులు తమ ఆహార అవసరాలకు మాత్రమే వాటిని వినియోగిస్తారు. దీంతో ఏజెన్సీలో వరి ఆహార పంటగా మాత్రమే తరతరాలుగా సాగవుతున్నది.

పాడేరు డివిజన్‌లో జోరుగా వరి నాట్లు

జిల్లాలో రైతులు వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ వరి విస్తీర్ణం 55,919 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి (జూలై 25నాటికి) 12,239 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి కేవలం 6,353 హెక్టార్లలో వరి నాట్లు వేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ అనుకూలంగా ఉంది. వర్షాలు పుష్కలంగా కురియడంతో రైతులు వరి నాట్లు జోరుగా వేస్తున్నారని వ్యవసాయాధికారులు అంటున్నారు. అలాగే జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కొయ్యూరు మినహా పది మండలాల్లో వరి నాట్లు ముమ్మరంగా పడుతున్నాయి.

రంపచోడవరం, చింతూరు డివిజన్ల ప్రారంభం కాని వరినాట్లు

రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలో ప్రస్తుతం వరి నాట్లు పడడం లేదు. ఇందుకు కారణాలు పరిశీలిస్తే.. ప్రతి ఏడాది జూలై నెలల్లో గోదావరి, శబరి నదులు ఉప్పొంగడంతో ఈ రెండు డివిజన్లలో వరదలు సంభవిస్తుంటాయి. దీంతో జూలైలో వరి నాట్లు వేస్తే వరదలకు నాశమవుతాయనే ఆలోచనతో అక్కడి రైతులు ఆగస్టులో వరి నాట్లు ప్రారంభించి సెప్టెంబరు మొదటి లేదా రెండో వారంతో పూర్తి చేస్తారు. ఆ కారణంగానే నేటికీ చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రంపచోడవరం, గంగవరం, వై.రామవరం, చింతూరు, కూనవరం, రాజవొమ్మంగి, వీఆర్‌.పురం, మారేడుమిల్లి మండలాల్లో వరి నాట్లు వేయని పరిస్థితి నెలకొంది. అయితే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు నంచి వర్షాలు కొనసాగుతుండడంతో ఖరీఫ్‌లో సాగు చేసే పంటలకు సాగునీటి సమస్య తలెత్తదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ వరి సాగు, ప్రస్తుతం నాట్లు వేసిన విస్తీర్ణం వివరాలు

వ.సం మండలం వరి విస్తీర్ణం నాట్లు వేసిన విస్తీర్ణం(హెక్టార్లలో)

1. అనంతగిరి 2,184 220

2. అరకులోయ 3,859 1,021

3. చింతపల్లి 3,419 172

4. జీకేవీధి 2,957 202

5. జి.మాడుగుల 3,532 1,615

6. హుకుంపేట 6,138 1,500

7. కొయ్యూరు 1,882 0

8. ముంచంగిపుట్టు 3,271 1,250

9. పాడేరు 3,659 1,826

10. పెదబయలు 4,249 2,745

11. డుంబ్రిగుడ 3,411 1,286

12. అడ్డతీగల 1,345 35

13. చింతూరు 4,472 0

14. దేవీపట్నం 1,483 0

15. మారేడుమిల్లి 429 0

16 ఎటపాక 984 192

17. రాజవొమ్మంగి 2,354 0

18. కూనవరం 886 0

19. వీఆర్‌.పురం 1,610 0

20. వై.రామవరం 915 3

21. గంగవరం 1,435 0

22. రంపచోడవరం 1,454 0

------------------------------------------------------------------------------------

మొత్తం హెక్టార్లలో 55,919 12,239

------------------------------------------------------------------------------------

Updated Date - Jul 25 , 2025 | 10:53 PM