ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీచ్‌రోడ్డులో ఖాకీల దందా

ABN, Publish Date - May 14 , 2025 | 12:51 AM

రుషికొండ ఐటీ సెజ్‌ సమీపంలో బీచ్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ఒక జంట వద్దకు బీచ్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది వెళ్లారు.

  • మందుబాబులు, ప్రేమ జంటలే టార్గెట్‌

  • మద్యం సేవించి వెళుతున్న వారిని ఆపి తనిఖీల పేరుతో హడావిడి

  • కేసు వద్దని వేడుకుంటే దూరంగా ఉండే దుకాణానికి వెళ్లి డబ్బులు ఇచ్చేయాలని సూచన

  • తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలంటూ ప్రేమ జంటలకు బెదిరింపు

  • ఇంట్లో తెలిస్తే ఇబ్బంది అవుతుందని వేడుకుంటే దుకాణంలో డబ్బులు ఇచ్చి వెళ్లాలని ఆదేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రుషికొండ ఐటీ సెజ్‌ సమీపంలో బీచ్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ఒక జంట వద్దకు బీచ్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది వెళ్లారు. స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిపిస్తామంటూ ఫోన్‌ నంబర్‌ అడిగారు. దాంతో బెదిరిపోయిన ఆ జంట... తమను వదిలేయాలని వేడుకోవడంతో సమీపంలోని ఒక మద్యం దుకాణం వద్దకు తీసుకువెళ్లి రూ.ఐదు వేలు ఫోన్‌ పే చేసి వెళ్లాలని ఆదేశించారు.

రుషికొండలోని ఒక దుకాణంలో మద్యం సేవించిన వ్యక్తిని దూరంగా ఉండి గమనించిన కానిస్టేబుల్‌ ఒకరు అనుసరించి, రుషివ్యాలీ సెంటర్‌ వద్ద ఆపి, బ్రీత్‌ ఎనలైజర్‌తో తనిఖీ చేస్తానని బెదిరించారు. మద్యం సేవించి ఉన్నానని, కేసులు వంటి తలనొప్పి వద్దని వేడుకోవడంతో సమీపంలోని ఒక పాన్‌షాప్‌లో రూ.రెండు వేలు ఇచ్చి వెళ్లిపోవాలని ఆదేశించారు.

నగరంలో కొంతమంది పోలీసులు బరితెగించి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు స్టేషన్‌లోనే దుకాణం తెరిస్తే, మరికొందరు స్టేషన్‌ పరిధిలో వివిధ వ్యాపారాలు చేసేవారి నుంచి మామూళ్లు గుంజుతున్నారు. ఇక జోడుగుళ్లపాలెం జంక్షన్‌ నుంచి భీమిలి వరకూ బీచ్‌ పెట్రోలింగ్‌, ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రక్షక్‌ విధులు నిర్వర్తించే వారిలో కొందరు బీచ్‌రోడ్డులో మందుబాబులు, ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

మద్యం దుకాణాలకు దూరంగా ఉండి ...అక్కడకు వెళ్లి తిరిగి వస్తున్న వారిపై నిఘా పెడుతున్నారు. మద్యం సేవించిన వ్యక్తి వాహనం స్టార్ట్‌ చేసి కొంచెం ముందుకువెళ్లగానే ఆపుతున్నారు. బ్రీత్‌ అనలైజర్లను నోటి వద్ద పెట్టి ఊదాల్సిందిగా కోరుతున్నారు. మద్యం సేవించిన వ్యక్తి భయంతో కేసు లేకుండా చూడాలని వేడుకోగానే...దానికోసమే ఎదురుచూస్తున్న సిబ్బంది డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. నేరుగా డబ్బులు తీసుకుంటే ఇబ్బంది కాబట్టి, సమీపంలోని మద్యం దుకాణానికి లేదంటే పాన్‌ షాపుల వద్దకు వెళ్లి డబ్బులు ఇచ్చేయాలని సూచిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పోలీస్‌ సిబ్బంది సూచించిన చోటకు వెళ్లి నగదు అందజేయడం, లేదా ఫోన్‌పే చేయడం చేస్తున్నారు. వారం రోజుల కిందట రిషి వ్యాలీ సెంటర్‌లో ఒక రు మద్యం సేవించి పోలీసులకు పట్టుబడగా, కేసు లేకుండా చూడాలని బాధితుడు వేడుకున్నాడు. దీంతో అతన్ని సమీపంలోని ఒక పాన్‌షాప్‌ వద్దకు పంపించి రూ.రెండు వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయం పీఎం పాలెం స్టేషన్‌ అధికారుల దృష్టికి చేరడంతో విచారణ ప్రారంభించినట్టు సమాచారం.

అలాగే రుషికొండ నుంచి తిమ్మాపురం వరకూ జంటలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తించే వివిధ విభాగాల పోలీసులు కొందరు వారి వద్దకు వెళ్లి స్టేషన్‌కు రావాలని బెదిరిస్తున్నారు. తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సమాచారం ఇచ్చేందుకు వారి ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలంటూ భయాందోళనకు గురిచేస్తారు. ఇంట్లో తెలిస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని, చెప్పొద్దని జంట వేడుకోగానే దీన్ని ఆసరాగా తీసుకుని వారి నుంచి వీలైనంత పిండేస్తున్నారు. ఇటీవల రుషికొండ ఐటీ సెజ్‌ సెంటర్‌లో ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఒక కానిస్టేబుల్‌ వెళ్లి వారిని బెదిరించి, రూ.ఐదు వేలు డిమాండ్‌ చేశాడు. తమ వద్ద డబ్బుల్లేవని, ఫోన్‌పే నంబర్‌ చెబితే నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని చెప్పడంతో, సమీపంలోని ఒక మద్యం దుకాణం వద్దకు పంపించి, యువతి ఫోన్‌ నుంచి రూ.ఐదు వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. ఇలా ఫోన్‌పే ద్వారా నగదు రూపంలో వచ్చిన మొత్తాన్ని రాత్రి దుకాణం కట్టేసే సమయంలో లెక్కకట్టి సదరు కానిస్టేబుల్‌ తీసుకుని జేబులు వేసుకుని వెళ్లిపోతారు. ఇలాంటి వ్యవహారం బీచ్‌రోడ్డులో నిత్యకృత్యంగా మారిందని మద్యం వ్యాపారులతోపాటు యువతీయువకులు చెబుతున్నారు. దీనిపై స్పెషల్‌బ్రాంచి పోలీసులకు సమాచారం అందడంతో బీచ్‌రోడ్డులోని మద్యం దుకాణాల వద్దకు వెళ్లి పోలీసులు ఫోన్‌పే ద్వారా సాగిస్తున్న వసూళ్ల గురించి ఆరా తీస్తున్నట్టు మద్యం వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - May 14 , 2025 | 12:51 AM