శతాబ్ది సంబరాలకు వేళాయె
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:59 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది.
నేటితో 99 ఏళ్లు పూర్తి చేసుకుని వందో వసంతంలోకి అడుగిడనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఏడాది పాటు ఉత్సవాల నిర్వహణ
అకడమిక్, అవుట్‌రిచ్, మెగా ఈవెంట్లు
నేడు పలు కార్యక్రమాలు
ఉదయం 6 గంటలకు బీచ్‌రోడ్డులో వాక్‌థాన్
మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో ప్రధాన కార్యక్రమం
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది. 1926 ఏప్రిల్ 26వ తేదీన ఏర్పాటైన విశ్వవిద్యాలయం శనివారంతో 99 ఏళ్లను పూర్తి చేసుకుని, వందో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో శనివారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 26వ తేదీ వరకు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ఏయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ శుక్రవారం ఉదయం కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఏడాదిపాటు అకడమిక్, అవుట్‌రిచ్, మెగా ఈవెంట్లు జరపాలన్నారు. మెగా ఈవెంట్లను విభిన్న విభాగాలు సంయుక్తంగా సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించాలన్నారు. సాధారణ సదస్సులకు భిన్నంగా ఈ మెగా ఈవెంట్లు ఉండాలని వీసీ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 26న శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సభ్యుల నుంచి కార్యక్రమాల నిర్వహణపై సూచనలు స్వీకరించారు. ఏయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ ఇ.ఎన్.ధనుంజయరావు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వాక్‌థాన్‌ను శనివారం ఉదయం ఆరు గంటలకు బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. అనంతరం సిరిపురం వద్ద ఉన్న సీఆర్ రెడ్డి సర్కిల్, స్నాతకోత్సవ మందిరం, ఏయూ పరిపాలనా భవనం వద్ద ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించనున్నట్టు తెలిపారు. ఆ తరువాత శతాబ్ది ఉత్సవాలను ప్రతిబింబిస్తూ ప్రత్యేకంగా తయారుచేసిన బెలూన్‌ను నగర పోలీస్ కమిషనర్ ఎగురవేస్తారన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగో ఆవిష్కరణ, ప్రత్యేక నృత్య రూపకల్పన, తదితర కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్, ఉప కులపతి, అతిథుల ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం 6.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. సమావేశంలో రెక్టార్ ఎన్.కిశోర్‌బాబు, ఏయూ క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విద్యుత్ దీప కాంతులతో ప్రాంగణం
శతాబ్ది ఉత్సవాల ప్రారంభం నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యుత్ కాంతులతో వెలుగులీనుతోంది. వర్సిటీ పరిపాలనా భవనం, ప్రవేశ మార్గాలు, విభాగాలు, పలు భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Updated Date - Apr 26 , 2025 | 12:59 AM