అంతర్జాతీయ వేడుకకు విశాఖ వేదిక కావడం గర్వకారణం: మంత్రి వంగలపూడి అనిత
ABN, Publish Date - May 25 , 2025 | 01:08 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కావడం మనందరికీ గర్వకారణమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కావడం మనందరికీ గర్వకారణమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. యోగా వేడుకలపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇది తమ కార్యక్రమంగా భావించాలని కోరారు. ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ విశాఖ నగరం అంతర్జాతీయ రికార్డుల్లో నమోదయ్యేదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఉక్కు యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కూర్మన్నపాలెం, మే 24 (ఆంధ్రజ్యోతి): ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆయన శనివారం సాయంత్రం కూర్మన్నపాలెంలో ఉక్కు కార్మికుల రిలే నిరాహార దీక్షల శిబిరానికి విచ్చేసి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ నిరంకుశ వైఖరితో కార్మిక, ప్రజా వ్యతిరేక విధాలను అవలంబిస్తుంటే ప్రశ్నించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఎన్నికల ముందు స్టీలుప్లాంటును కాపాడతామని హామీలు ఇచ్చి, గద్దె నెక్కిన తరువాత విస్మరిస్తున్నారన్నారు. ఉక్కు యాజమాన్యం, ప్రభుత్వాలు, పోలీసులు బెదిరిస్తే భయపడే రోజులు పోయాయని, సమ్మె ఇంకా ఉధృతం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొని ప్రధానమంత్రితో మాట్లాడి కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నారు. ఈ పోరాటంలో సీపీఎం వెన్నంటి ఉంటుందనీ, కార్మిక లోకమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్షులు ఎం.జగ్గునాయుడు, సీపీఎం నాయకులు కె.లోకనాథం, ఏఐటీయూసీ జాతీయ నాయకులు డి. ఆదినారాయణ, కార్మిక నేతలు జె.అయోధ్యరామ్, ఎన్.రామారావు, గణపతిరెడ్డి, యు.రామస్వామి, పరందామయ్య, స్టీలు కాంట్రాక్టు లేబర్ యూనియన్ అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బదిలీల కోసం 123 మంది హెచ్‌ఎంల దరఖాస్తు
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లో బదిలీలకు 123 మంది ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జడ్పీ హెచ్‌ఎంలు 102 మంది, మునిసిపల్ పాఠశాలల హెచ్‌ఎంలు 17 మంది, ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు నలుగురు ఉన్నారు. వీరికి సంబంధించి బదిలీల ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా ప్రాంతీయ విద్యా శాఖ, విశాఖ జిల్లా విద్యా శాఖ వెబ్‌సైట్స్‌లో పొందుపరిచారు. బదిలీలకు దరఖాస్తు చేసిన హెచ్‌ఎంలు వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు సరిచూసుకోవాలని, అభ్యంతరాలు ఉంటే ఆదివారం సాయంత్రంలోగా తెలపాలని పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ సంచాలకులు విజయభాస్కర్, విశాఖ డీఈవో ప్రేమ్‌కుమార్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు దరఖాస్తు గడువు పెంపు
స్కూలు అసిస్టెంట్ల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఆదివారం ఉదయం 11.45 గంటల వరకు పెంచామని విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి 12 గంటలతో గడువు ముగుస్తుందన్నారు. అయితే ఆదివారం ఉదయం 11.45 గంటల వరకూ గడువు పెంచినట్టు తెలిపారు.
రౌడీషీటర్లపై ఉక్కుపాదం
శాంతి ఆశ్రమం గొడవలో 17 మంది అరెస్టు
మరికొందరి కోసం గాలింపు
నేడు టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌లో దర్బార్
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులు నిర్ణయించారు. ఇటీవల శాంతి ఆశ్రమం భూవివాదంలో రౌడీషీటర్లు జోక్యం చేసుకుని కొట్టుకున్నారు. శాంతి ఆశ్రమం గొడవలో 25 మంది రౌడీషీటర్లు పాల్గొన్నట్టు ఎంవీపీ పోలీసులు గుర్తించారు. శాంతి ఆశ్రమం భూములపై గొడవపడుతున్న రెండు వర్గాల్లో ఒక వర్గం చిట్టిమాము గ్యాంగ్‌ను, మరో వర్గం పెంటకోట మధు అలియాస్ డాన్ మధు వర్గాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల రౌడీషీటర్లు 13న పరస్పరం కొట్టుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టికి వెళ్లింది. వివాదంలో జోక్యం చేసుకున్న రెండు వర్గాల రౌడీషీటర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతోపాటు మిగిలిన యాక్టివ్ రౌడీషీటర్లకు ముకుతాడు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో వివాదంలో జోక్యం చేసుకున్న రెండు వర్గాల రౌడీషీటర్ల కోసం ఎంవీపీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు సమాచారం. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు నగరంలో రౌడీషీటర్లందరినీ ఆదివారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగే దర్బార్‌కు హాజరుకావాలని అధికారులు ఆదేశించినట్టు తెలిసింది.
Updated Date - May 25 , 2025 | 01:08 AM