యోగాంధ్రపై శ్రద్ధ ఇదేనా?
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:29 PM
జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులు ఆశించిన స్థాయిలో శ్రద్ధ కనబరచలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాలైన పాడేరు, రంపచోడవరం, చింతూరుతో సహా జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది.
జిల్లా, డివిజన్, మండల స్థాయి యోగా వేడుకలపై అస్పష్టత
కేవలం గిరిజన విద్యార్థులను విశాఖపట్నం తరలింపుపైనే దృష్టి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులు ఆశించిన స్థాయిలో శ్రద్ధ కనబరచలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాలైన పాడేరు, రంపచోడవరం, చింతూరుతో సహా జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో యోగా వేడుకలు ఎక్కడ చేస్తారు?, ఎవరు చేస్తారనేది? స్పష్టత లేకుండా పోయింది. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులంతా విశాఖపట్నంలోని యోగా దినోత్సవ కార్యక్రమం విధుల్లో ఉన్నారు. కానీ జిల్లాలో నిర్వహించాల్సిన అంతర్జాతీయ యోగా దినోత్సవంపై కనీస ఆదేశాలు జారీ చేయకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక మండల స్థాయి అధికారులు అయోమయంలో పడ్డారు. కలెక్టర్ దినేశ్‌కుమార్ సైతం ప్రతి విద్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించడంతో విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు ఆ పనిలో ఉన్నారు. అయితే జిల్లా, డివిజన్, మండల స్థాయిలో యోగా దినోత్సవ నిర్వహణపై అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కేవలం పాఠశాలలకే పరిమితం కానున్నదని తెలుస్తున్నది.
విద్యార్థుల తరలింపుపై మాత్రమే శ్రద్ధ
విశాఖపట్నంలో 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 26 వేల మంది గిరిజన విద్యార్థులను తరలించాలనే దానిపైనే అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. అది కూడా కేవలం పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 106 ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులను 495 బస్సుల్లో విశాఖపట్నం తరలించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ప్రతి 25 మంది విద్యార్థులకు సహాయకులుగా ఒక టీచర్‌ను నియమించారు. కాగా విశాఖపట్నంలోని యోగా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రజలను తరలించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. అలాగే జిల్లాలో యోగాపై అవగాహన కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో నిర్వహించలేదు. దీంతో జిల్లాలో తొమ్మిదిన్నర లక్షల మంది జనాభా ఉండగా, యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు కేవలం 3,700 మంది మాత్రమే నమోదు చేసుకున్నారంటే ఈ కార్యక్రమంపై అధికారులకున్న శ్రద్ధ ఏపాటితో ఇట్టే అర్థమవుతున్నది. వాస్తవానికి ఉమ్మడి విశాఖపట్నం కేంద్రంగా జరిగే యోగా దినోత్సవానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో జనం తరలివెళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
విద్యార్థులను తరలించేందుకు 496 ఆర్టీసీ బస్సులు
పాడేరురూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 21న నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ నుంచి 26,395 మంది గిరిజన విద్యార్థులను తరలించేందుకు 498 ఆర్టీసీ బస్సులు గురువారం పాడేరు ఆర్టీసీ డిపోకు చేరుకున్నాయని జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి టి.ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలోని 54 ఆర్టీసీ డిపోలకు చెందిన 498 బస్సులను పాడేరు ఆర్టీసీ డిపోకు కేటాయించారన్నారు. ఆ బస్సులను పాడేరు డివిజన్ పరిధిలో 10 మండలాలకు విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా కేటాయించామన్నారు. విద్యార్థులను తరలించే బస్సులకు ఏమైనా సాంకేతిక లోపాలు వచ్చి మార్గమధ్యంలో నిలిచిపోతే అదనపు బస్సులను వినియోగిస్తామన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 11:29 PM