జల్ జీవన్ నిర్వహణ ఇలాగేనా?
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:20 PM
జల్ జీవన్ మిషన్ పథకం పనులు కొన్ని చోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. దీనికి ఉదాహరణే మండలంలోని మూలపేట పంచాయతీలోని జాజులబంధ గ్రామం. ఇక్కడ ఏడాది క్రితం ఇంటింటికీ కొళాయి కనెక్షన్ ఇచ్చారు. కానీ వాటర్ ట్యాంకు నిర్మించలేదు. మంచినీటి బోరు తవ్వి తాత్కాలికంగా మోటారు బిగించారు.
జాజులబంధ గ్రామంలో ఏడాది క్రితం మొక్కుబడిగా పనులు
ఇంటింటికీ కొళాయి కనెక్షన్ ఇచ్చి చేతులు దులిపేసుకున్న వైనం
వాటర్ ట్యాంకు నిర్మించలేదు
మోటారుకు సరైన విద్యుత్ కనెక్షన్ లేదు
గత్యంతరం లేక రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఊటనీరు తెచ్చుకుంటున్న మహిళలు
కలుషిత జలాల వల్ల వ్యాధుల బారిన గిరిజనులు
పట్టించుకోని అధికారులు
కొయ్యూరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): జల్ జీవన్ మిషన్ పథకం పనులు కొన్ని చోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. దీనికి ఉదాహరణే మండలంలోని మూలపేట పంచాయతీలోని జాజులబంధ గ్రామం. ఇక్కడ ఏడాది క్రితం ఇంటింటికీ కొళాయి కనెక్షన్ ఇచ్చారు. కానీ వాటర్ ట్యాంకు నిర్మించలేదు. మంచినీటి బోరు తవ్వి తాత్కాలికంగా మోటారు బిగించారు. ఇది పని చేయకపోవడంతో మహిళలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తమ కష్టాలు ఎప్పుడు తీరతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాజులబంధ గ్రామంలోని సుమారు 40 ఇళ్లలో 180 మంది పీవీటీజీ ఆదిమజాతి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి మంచినీటి వసతి లేకపోవడంతో ఏడాది క్రితం జల్ జీవన్ మిషన్ పథకంలో ఇంటింటికీ కొళాయి కనెక్షన్ వేశారు. వాటర్ ట్యాంకు నిర్మించకుండా బోరు వేసి మోటారు బిగించారు. అయితే దానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినా తగిన లోడ్ ఇవ్వకపోవడంతో మోటార్ ఆన్ చేస్తే ఫ్యూజులు కాలిపోతున్నాయి. దీని వల్ల గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో దీనిని వినియోగించడం మానేశారు. గత్యంతరం లేక గిరిజన మహిళలు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గల కుముర్ల వెళ్లే దారిలోని లోయలోకి వెళ్లి అక్కడ కొండవాగు ప్రవాహ ఊటనీటిని చిన్నపాటి ప్లేట్లతో పట్టుకుని కొండలు, గుట్టలు దాటుకుంటూ ఎంతో కష్టపడి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అవి కలుషిత జలాలు కావడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమకు నీటి కష్టాలు లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై మండల ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సాయిని వివరణ కోరగా ఈ సమస్య తన దృష్టికి రాలేదని, వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Updated Date - Apr 24 , 2025 | 11:20 PM