అధ్వాన దారికి మోక్షమెన్నడో?
ABN, Publish Date - Mar 18 , 2025 | 12:29 AM
ఆర్వీనగర్- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి ఎప్పటికి బాగుపడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉన్న ఈ రహదారిలో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రహదారి ప్రమాదకరంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు నైట్ సర్వీసు బస్సును రెండు నెలల క్రితం రద్దు చేశారు. దీంతో ఈ ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
గోతులమయంగా ఆర్వీనగర్- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్లు కేటాయించినట్టు ప్రకటించినా కదలిక శూన్యం
సీలేరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఆర్వీనగర్- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి ఎప్పటికి బాగుపడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉన్న ఈ రహదారిలో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రహదారి ప్రమాదకరంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు నైట్ సర్వీసు బస్సును రెండు నెలల క్రితం రద్దు చేశారు. దీంతో ఈ ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జీకేవీధి మండలం ఆర్వీనగర్ నుంచి వై.రామవరం మండలం పాలగెడ్డ వరకు గల 78 కిలోమీటర్ల రహదారిని 2014- 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్డుగా విస్తరించడానికి రూ.84 కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే అటవీశాఖ అనుమతులు మంజూరు కాకపోవడంతో ఈ పనులు ప్రారంభం కాలేదు. ఆ తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రహదారిని పట్టించుకోలేదు సరికదా, గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వేరే పనులకు మళ్లించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తరువాత అప్పటి కలెక్టర్ సుమిత్‌కుమార్ సప్పర్ల రెయిన్‌గేజ్ నుంచి నూతిబంద వరకు సింగిల్ లైన్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రెండవ దశలో నూతిబంద నుంచి ఆర్వీనగర్ వరకు పనులు చేపట్టడానికి అంచనాలను తయారు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ లోగా ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ఆ పనులకు బ్రేక్ పడింది. కాగా గత ఏడాది సెప్టెంబరు 8న భారీ తుఫాన్‌కు ఈ రోడ్డు కొట్టుకుపోయింది. కొండచరియలు విరిగిపడి బండరాళ్లు, చెట్లు కొట్టుకువచ్చి జీకేవీధి- సీలేరు మధ్య ఉన్న రోడ్డు దెబ్బతిన్నది. దీంతో నెల రోజులకు పైగా జీకేవీధి- సీలేరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుత కలెక్టర్ దినేశ్‌కుమార్, అప్పటి ఐటీడీఏ పీవో అభిషేక్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తాత్కాలికంగా రాకపోకలను పునరుద్ధరించారు. తుఫాన్ ప్రభావంతో ఈ రహదారి మరింత అధ్వాన స్థితికి చేరుకోవడంతో ఆర్‌అండ్‌బీ అధికారుల నివేదిక మేరకు గత డిసెంబరులో ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) గూడెంకొత్తవీధి నుంచి పాలగెడ్డ వరకు గల రోడ్డు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
నిధులు కేటాయించినట్టు ప్రకటించినా..
తుఫాన్ సహాయక నిధులు అల్లూరి జిల్లాకు రూ.46 కోట్లు మంజూరు అయితే ఇందులో రూ.23 కోట్లు ఆర్వీనగర్- పాలగెడ్డ రహదారికే కేటాయించామని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో ఆర్వీనగర్ నుంచి నూతిబంద వరకు గల రహదారికి, అలాగే సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల రహదారికి కూడా టెండర్ల ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. అయితే ఇంత వరకు పనుల్లో కదలిక కనిపించలేదు. ప్రస్తుతం ఆర్వీనగర్ నుంచి నూతిబంద వరకు, సప్పర్ల రెయిన్‌గేజ్ దిగువ నుంచి ధారాలమ్మ ఆలయం, ధార్లగొంది నుంచి దుప్పులవాడ, సీలేరు నుంచి పాలగెడ్డ వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. కొన్ని చోట్ల రోడ్డు ఆనవాళ్లు కూడా లేవు. మారుమూల ప్రాంతానికి వెళ్లే మట్టి రోడ్డును తలపిస్తోంది. ఈ మార్గంలో వెళ్లే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి అధ్వానంగా ఉండడంతో విశాఖపట్నం డిపో ఆర్టీసీ అధికారులు ఒక నైట్ సర్వీసును కూడా రెండు నెలల క్రితం రద్దు చేశారు. రహదారి నిర్మాణ పనుల జాప్యంపై పాడేరు ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబును వివరణ కోరగా ఆర్వీనగర్ నుంచి నూతిబంద, సీలేరు నుంచి పాలగెడ్డ వరకు గల రోడ్డు పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలని టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు సూచించామని ఆయన తెలిపారు.
Updated Date - Mar 18 , 2025 | 12:29 AM