కొత్త రేషన్ కార్డుల సందడి లేదాయె
ABN, Publish Date - May 19 , 2025 | 11:34 PM
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రిజిసే్ట్రషన్ కార్యాలయాలు జనంతో సందడిగా ఉండగా, అల్లూరి జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కొత్త రేషన్‌కార్డుకు వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువీకరణ తప్పనిసరి చేయడం, గిరిజనుల్లో 80 శాతం మంది వివాహితులకు ఎటువంటి రిజిస్ర్టేషన్ జరగకపోవడంతో దరఖాస్తులు చేసుకునేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడింది.
వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ నిబంధనే కారణం
జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తులు 491 మాత్రమే
గిరిజనుల్లో 80 శాతం వివాహాలకు ఎటువంటి రిజిస్ర్టేషన్ లేని పరిస్థితి
వివాహ రిజిసే్ట్రషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురి వేడుకోలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రిజిసే్ట్రషన్ కార్యాలయాలు జనంతో సందడిగా ఉండగా, అల్లూరి జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కొత్త రేషన్‌కార్డుకు వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువీకరణ తప్పనిసరి చేయడం, గిరిజనుల్లో 80 శాతం మంది వివాహితులకు ఎటువంటి రిజిస్ర్టేషన్ జరగకపోవడంతో దరఖాస్తులు చేసుకునేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా సచివాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎటువంటి హడావిడి లేకుండా పోయింది.
జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 22 మండలాల్లో ప్రస్తుతం 2 లక్షల 98 వేల 92 రేషన్‌కార్డులు, అందులో 8 లక్షల 69 వేల 318 మంది లబ్ధిదారులున్నారు. అయితే ఆయా రేషన్‌కార్డులను జారీ చేసి సుమారుగా మూడేళ్లయింది. దీంతో ఈ మూడేళ్లలో పలువురికి వివాహాలు జరగడంతో పాటు, గతంలో రేషన్‌కార్డులు పొందలేని వాళ్లు కొందరున్నారు. ప్రస్తుతానికి రేషన్‌కార్డులు లేని వాళ్లు వేల సంఖ్యలో ఉంటారనేది ఒక అంచనా. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
వివాహ రిజిస్ర్టేషన్ ధ్రువీకరణతో గిరిజనులకు చిక్కులు
కొత్త రేషన్‌కార్డులకు వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువీకరణ సమర్పించాలనే నిబంధనతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి ఏజెన్సీలో 80 శాతం మంది గిరిజనులకు వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువీకరణ జరగదు. సంప్రదాయబద్ధంగా వివాహాలు చేసుకునే వాళ్లు కొందరైతే, వివాహానాలను అట్టహాసంగా చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్లు మరికొందరు ఉన్నారు. ఈ క్రమంలో అధిక శాతం మంది గిరిజనులకు వివాహ ధ్రువీకరణ పత్రాలు లేవు. అయితే కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసేందుకు గ్రామ పంచాయతీ లేదా గ్రామ సచివాలయంలో ఇచ్చే వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అనుమతించడం లేదు. సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువపత్రాన్ని మాత్రమే పొందుపరచాలనే నిబంధన పెట్టారు. దీంతో గిరిజన ప్రాంతంలో అర్హులైన వాళ్లు సైతం కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి కేవలం 491 మంది మాత్రమే దరఖాస్తులు చేశారు.
వివాహ రిజిసే్ట్రషన్ ను మినహాయించాలని డిమాండ్
కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే క్రమంలో గిరిజనులకు వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వం సూచించిన వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలంటే.... దరఖాస్తుదారుడు తన ఫొటో, వివాహ ఆహ్వాన పత్రిక, వివాహం చేసుకున్న కల్యాణ మండపం లేదా దేవాలయంలోని వివాహం చేసుకున్నట్టుగా రశీదును పొందుపరచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని వివాహ రిజిసే్ట్రషన్ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. దానిని మాత్రమే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే గిరిజన ప్రాంతంలో తొలుత వివాహ పత్రికలు, కల్యాణమండపాలు లేదా దేవస్థానంలో వివాహం చేసుకున్న రిశీదులు వంటివి ఉండవు. దీంతో తమ వివాహాన్ని రిజిసే్ట్రషన్ చేయించుకునేందుకు సైతం అవకాశం లేని పరిస్థితి. ఈ క్రమంలో అర్హులైన గిరిజనులు సైతం కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను అధికారులు గుర్తించి గిరిజన ప్రాంతంలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులకు వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణను మినహాయించాలని, లేకుంటే అనేక మంది అర్హులైన గిరిజనులు అన్యాయమైపోతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - May 19 , 2025 | 11:34 PM