డిప్యూటీ మేయర్ జనసేనదే?
ABN, Publish Date - May 19 , 2025 | 12:43 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి పార్టీల మధ్య ఎట్టకేలకు అవగాహన ఒప్పందం కుదిరినట్టు తెలిసింది.
కూటమి నేతల మధ్య కుదిరిన అంగీకారం!
అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠ
ఉషశ్రీ, దల్లి గోవిందరెడ్డి మధ్య పోటీ
వైసీపీ నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పిస్తే టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం
నేడే డిప్యూటీ మేయర్ ఎన్నిక
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి పార్టీల మధ్య ఎట్టకేలకు అవగాహన ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆదివారం రాత్రి వరకు హోటల్ దసపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్టులో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, మేయర్ సుదీర్ఘంగా చర్చించి అవగాహనకు వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబట్టడంతో టీడీపీ నేతలు అంగీకరించాల్సి వచ్చినట్టు తెలిసింది. అయితే అభ్యర్థి ఎవరనే దానిపై మాత్రం జనసేన నేతలు ఒక నిర్ణయానికి రాలేదని భోగట్టా. 74వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ పేర్లను వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే ఉషశ్రీ వైసీపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి ఇటీవలే జనసేనలో చేరినందున ఆమె అభ్యర్థిత్వం పట్ల ఆ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవికి సాంకేతికంగా కూడా ఆమె అనర్హురాలని వాదిస్తున్నట్టు తెలిసింది. జనసేన నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన వారికే అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు తెలియవచ్చింది. జనసేన నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన భీశెట్టి వసంతలక్ష్మి పార్టీ ఫోర్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు అవకాశం ఇవ్వాలనుకున్నా ఆమె సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్‌గా ఉండడం అడ్డంకిగా మారింది. మరో కార్పొరేటర్ అయిన పీతల మూర్తియాదవ్ తనకు పదవి వద్దని ఇంతకుముందే స్పష్టం చేశారు. కానీ జనసేనకు డిప్యూటీ మేయర్ పదవిని ఇవ్వాల్సిందేనంటూ పార్టీ అధిష్టానానికి ఆయన పలుమార్లు లేఖలు రాశారు. దీనిపై స్పందించిన అధిష్టానం డిప్యూటీ మేయర్ పోస్టును తీసుకోవాల్సిందేనని స్థానిక జనసేన ప్రజాప్రతినిధులకు ఆదేశించడంతో ఆ పదవి కోసం వారు గట్టిగా పట్టుబట్టినట్టు సమాచారం. వీరిద్దరిని మినహాయిస్తే చివరకు జనసేన నుంచి 64వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచిన దల్లి గోవిందరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో ఆయనకే ఈ పదవి లభించవచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ ఉషశ్రీ కోసం జనసేనలోని కొందరు ప్రజాప్రతినిధులు బలంగా పట్టుబడుతుండడంతో ఆమె కూడా పోటీలో నిలిచినట్టయింది. జనసేనకే ఈ పోస్టును కేటాయించినట్టయితే టీడీపీ నుంచి డిప్యూటీ మేయర్ పదవిని ఆశించిన 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి, 76వ వార్డు కార్పొరేటర్ గంధం శీనివాసరావులకు నిరాశే మిగిలినట్టవుతుంది. యాదవ మహిళకు డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించకపోతే ఆ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావచ్చని పలువురు టీడీపీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు అవకాశం ఇస్తే మాత్రం తామంతా వ్యతిరేకంగా ఓటేసే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Updated Date - May 19 , 2025 | 12:43 AM