ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏయూ దూర విద్యలో ఆన్‌లైన్‌ కోర్సులకు స్వస్తి?

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:37 AM

దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్‌లైన్‌ కోర్సులకు స్వస్తి చెప్పే యోచనలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ఉన్నట్టు తెలిసింది.

  • మూడేళ్ల కిందట 11 కోర్సులు ప్రారంభం

  • తరగతుల నుంచి పరీక్షల నిర్వహణ వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే...

  • తుది పరీక్షలు మల్టీపుల్‌ చాయిస్‌ విధానంలో...!

  • మొదటి నుంచీ విమర్శలు

  • ప్రత్యేకంగా దృష్టిసారించిన వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌

  • రద్దుకు యోచన

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్‌లైన్‌ కోర్సులకు స్వస్తి చెప్పే యోచనలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ఉన్నట్టు తెలిసింది. ఈ కోర్సుల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఏయూ దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో కొన్ని కోర్సులు నిర్వహించాలని మూడేళ్ల కిందట (2022) అప్పటి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. తొలుత రెండు కోర్సులను, ఆ తరువాత మరో తొమ్మిదింటిని ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో 11 కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇందులో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (హిస్టరీ, ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకాం), ఎంకాం, ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎంఏ ఎకనామిక్స్‌, ఎంఏ హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఏ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎంఏ ఇంగ్లీష్‌, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ), ఎంఏ సోషియాలజీ వంటి కోర్సులు ఉన్నాయి. ఫీజు చెల్లింపు, తరగతులకు హాజరు, ఆఖరుకు పరీక్షలు నిర్వహణ కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే చేపడుతున్నారు. ఈ విధానం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు తొలి నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మల్టీపుల్‌ చాయిస్‌ విధానంలో పరీక్షలు నిర్వహించడంపై సీనియర్‌ ప్రొఫెసర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానంపై పునరాలోచన చేయాలంటూ అప్పటి ఉన్నతాధికారులను పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు కోరారు. ఒకరిద్దరు ప్రిన్సిపాల్స్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించే కోర్సులతో విద్యార్థులకు సబ్జెక్ట్‌ రాదని, అవకతవకలకు అవకాశం ఉందంటూ లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ అప్పటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే, తాజాగా వర్సిటీ ఉన్నతాధికారులు ఈ కోర్సుల నిర్వహణకు సంబంధించి పునఃపరిశీలించాలని దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌కు ఏయూ వైస్‌ చాన్సలర్‌ జీపీ రాజశేఖర్‌ సూచించినట్టు చెబుతున్నారు. మొదట మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ, ఆ తరువాత ఆన్‌లైన్‌లో కోర్సులకు స్వస్తి చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ కోర్సులను ఏయూ దూర విద్య, మరో రెండు ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా నిర్వహించడం గమనార్హం. ప్రవేశాల నుంచి పరీక్షలు నిర్వహణ వరకు అన్నీ ఆ రెండు సంస్థలే చూసుకుంటాయి.

మార్పులపై ఫోకస్‌

దూర విద్యా కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధించి పరీక్షా కేంద్రాల పెంపు, నిర్వహణలో అవకతవకలు వంటి వాటిపైనా వర్సిటీ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. దూరవిద్యను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నూతనంగా నియమితులైన డైరెక్టర్‌కు వీసీ సూచించినట్టు తెలిసింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి, ఆరోపణలకు కేంద్ర బిందువులుగా ఉన్న వారిని మార్చే ప్రక్రియ చేపట్టనున్నట్టు చెబుతున్నారు.


549 మంది డిజిటల్‌ అసిస్టెంట్లకు బదిలీ

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 549 మంది డిజిటల్‌ అసిస్టెంట్ల బదిలీలు సోమవారం నిర్వహించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు ఉమ్మడి జిల్లా డిజిటల్‌ అసిస్టెంట్లు హాజరయ్యారు. విశాఖపట్నం జిల్లా పంచాయతీ అఽధికారి ఎంఎన్‌వీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెరిట్‌/సీనియారిటీ జాబితా ప్రకారం ఆప్షన్లు తీసుకుని బదిలీలు చేశారు. కొందరు డిజిటల్‌ అసిస్టెంట్లు పోస్టింగ్‌ కోసం కూటమి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకువచ్చారు. కాగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 61 మంది ఫిషరీస్‌ అసిస్టెంట్లకు బదిలీ చేశారు. వ్యవసాయ శాఖలో రెండు రోజుల క్రితం చేపట్టిన బదిలీలకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.


207 మంది ఏఎన్‌ఎంలకు

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంల బదిలీలకు సంబంధించి సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యాలయంలో విశాఖ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,300 మంది ఉండగా, తొలిరోజు 207 మందిని బదిలీ చేశారు. మిగిలిన వారికి బుధవారం నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మంగళవారం పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఉండడంతో కౌన్సెలింగ్‌ నిర్వహించరు. ఏఎన్‌ఎంలను సొంత మండలాల్లో కాకుండా పక్క మండలాలకు బదిలీ చేస్తున్నారు. అయితే సొంత మండలాల్లో కొనసాగించాలంటూ కొందరు ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చారు. అయితే, ఆ లేఖలను పరిగణనలోకి తీసుకోకుండానే బదిలీలు ప్రక్రియను చేపట్టారు. డీపీఎంవో డాక్టర్‌ ఉమావతి, ఏవో విజయ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ విద్యాసాగర్‌లు బదిలీల ప్రక్రియ చేపట్టారు.


గంజాయి కేసులో ముద్దాయికి 14 ఏళ్ల జైలు

రూ.1.4 లక్షల జరిమానా

విశాఖ లీగల్‌/ఎలమంచిలి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా చేస్తున్న వ్యాన్‌ డ్రైవర్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1.4 లక్షల జరిమానా విధిస్తూ ప్రధాన మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఎం.వెంకటరమణ సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం పెద్దఉప్పలం గ్రామంలో నివాసం ఉంటున్న నల్ల తేజోమూర్తి (45) వ్యాన్‌ డ్రైవర్‌. 2019 ఫిబ్రవరి 3న ఎలమంచిలి పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో తేజోమూర్తికి చెందిన వ్యాన్‌లో 200 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. తేజోమూర్తిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎలమంచిలి సీఐ జి.నారాయణరావు కేసు నమోదు చేసి, విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం ముద్దాయి తేజోమూర్తిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్చునిచ్చారు.


నేడు సామాజిక పింఛన్లు పంపిణీ

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 1,58,662 మందికి సామాజిక పింఛన్ల కింద మంగళవారం రూ.69.59 కోట్లు పంపిణీ చేయనున్నారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,265 మందికి రూ.11.04 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,32,397 మందికి రూ.58.55 కోట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్‌దారులకు అందజేస్తారు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి డబ్బు పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 01:37 AM