చెరకు రైతులకు సాయం ప్రశ్నార్థకం?
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:45 AM
ఏటా ఖరీఫ్ సీజన్‌లో చెరకు రైతులకు పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, మడత పైపులు, గడ్డి మందులు సబ్సిడీ ధరకు అందించే చోడవరం చెరకు అభివృద్ధి మండలి సహకారం ప్రశ్నార్థకంగా మారింది.
- ఏటా రైతులకు చెరకు అభివృద్ధి మండలి ద్వారా పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు సరఫరా
- ఈ ఏడాది అరకొర బడ్జెట్‌తోనే సరిపెట్టిన వైనం
- గోవాడలో క్రషింగ్ ఆధారంగానే మండలికి నిధులు
- ఈ ఏడాది తగ్గిన క్రషింగ్
- వచ్చే సీజన్‌లో రైతులకు సబ్సిడీ సరకుల సరఫరా లేనట్టే?
చోడవరం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఏటా ఖరీఫ్ సీజన్‌లో చెరకు రైతులకు పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, మడత పైపులు, గడ్డి మందులు సబ్సిడీ ధరకు అందించే చోడవరం చెరకు అభివృద్ధి మండలి సహకారం ప్రశ్నార్థకంగా మారింది. ఏటా గోవాడ సభ్య చెరకు రైతులకు చెరకు అభివృద్ధి మండలి ద్వారా మడులకు నీరు పెట్టేందుకు అవసరమైన మడత పైపులు, పురుగు మందులు, రైతులు ఎక్కువగా ఉపయోగించే గడ్డి మందు, గమాక్సిన్, ఇత ర మందులు అందించేవారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం ఏటా ఫ్యాక్టరీ నిర్వహించే క్రషింగ్‌కు చెరకు సరఫరా చేసే రైతుల నుంచి టన్నుకు రైతుల నుంచి రూ.4 వసూలు చేసి, దానికి ఫ్యాక్టరీ తరఫున రూ.4 కలిపి టన్నుకు 8 రూపాయల చొప్పున చెరకు అభివృద్ధి మండలికి కేటాయించడం ఆనవాయితీ. ఇలా ఏడాదిలో ఎన్ని టన్నులు క్రషింగ్ చేస్తే ఆ మేరకు వచ్చిన నిధులను గోవాడ ఫ్యాక్టరీ ఈ చెరకు అభివృద్ధి మండలికి కేటాయించేది. చెరకు అభివృద్ధి మండలి అధికారులు ఈ నిధులతో ప్రతి ఏటారైతులు ఎక్కువగా ఉపయోగించే పురుగు మందులు, ఇతర వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసి, ఖరీఫ్ సీజన్‌లో రైతులకు వాటిని తక్కువ ధరకు అందించేది. ఏటా సీజన్ ముందు చెరకు అభివృద్ధి మండలి ద్వారా అందే సరకులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు దొరకుతుండడం వల్ల ఇక్కడ మడత పైపులు, గడ్డి మందు, ఇతర పురుగు మందులకు రైతుల నుంచి గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. స్థూలంగా ఈ చెరకు అభివృద్ధి మండలి ద్వారా రైతులకు అంతో ఇంతో వ్యవసాయ సీజన్‌లో సహకారం ఉండేది.
తగ్గిపోయిన సహకారం
ఏటా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఆడే క్రషింగ్ మీద ఆధారపడి ఈ చెరకు అభివృద్ధి మండలి బడ్జెట్ ఉండేది. గతంలో ఏడాదికి 5 లక్షల టన్నులు ఆడితే చెరకు అభివృద్ధి మండలికి రూ.40 లక్షల ఆదాయం వచ్చేది. దీంతో రైతులకు బాగానే సరకులు పంపిణీ చేసేవారు. అయితే క్రమంగా ఫ్యాక్టరీలో సీజన్ క్రషింగ్ తగ్గిపోతూ రావడంతో మండలి ఆదాయం కూడా పడిపోయింది. గత ఏడాది లక్షా 61 వేలు ఆడిన గోవాడ, ఈ ఏడాది చివరగా కేవలం లక్షా 9 వేల టన్నులతోనే ఆగిపోయింది. దీని వలన ఈ ఏడాది మండలికి కేవలం రూ.8 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ నిధులతోనే పరిమితంగానే పురుగు మందులు, మడత పైపులు కొనుగోలు చేసి వాటినే పంపిణీ చేసి మమ అనిపించారు.
వచ్చే సీజన్‌కు కష్టమే..
ఇక ఈ ఏడాది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ దాదాపుగా నిలిచిపోవడంతో చెరకు అభివృద్ధి మండలికి నిధులు ప్రశ్నార్థకంగా మారింది. గోవాడ ఫ్యాక్టరీకే ఆదాయం తగ్గడంతో చెరకు అభివృద్ధి మండలికి నిధులు వచ్చే దారి మూసుకుపోయినట్టుగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చెరకు అభివృద్ధి మండలి ద్వారా రైతులకు అందే సహకారం కూడా అనుమానంగానే ఉంది. చెరకు అభివృద్ధి మండలి ద్వారా ఈ ఏడాది రైతులకు అందిన పురుగు మందులు, పరికరాలే చివరివి అన్న అభిప్రాయం రైతాంగం నుంచి వ్యక్తమవుతున్నది.
Updated Date - Jul 13 , 2025 | 12:45 AM