అధ్వానంగా అంతర్ రాష్ట్ర రహదారి
ABN, Publish Date - May 30 , 2025 | 11:34 PM
గూడెంకొత్తవీధి, మే 30 (ఆంధ్రజ్యోతి): మూడు రాష్ట్రాలను కలిపే సీలేరు-చింతపల్లి అంతర్ రాష్ట్ర రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ఆర్‌వీనగర్ నుంచి లంకపాకలు వరకు రోడ్డుపై అడుగడుగునా భారీ గోతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోతులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహన చోదకులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
అడుగడుగున భారీ గోతులు..
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు
నిధులు విడుదలై ఏడు నెలలైనా ప్రారంభంకాని పనులు
గూడెంకొత్తవీధి, మే 30 (ఆంధ్రజ్యోతి):
మూడు రాష్ట్రాలను కలిపే సీలేరు-చింతపల్లి అంతర్ రాష్ట్ర రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ఆర్‌వీనగర్ నుంచి లంకపాకలు వరకు రోడ్డుపై అడుగడుగునా భారీ గోతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోతులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహన చోదకులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం కనీసం గోతులను పూడ్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసి ఏడు నెలలైనా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు.
సీలేరు-చింతపల్లి ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. అందులోను ఆర్‌వీనగర్ నుంచి లంకపాకలు వరకు పది కిలోమీటర్లు రోడ్డు మరీ దారుణంగా ఉంది. ప్రతి రోజూ ఈ రహదారిపై ఒడిశా, భద్రాచలం, హైదరాబాద్, సీలేరుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ రహదారిపై అడుగడుగున భారీ గోతులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క గొయ్యి అడుగు, రెండు అడుగుల లోతు కలిగి ఉంటుంది. దీంతో వాహనాలకు గోతుల వద్ద రహదారికి తగులుతున్నదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టితో గోతులు పూడ్చడంతో సమస్య తీవ్రం
ఆర్‌వీనగర్ నుంచి లంకపాకలు వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఉండడంతో వీటిని పూడ్చాలని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా జీకేవీధి సీఐ వరప్రసాద్‌ను ఆదేశించారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆయన భావించారు. దీంతో సీఐ వరప్రసాద్, ఎస్‌ఐ అప్పలసూరి ఎక్స్‌కవేటర్‌తో గోతులను ఎర్రమట్టితో పూడ్చారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్డు బురదమయమైపోయింది.ఎర్రమట్టి కావడంతో గోతుల వద్ద వాహనాలు జారిపోతున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు సమస్య మరింత తీవ్రమైంది. గోతుల వద్ద ఎర్రమట్టి బదులుగా గ్రావెల్ (క్రషర్ బుగ్గి) వేసివుంటే ఈ పరిస్థితి ఉండేదికాదు. అయితే పోలీసుల వద్ద క్రషర్ డస్ట్ వేసేందుకు సరిపడే నిధులు లేకపోవడం మట్టితోనే పూడ్చారు.
నిధులు విడుదలైన ప్రారంభంకాని పనులు
ఆర్‌వీనగర్ నుంచి పాలగెడ్డ వరకు 48 కిలోమీటర్ల రహదారి నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కసరత్తు ప్రారంభించింది. ఈ రహదారి నిర్మాణానికి 2024 నవంబరులో రూ.18.95 కోట్లు రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధులను మంజూరు చేసింది. నిధులు విడుదలై ఏడు నెలలు గడిచినప్పటికి నిర్మాణాలు ప్రారంభించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. రహదారిపై ఏర్పడిన గోతులను కూడా పడ్చేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రాంతీయ ప్రజలు, పర్యాటకులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైన ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి మరమ్మతులు, నూతన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రాంతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - May 30 , 2025 | 11:35 PM