‘ఉక్కు’లో ఆగని తొలగింపులు
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:43 AM
విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
తాజాగా మరో 170 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ జాబితా విడుదల
స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం మాట తప్పిందంటూ కార్మిక సంఘాల నాయకుల ఆగ్రహం
కుటుంబాలతో రోడ్డున పడ్డామని కార్మికుల ఆవేదన
ఉక్కుటౌన్‌షిప్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 170 మందిని ఉక్కు యాజమాన్యం తొలగించింది. స్టీల్‌ప్లాంటులో మార్చి 31న 1,503 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం మరో 170 మందిని తొలగించినట్టు జాబితాను విడుదల చేసింది. కాగా కాంట్రాక్టు కార్మికులను తొలగించరాదని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘ నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో 15వ తేదీ రాత్రి ఆర్‌ఎల్‌సీ సమక్షంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చల్లో... తాము సమస్యను ప్రభుత్వ పెద్దలను కలిసి వివరిస్తామని కార్మిక సంఘాల నాయకులు పేర్కొనగా, మే 20 వరకు తాము కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియను నిలిపివేస్తామని ప్లాంట్ యాజమాన్యం పేర్కొంది. అయినప్పటికీ ప్లాంట్ యాజమాన్యం తాజాగా 170 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చల్లో కార్మికులను తొలగించబోమని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు ఇప్పుడు తొలగింపు చర్యలకు పాల్పడడం దారుణమని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ప్లాంటులోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు శనివారం బీ-షిఫ్ట్ (మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు), సీ-షిఫ్ట్ (రాత్రి 10 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు)కు వచ్చిన 170 మంది కాంట్రాక్టు కార్మికులకు ఆదివారం ఉదయం ఆయా కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఫోన్ చేసి ఇకపై మీరు విధులకు రానవసరం లేదని, మీ గేటు పాసులను యాజమాన్యం రద్దు చేసిందని చెప్పడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మే 20 వరకు ఎటువంటి తొలగింపులు చేపట్టబోమని చెప్పిన ఉక్కు యాజమాన్యం నాలుగు రోజుల వ్యవధిలోనే మాట తప్పడం దారుణమని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఉన్నపలంగా తమను విధుల నుంచి తొలగించడంతో తాము కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామని పలువురు కార్మికులు వాపోతున్నారు. కార్మిక వర్గాన్ని ఉక్కు యాజమాన్యం మోసం చేస్తుందని దీనిపై తాము పోరాటాలకు దిగుతామని కార్మిక నాయకులు తెలిపారు.
కార్మికుల తొలగింపు సరికాదు
-నీరుకొండ రామచంద్రరావు, ఇంటక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కాంట్రాక్టు కార్మికులను మే 20 వరకు తొలగించబోమని ఉక్కు యాజమాన్యం ఆర్‌ఎల్‌సీ సమక్షంలో స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మరో 170 మందిని తొలగించడం సమంజసం కాదు. ఉక్కు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులపై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కార్మికుల తొలగింపు ప్రక్రియను నిలిపివేయకపోయినా, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోకపోయినా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం.
Updated Date - Apr 21 , 2025 | 12:43 AM