స్వయంశక్తి సంఘాల తీరుపై ఆరా..
ABN, Publish Date - May 17 , 2025 | 12:21 AM
నగరంలో రేషన్ డిపోలు నిర్వహిస్తున్న స్వయంశక్తి సంఘాల పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
రేషన్ డిపోల నిర్వహణలో వాటి పాత్రపై వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
కరోనా సమయంలో 60 సంఘాలకు డిపోల కేటాయింపు
వీటిలో సగానికిపైగా బినామీల చేతుల్లోనే..
సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న డీలర్ల సంఘ నేతలు
గాజువాక/అక్కయ్యపాలెం/ఆరిలోవ, మే 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రేషన్ డిపోలు నిర్వహిస్తున్న స్వయంశక్తి సంఘాల పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. స్వయంశక్తి సంఘాలకు కేటాయించిన రేషన్ డిపోలు సగానికి పైగా బినామీల చేతుల్లో ఉన్న విషయంపై ప్రభుత్వానికి ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. సంఘంలోని సభ్యులంతా కలిసి డిపో నిర్వహించి ఆర్థికంగా కొంతమేర నిలుదొక్కుకునేందుకు వీలుగా కేటాయిస్తే కొందరు వ్యక్తులు మాత్రం వీటిని స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ నేతల సిఫారుసుతో డిపోలను కేటాయించారు. దీనిపై ఇటీవల కొందరు కూటమి నాయకులు ప్రభుత్వం దృష్టికి.. ప్రధానంగా పౌరసరఫరాల శాఖా మంత్రి వద్ద ప్రస్తావించారు. దీంతో పౌరసరఫరాల కమిషనర్ విశాఖ జిల్లాలో స్వయంశక్తి సంఘాలు నిర్వహిస్తున్న రేషన్ డిపోల గురించి తెలుసుకుంటున్నారు. ఇటీవల రేషన్ డిపో డీలర్ల సంఘ నేతలు విజయవాడలో పౌరసరఫరాల కమిషనర్‌ను కలిసినపుడు పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సమయంలో స్వయంశక్తి సంఘాలకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పలువురు డీలర్లు పేర్కొంటున్నారు. దీనికి బలం చేకూరేలా తాజాగా రేషన్ డిపో డీలర్ల సంఘ నేతలు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులను కలిసి స్వయంశక్తి సంఘాలకు అనుకూలంగా మాట్లాడడం పట్ల పలువురు డీలర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డిపోల నిర్వహిస్తున్న స్వయంశక్తి సంఘాలు అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ అటువంటి వారికి ఎలా వత్తాసు పలుకుతారని ప్రశ్నిస్తున్నారు. స్వయంశక్తి సంఘాలకు కేటాయించిన డిపోలను కొందరు బినామీలు నిర్వహిస్తున్నారని, ఇంకా కొందరు బినామీలు తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న సంఘాలకే డిపోలను కేటాయించుకున్నారని గుర్తు చేస్తున్నారు.
కరోనా సమయంలో జిల్లాలో ఖాళీగా ఉన్న పలు రేషన్ డిపోలకు డీలర్లను కేటాయించడానికి ఇబ్బందులు వచ్చాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కానందున స్వయంశక్తి సంఘాలకు సుమారు 60 డిపోలను తాత్కాలిక ప్రాతిపదికన 2020లో కేటాయించారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా డిపోలకు డీలర్లను నియమించుకునే అధికారం పౌరసరఫరాల శాఖకు ఉందని అప్పట్లోనే అధికారులు స్పష్టం చేశారు. అయితే అప్పడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్న సంఘాలకే ఎక్కువ డిపోలను కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. నగరంలో ఎక్కువ డిపోలు నిర్వహిస్తున్న బినామీలు కొందరు తమ కుటుంబ సభ్యులను స్వయంశక్తి సంఘాల్లో సభ్యులగా చేర్పించి వైసీపీ నేతల సిఫారుసుతో డిపోలను చేజిక్కించుకున్నారు. అటువంటి డిపోలను బినామీలు నిర్వహిస్తుండగా, మరికొన్ని సంఘాల ఆఽధ్వర్యంలో నడుస్తున్నాయి. రేషన్ బియ్యం విక్రయిస్తున్న ముఠాల వలలో పడిన కొన్ని స్వయంశక్తి సంఘాలు అక్రమాలకు పాల్పడడంతో వారిపై పౌరసరఫరాల అధికారులు కేసులు నమోదు చేశారు.
ఇదిలావుండగా గత వైసీపీ ప్రభ్వుత్వ హయాంలోనే డిపో డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తే డీలర్ల సంఘ నేతలు, బినామీలు అడ్డుకున్నారు. నగరంలో 36 స్వయంశక్తి సంఘాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయించగా స్టే వచ్చింది. సుమారు ఏడాదిన్నరగా స్టే కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి కౌంటర్ వేయకుండా పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో గతంలో పనిచేసిన అధికారులను మేనేజ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసిన ప్రస్తుత కమిషనర్ విశాఖ జిల్లాలో స్వయంశక్తి సంఘాల పనితీరు, కేసు వ్యవహారంపై ఆరా తీశారు. కాగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం పలు స్వయంశక్తి సంఘాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాటిపై నిఘా పెట్టినట్టు తెలిసింది. దీనిపై రేషన్ డీలర్ల సంఘ నేతలు తాజాగా జిల్లా అధికారులను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారు గట్టిగా హెచ్చరించారని కొందరు డీలర్లు చెబుతున్నారు.
Updated Date - May 17 , 2025 | 12:22 AM