పంచాయతీలో నిధుల గోల్‌మాల్‌పై ఆరా
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:03 AM
స్థానిక మేజర్ పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు చేసి పంచాయతీకి జమ చేయకుండా సొంతానికి వాడుకున్న సిబ్బంది నుంచి నగదు రికవరీకి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ ఎస్ రాజు అధికారులను ఆదేశించారు.
- ఇంటి పన్ను వసూళ్లపై ఎమ్మెల్యే సమీక్ష
- పంచాయతీ నిధులను వాడుకున్న సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశం
చోడవరం, జూలై 15(ఆంధ్రజ్యోతి): స్థానిక మేజర్ పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు చేసి పంచాయతీకి జమ చేయకుండా సొంతానికి వాడుకున్న సిబ్బంది నుంచి నగదు రికవరీకి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ ఎస్ రాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీకి మంజూరైన నిధులు, వ్యయంపై ఆయన సమీక్ష చేశారు. పంచాయతీకి ఇంటి పన్నుల రూపంలో వసూలైన నిధులలో సుమారు రూ.14 లక్షలు పంచాయతీకి చెల్లించవలసిన సిబ్బంది, వాటిని చెల్లించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సిబ్బందిని నుంచి నిధుల రికవరీకి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే పంచాయతీలో ఈ ఏడాది కాలంలో వచ్చిన నిధులు, వాటిని దేనికి ఉపయోగించారు అనే విషయాలను ఆయన అంశాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా బ్లీచింగ్, సున్నం కొనుగోళ్లు, పారిశుధ్యం పనులు, విద్యుత్ సామగ్రి కొనుగోళ్లు, వీధి దీపాల నిర్వహణకు వ్యయం పేరిట చూపించిన నిధులకు సంబంధించి రికార్డులు పరిశీలించాలని ఎండీవోకు సూచించారు. పంచాయతీలో పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఎండీవో ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సర్పంచ్ నూకరత్నం పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 01:03 AM