అమానవీయం
ABN, Publish Date - May 24 , 2025 | 11:17 PM
చిన్నారి మృతదేహం తరలింపులో ఆ తల్లిదండ్రుల బాధలు వర్ణణాతీతం. తమ గ్రామానికి తీసుకురావలసిన మృతదేహాన్ని 46 కిలోమీటర్ల దూరంలో దించేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మార్గమధ్యలో చిన్నారి మృతదేహం
దించేసిన కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్
సరియా వరకు తీసుకెళ్లాల్సి ఉండగా
కొత్తవలసలో దించేసిన డ్రైవర్
ఇబ్బంది పడిన మారుమూల గిరిజనులు
చివరకు ఆటోలో తీసుకెళ్లిన తల్లిదండ్రులు
రోడ్డు లేకపోవడంతో ఐదు కిలోమీటర్లు
కాలినడకన చీమ్మ చీకటిలో తరలింపు
అనంతగిరి, మే 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదకోట పంచాయతీ మారుమూల మడ్రేబ్ గ్రామానికి చెందిన సీదరి శైలు, అర్జున్ దంపతులకు జన్మించిన రెండో చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో మే 8వ తేదీన విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. వైద్యసేవలు పొందుతుండగా ఈనెల 23వ తేదీ శుక్రవారం మృతి చెందింది. కేజీహెచ్ నుంచి అంబులెన్స్‌లో విజయనగరం జిల్లా కొత్తవలస వరకు తీసుకువచ్చి మృతదేహాన్ని అక్కడ దింపివేశారు. కొత్తవలసలో గిరిజనులను దించేయడంతో ఆ తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి. ఏమి పాలుపోని చిన్నారి తండ్రి అర్జున్ మడ్రేబ్ గ్రామంలోని బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో దేవరాపల్లి నుంచి ఆటోను రూ.6 వేలకు మాట్లాడి, మృతదేహాన్ని సరియా వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి చీమ్మచీకటిలో ఐదు కిలోమీటర్లు కాలినడకన చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ రాత్రి పది గంటలకు మడ్రేబ్ గ్రామానికి చేరుకున్నారు. కొత్తవలసలో తమను దించేయడంతో చాలా అవస్థలు పడ్డామని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. మడ్రేబ్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - May 24 , 2025 | 11:17 PM