కేజీహెచ్‌లో ఇన్‌చార్జి మంత్రి తనిఖీలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:52 AM
పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు.
వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా
రూ.కోటితో క్యాజువాలిటీ అభివృద్ధి
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం లక్ష్యం
మరో గైనకాలజీ వార్డు ఏర్పాటు
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశం
మహారాణిపేట, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ఆయన కేజీహెచ్‌లో క్యాజువాలిటీ, పిడియాట్రిక్, గైనిక్ విభాగాలను సందర్శించి అందుతున్న సేవలు, సదుపాయాలపై రోగులతో మాట్లాడారు. అనంతరం ఎథిక్స్ గ్యాలరీలో విభాగాధిపతులు, వైద్యులతో సమావేశమై వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని, వైద్యులు, సిబ్బంది అందుకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. రూ.కోటితో క్యాజువాలిటీ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మరో గైనిక్ వార్డు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మూడు నెలల్లో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది రోగులకు సంతృప్తికరమైన సేవలు అందించాలని ఆదేశించారు. సెక్యూరిటీ, పారిశుధ్య సేవలను మరింత మెరుగుపరచాలని, యూజీడీ వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచించారు. దశల వారీగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని మంత్రి తెలిపారు. ఫార్మసీ కౌంటర్లు పెంచాలని, టోకెన్ డిస్‌ప్లే వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. కేజీహెచ్‌లో అదనపు పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కేవలం కేజీహెచ్‌పైనే భారం పడకుండా అనుబంధఆసుపత్రుల్లో మెడికో లీగల్ కేసుల పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. జనన ధ్రువీకరణ, శిశు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఏఎంసీ విద్యార్థుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి డోలా తెలిపారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్, కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వాసవి లత, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ఆర్‌ఎంవో డాక్టర్ మెహర్ కుమార్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:52 AM