33 ఏళ్లుగా రేకుల షెడ్డులోనే..
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:16 PM
జీకేవీధి మండలం సీలేరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ గత 33 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. పక్కా భవనం నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. దీంతో విద్యార్థులు అరకొర వసతుల నడుమ విద్యను కొనసాగిస్తున్నారు.
పక్కా భవనం లేని సీలేరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ
పలు మార్లు వినతులు ఇచ్చినా ఫలితం శూన్యం
హాస్టల్ సదుపాయం లేక విద్యార్థుల అవస్థలు
సీలేరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి) : జీకేవీధి మండలం సీలేరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ గత 33 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. పక్కా భవనం నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. దీంతో విద్యార్థులు అరకొర వసతుల నడుమ విద్యను కొనసాగిస్తున్నారు.
సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల 1992లో మంజూరైంది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజు కృషితో బైసీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులను మంజూరు చేశారు. 1997 వరకు ఇక్కడ నాలుగు గ్రూపులు కొనసాగాయి. అయితే 1998 నుంచి ఈ కాలేజీలో సైన్స్ గ్రూపుల్లో విద్యార్థుల చేరిక తగ్గిపోవడంతో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లను ఎత్తేసి, ఆ గ్రూపులను కేడీపేట(కృష్ణదేవిపేట) జూనియర్ కాలేజీకి తరలించారు. ఇక్కడ ఉన్న సైన్సు ల్యాబ్ సామగ్రిని కూడా కృష్ణదేవిపేటకు తరలించారు. దీంతో 1998 నుంచి సీలేరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులే కొనసాగుతున్నాయి. వాస్తవానికి 1992లో కళాశాల మంజూరైనా భవనాలు అందుబాటులో లేకపోవడంతో అప్పటి ఏపీ ఎస్‌ఈబీ ర(ప్రస్తుతం జెన్‌కో) అధికారులు ఆఫీసు గది, సైన్స్ ల్యాబ్, తరగతి గదుల కోసం తాత్కాలికంగా నాలుగు గదులతో కూడిన రేకుల షెడ్డు నిర్మించి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కళాశాల ఈ రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. కళాశాలకు పక్కా భవనం నిర్మించాలని అప్పటి నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన ప్రిన్సిపాల్స్.. ప్రజాప్రతినిధులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ కళాశాలలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో 100 నుంచి 150 మంది విద్యార్థులు చదువుతున్నారు.
విద్యార్థులకు తప్పని అవస్థలు
కళాశాలను రేకుల షెడ్డులో నిర్వహిస్తుండడంతో వర్షాకాలం మినహా మిగతా సీజన్లలో ఎండ వేడికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు ధారకొండ, మంగంపాడు, డొంకరాయి, గూడెంకొత్తవీధి తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఇక్కడ హాస్టల్ వసతి లేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఇక్కడ ఏపీ జెన్‌కో అధికారులు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం రెండు క్వార్టర్స్‌ను తాత్కాలికంగా కేటాయించారు. అయితే ఇక్కడ కొత్త ప్రాజెక్టు వస్తున్న తరుణంలో వారి అవసరాల నిమిత్తంగా వాటిని జెన్‌కో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలేజీ ప్రిన్సిపాల్ జెన్‌కో అధికారులను కలిసి విద్యార్థులకు క్వార్టర్స్ కేటాయించాలని కోరినా స్పందించలేదు. విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని విద్యాశాఖా మంత్రి లోకేశ్, కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు ఆయన వినతిపత్రాలు పంపారు.
Updated Date - Jun 17 , 2025 | 11:16 PM