బేఖాతరు..
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:15 AM
నర్సీపట్నంలోని పురావస్తు శాఖ స్థలంలో అక్రమ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం పునాదుల కోసం గోతులు తవ్వించిన ఆక్రమణదారులు.. ఆదివారం కాంక్రీట్ పిల్లర్ల పనులు చేయించారు. రెండు రోజుల నుంచి పురావస్తు శాఖ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తయినా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
పురావస్తు శాఖ స్థలంలో ఆగని అక్రమ నిర్మాణాలు
ప్రధాన రహదారి వైపు పరదాలుకట్టి గుట్టుచప్పుడు కాకుండా పనులు
స్పందించని మునిసిపల్, రెవెన్యూ అధికారులు
అనకాపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలోని పురావస్తు శాఖ స్థలంలో అక్రమ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం పునాదుల కోసం గోతులు తవ్వించిన ఆక్రమణదారులు.. ఆదివారం కాంక్రీట్ పిల్లర్ల పనులు చేయించారు. రెండు రోజుల నుంచి పురావస్తు శాఖ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తయినా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
స్వాతంత్య్ర పోరాట సమయంలో మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరులు దామనాపల్లి ఘాట్‌లో దాడి చేసి, బ్రిటీష్ సైనిక అధికారులు క్రిస్టోఫర్ విలియం స్కాట్ కవర్డ్, లియోనెల్ నెవెల్లీ హైటర్ హతమార్చారు. అనంతరం అప్పటి బ్రిటీష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మృతదేహాలను నర్సీపట్నం తీసుకువచ్చి, ఆర్‌అండ్‌బీ బంగ్లాకు సమీపంలో సుమారు 46 సెంట్ల స్థలంలో ఖననం చేశారు. సమాధులున్న ప్రదేశం కావడంతో చాల కాలంపాటు ఈ స్థలం వైపు ఎవరూ చూసే వారుకాదు. అయితే ప్రధాన రహదారి పక్కన వుండడం, క్రమేణా పట్టణం విస్తరించడంతో స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో సమాధుల స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్నారు. చివరకు 19 సెంట్లు స్థలం మిగిలింది. ఈ నేపథ్యంలో 2011లో స్థలం పరిరక్షణ బాధ్యతలను పురావస్తు శాఖ తీసుకుంది. కాగా మెయిన్ రోడ్డుని ఆనుకొని వున్న దుకాణాలను గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పడగొట్టారు. ఇదిలావుండగా కొద్ది రోజుల క్రితం సమాధులున్న ప్రదేశంలో మరికొంత స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరిగాయి. స్థలం పరిరక్షణ, అభివృద్ధి కోసం అల్లూరి స్మారక ప్రాంతాల పరిరక్షణ ప్రతినిధి సత్యనారాయణరావు న్యాయ సేవాధికార సంస్థలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 10 తేదీన న్యాయమూర్తి షియాజ్‌ఖాన్ సమాధుల స్థలాన్ని సందర్శించి పరిక్షణ చర్యలు తీసుకోవాలని మునిసిపల్, రెవెన్యూ, పురావస్తు శాఖ ఏడీకి ఆదేశించారు. తక్షణమే సరిహద్దులు నిర్ణయించాలని చెప్పారు. దీంతో పురావస్తు శాఖ ఏడీ షణ్ముఖరావు బ్రిటీష్ సైనిక అధికారుల సమాధుల స్థలం స్కెచ్, సరిహద్దు వివరాలు అందించాని తహసీల్దార్‌ని కోరారు. గత గురువారం మెయిన్ రోడ్డు వైపు గ్రీన్ మ్యాట్ (పరదాలు) కట్టి, లోపల నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మునిసిపల్ కమిషనర్ సురేంద్ర, ఆర్టీవో కార్యాలయం సిబ్బంది వెళ్లి పరదాలు తొలగించారు. శుక్రవారం రాత్రి మళ్లీ గ్రీన్ మ్యాట్ కట్టి పునాదులు తవ్వడం మొదలు పెట్టారు. శనివారం, ఆదివారం పనులను మరింత వేగవంతం చేశారు. సిమెంట్ కాంక్రీట్ పిల్లర్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రే గ్రీన్ మ్యాట్ కట్టినప్పటికీ మునిసిపల్, రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడ లేదు. ఈ విషయంపై నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
Updated Date - Jul 28 , 2025 | 12:15 AM