ఉపాధి కల్పించకపోతే చంపేయండి
ABN, Publish Date - May 29 , 2025 | 01:44 AM
పనులు లేక ఆకలితో అలమటిస్తున్నామని, ఉపాధి కల్పించలేకపోతే తమను చంపేయాలని ఉక్కు అధికారుల ఎదుట స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు...బుధవారం కూడా కాంట్రాక్టు కార్మికులు అడ్మిన్ భవనం ముట్టడికి యత్నించారు. తొలుత ప్లాంటు గేట్లను దిగ్బంధించాలని కార్మిక నాయకులు పిలుపు నిచ్చినప్పటికీ అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ఉక్కు అధికారుల ఎదుట
కాంట్రాక్టు కార్మికుల తీవ్ర ఆవేదన
రెండో రోజూ కొనసాగిన
స్టీల్‌ప్లాంటు పరిపాలనా భవనం ముట్టడి
పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర తోపులాట
నేడు, రేపు దీక్షా శిబిరం వద్ద నిరసనలు
30న ఆర్‌ఎల్‌సీ సమక్షంలో
చర్చల తరువాత భవిష్యత్తు కార్యాచరణ
ఉక్కుటౌన్‌షిప్, మే 28 (ఆంధ్రజ్యోతి):
పనులు లేక ఆకలితో అలమటిస్తున్నామని, ఉపాధి కల్పించలేకపోతే తమను చంపేయాలని ఉక్కు అధికారుల ఎదుట స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు...బుధవారం కూడా కాంట్రాక్టు కార్మికులు అడ్మిన్ భవనం ముట్టడికి యత్నించారు. తొలుత ప్లాంటు గేట్లను దిగ్బంధించాలని కార్మిక నాయకులు పిలుపు నిచ్చినప్పటికీ అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉదయం ఎని మిది గంటలకు అడ్మిన్ భవనం వద్దకు చేరుకుని లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నడుమ తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కార్మికులు కింద పడిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అడ్మిన్ భవనం ముందే కార్మికులు బైఠాయించారు. ప్లాంటు కోసం సర్వం త్యాగం చేశామని, భూములు, ఇళ్లు కోల్పోయామని, శాశ్వత ఉపాధి లేక కూలి పనులు చేస్తున్నామని, ఇప్పుడు అవి కూడా లేవంటున్నారని అక్కడకు వచ్చిన అధికారులు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పించకపోతే తమను చంపేయాలన్నారు. ఇదిలావుండగా ప్లాంటులో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన రేపు
గురు, శుక్రవారాల్లో కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద భారీఎత్తున నిరసన కార్య క్రమాలు చేపడతామని కాంట్రాక్టు కార్మిక నాయకులు తెలిపారు. శుక్రవారం ఆర్‌ఎల్‌సీ (రీజనల్ లేబర్ కమిషనర్) సమక్షంలో చర్చలు జరగనున్నాయని, చర్చల అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:00 PM