ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అవినీతిని సహించను

ABN, Publish Date - Jun 25 , 2025 | 01:10 AM

‘‘డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. నలుగురికి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చా. అవినీతిని సహించను.

  • నలుగురికి సేవ చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చా

  • డబ్బు సంపాదించడానికి కాదు

  • దీర్ఘకాలిక లక్ష్యాలపైనే దృష్టి

  • వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం

  • రైల్వే జోన్‌ పనులు ప్రారంభింపజేశాం

  • భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలోగా 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం

  • ఎవరితోను విభేదాలు లేవు...

  • అందరితో కలిసి పనిచేస్తున్నా

  • కైలాసగిరిపై 50 ఎకరాల్లో పర్యాటక కేంద్రం అభివృద్ధి

  • దేశంలో టాప్‌ 10 నగరాల్లో విశాఖపట్నం ఉండేలా చేస్తాం

  • ఎంపీ ఎం.శ్రీభరత్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. నలుగురికి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చా. అవినీతిని సహించను. ఎవరైనా తప్పులు చేసి రక్షించాలంటూ నా దగ్గరకు వస్తే క్షమించేంత సుగుణం లేదు. ఈ ఐదేళ్లలో ఏదో ఒకటి చేయాలి అని కాకుండా రాబోయే 40 ఏళ్లకు ఏది అవసరమో ఇప్పుడే ఆలోచించి అందుకు తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నా. స్వల్ప కాలిక లక్ష్యాలు కంటే దీర్ఘకాలిక లక్ష్యాలే ముఖ్యం అని నమ్ముతా.’’

- విశాఖపట్నం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎం.శ్రీభరత్‌ ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. ఈ ఏడాదిలో ఏమి చేశారు?, ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారో మంగళవారం వివరించారు. ఆయన మాటల్లోనే...

వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. వాటిని మళ్లీ పట్టాలపైకి తీసుకువస్తున్నాము. ఆంధ్రా యూనివర్సిటీ ఎంత చెడ్డపేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. సమర్థుడైన వ్యక్తిని వీసీగా పెట్టి మంచి టీమ్‌ సెట్‌ చేశాము. కేజీహెచ్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీలకు కూడా ఇలాగే మంచి అధికారులను పెట్టాము. మార్పు ఒక్కసారిగా రాదు. క్రమంగా ఫలితాలు వస్తాయి.

- ప్రజలకు నాయకుల వల్ల నష్టం జరుగుతుందనే ఆందోళన లేకుండా చేశాము. ఆస్తులు కొల్లగొట్టుకుపోరనే విశ్వాసం ఇచ్చాము. నియోజకవర్గాల్లో రౌడీయిజం చేసే, భూకబ్జాలకు పాల్పడే వారిని కటకటాల వెనక్కి పంపుతున్నాము.

- రైల్వే జోన్‌ సాధించాము. శంకుస్థాపన చేయించి పనులు కూడా ప్రారంభింపజేశాము. జీఎంను తీసుకువచ్చాం. ఇంకొద్ది రోజుల్లో గెజిట్‌ కూడా ఇప్పిస్తాం. రైల్వే బోర్డు ఉద్యోగాలకు పరీక్షలు కూడా ఇక్కడ రాసుకునే సౌలభ్యం కల్పిస్తా. రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ బడ్జెట్‌ రూ.500 కోట్లకు పెంచి, ఎనిమిది ప్లాట్‌ఫారాలను 14కు పెంచబోతున్నాము. దీనివల్ల దువ్వాడ, అవుటర్‌లో రైళ్లు ఆపాల్సిన దుస్థితి పోతుంది.

- స్టీల్‌ప్లాంటుకు కేంద్రం నుంచి రూ.11,440 కోట్లు ఇప్పించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.2 వేల కోట్లు ఇచ్చాము. త్వరలో కొత్త సీఎండీ, డైరెక్టర్లు కూడా రాబోతున్నారు. తప్పకుండా ప్లాంటు లాభాల్లోకి వస్తుంది.

- విశాఖపట్నం జూను సింగపూర్‌ జూ తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము. దీనికి కేంద్రం సాయం కూడా తీసుకుంటాం. మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. వీఎంఆర్‌డీఏకు ఆదాయం పన్ను శాఖ నుంచి రూ.90 కోట్లు వెనక్కి రప్పించాము.

- భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలోపు 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం పూర్తయ్యేలా పనులు చేపడుతున్నాము. పెందుర్తి-బౌడారా రోడ్డుకు రూ.956 కోట్లు మంజూరు చేయించాం. విశాఖ జిల్లాకు రూ.178 కోట్లతో వర్కింగ్‌ విమెన్‌ హాస్టళ్లు మంజూరు చేయించాం.

- విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెంచడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాం.

- రెండు మెగా జాబ్‌ ఫెయిర్లు నిర్వహించి 5 వేల మందికి ఉపాధి కల్పించాం.

- ఆరిలోవలో 50 ఎకరాల్లో రూ.14 కోట్లతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించబోతున్నాం. అదే విధంగా తైక్వాండో ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఒకటి తీసుకువస్తాం. కైలాసగిరిపై 50 ఎకరాల్లో పర్యాటక కేంద్రం అభివృద్ధి చేస్తాం. దేశంలో టాప్‌ 10 నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా ఉండేలా చేస్తాం.

- చిట్టెంపాడు గ్రామానికి పీఎం జన్‌మన్‌ ద్వారా రూ.14 కోట్లు ఇప్పించాం. ఎస్‌.కోటలో పీఏం ఉషా ద్వారా రూ.6 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం చేయిస్తున్నాం.

ప్రశ్న: మీకు, ఎమ్మెల్యేలకు కొంత గ్యాప్‌ ఉందని ప్రచారం జరుగుతోంది. నిజమేనా?

జవాబు: పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందరితోను సత్సంబంధాలు ఉన్నాయి. నాకైతే ఎటువంటి ఈగో లేదు. అందరితో కలిసి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనేదే నా ఆకాంక్ష. నియోజకవర్గ ప్రజలు వారి కంటే నన్నే బాగా ఆశీర్వదించారు. ప్రతిచోట వారికంటే నాకే నాలుగు ఓట్లు అధికంగా వచ్చాయి. వారికి, నాకు మధ్య రాజకీయంగా ఏమీ లేదు.

ప్ర: ఫ్లైఓవర్లు నిర్మించకుండా మెట్రో రైలు ప్రాజెక్ట్‌ నిర్మించడం అవసరమా? అనే విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం?

జ: మెట్రో రైలు ప్రాజెక్టు వస్తే ఇక నగరంలో ఫ్లైఓవర్ల అవసరం ఉండదు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి వెంటనే ఫ్లైఓవర్లు నిర్మించాలని అంతా కోరుతున్నారు. ఇప్పుడు వాటిని నిర్మిస్తే ఆ తరువాత మెట్రో లైన్‌ వేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. మేము నేటి గురించి ఆలోచించడం లేదు. రేపటి గురించి పనులు చేస్తున్నాము. డబుల్‌ డెక్కర్‌ నిర్మాణం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

ప్ర: ఎంపీ నిధులు వేటికి ఉపయోగిస్తున్నారు?

జ: ఐదేళ్లలో రూ.25 కోట్లు వస్తాయి. ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు అడిగా. వారు పంపిన వాటిని పరిశీలించి, ప్రజలకు ఉపయోగపడే వాటినే ఆమోదిస్తున్నా. విద్య, ఆరోగ్యం, స్పోర్ట్స్‌ కోసం నిధులు ఖర్చు చేయాలనేది నా ఆలోచన.

Updated Date - Jun 25 , 2025 | 01:10 AM