ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంకెన్నాళ్లీ నిరీక్షణ!

ABN, Publish Date - Jul 21 , 2025 | 12:34 AM

అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలను పేద రోగులకు ఉచితంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

  • అందుబాటులోకి రాని సిటీ డయోగ్నోస్టిక్‌ సెంటర్‌

  • చర్యలు తీసుకోవడంలో అధికారుల తాత్సారం

  • రూ.21 కోట్లతో విమ్స్‌లో సిద్ధమైన అధునాతన భవనం

  • ఖరీదైన పరీక్షలు ఉచితంగా నిర్వహించడమే లక్ష్యం

  • ప్రారంభించడంపై దృష్టి సారించాలని కోరుతున్న రోగులు

అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలను పేద రోగులకు ఉచితంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటుకు వీలుగా విమ్స్‌లో అత్యంత ఆధునిక భవనం సిద్ధమైనా ఫలితం కనిపించడం లేదు. పరికరాల కొనుగోలు, ప్రారంభోత్సవం దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పరీక్షల కోసం రోగులకు నిరీక్షణ తప్పడం లేదు.

విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై స్పష్టత కొరవడింది. నిరుపేదలకు ఖరీదైన పరీక్షలను ఉచితంగా నిర్వహించే ఉద్దేశంతో ఇక్కడ సుమారు రూ.21 కోట్లు వ్యయంతో అధునాతన భవన సముదాయాన్ని నిర్మించారు. ఇందులో సిటీ డయోగ్నోస్టిక్‌ సెంటర్‌తో పాటు రీజనల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకోసం నాలుగేళ్ల కిందట పనులు చేపట్టిన అధికారులు రెండేళ్ల కిందట పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ సేవలు అందుబాటు లోకి వస్తాయని అంతా భావించారు.

దీనిపై ఉన్న తాధికారులు నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భవనం సిద్ధం చేసినప్పటికీ వినియోగించుకునే దిశగా అడుగులు వేయకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. అంతేకాకుండా ఈ సేవలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయనే దానిపై అధికారులకు కూడా స్పష్టత లేకుండా పోయింది. రాష్ట్రస్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

ఖరీదైన పరికరాలు..

ఈ సెంటర్‌లో నిరుపేద రోగులకు ఉచితంగా సిటీ, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం అడ్వాన్స్‌డ్‌ పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరికరాలు కొనుగోలు చేసేందుకు అధికారులు రెండేళ్ల కిందట సిద్ధమయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పటికీ పరికరాలను కొనుగోలు చేయకపోవడంతోనే సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదని చెబుతున్నారు. విమ్స్‌లో ఏర్పాటుచేసినప్పటికీ దీని నిర్వహణ బాధ్యత ఇక్కడి అధికారులది కాదని చెబుతున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసిన ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు కూడా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేమంటున్నారు.

ఈ పరీక్షలు ఉచితం

సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతి, విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెంటర్ల ద్వారా నిరుపేద రోగులకు వివిధ అనారోగ్య సమస్యలను నిర్ధారించే కీలకమైన సీటీ, ఎంఆర్‌ఐతోపాటు రక్త పరీక్షలను నిర్వహించనున్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణకు అవసరమయ్యే పరీక్షలను ఇక్కడ చేయనున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నిరుపేద రోగులకు వైద్య పరీక్షలు కోసం వెచ్చించే ఆర్థిక భారాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సెంటర్‌ను వీలైనంత త్వరితంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:34 AM