నజరానాకు నిరీక్షణ
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:26 AM
ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు గత వైసీపీ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది.
ఏకగ్రీవ పంచాయతీలకు ఇంతవరకు అందని ప్రోత్సాహక సొమ్ము
మూడేళ్లపాటు పట్టించుకోని వైసీపీ పాలకులు
సర్పంచుల హక్కులు కాలరాసేలా చర్యలు
మరో ఎనిమిది నెలల్లో ముగియనున్న పదవీ కాలం
కూటమి ప్రభుత్వంపైనే ‘ఏకగ్రీవ’ సర్పంచుల ఆశలు
చోడవరం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు గత వైసీపీ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తరువాత మూడేళ్లపాటు అధికారంలో వున్నప్పటికీ ప్రోత్సాహక నిధులు మాత్రం విడుదల చేయలేదు. అధికారంలో వున్న ఐదేళ్లూ గ్రామ పంచాయతీలపై నిర్లక్ష్యధోరణి ప్రదర్శించింది. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసింది. చివరకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూడా ఖజానాకు మళ్లించుకుంది.
ఎన్నికలు లేకుండా ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇస్తుంటుంది. ఉమ్మడి జిల్లాలో 969 గ్రామ పంచాయతీలకు 2021 మార్చిలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వగా... 86 పంచాయతీల్లో సర్పంచులతోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీటిలో రెండు వేల జనాభా కంటే తక్కువ వున్న పంచాయతీలు 67 ఉండగా, రెండు నుంచి ఐదు వేల జనాభా వున్న పంచాయతీలు 19 ఉన్నాయి. రెండు వేల జనాభా వరకు వున్న పంచాయతీలకు రూ.ఐదు లక్షలు, రెండు నుంచి ఐదు వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రోత్సాహకం కింద అందజేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఏకగ్రీవం అయిన పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల్లో 90 శాతానికిపైగా వైసీపీ మద్దతుదారులే కావడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ప్రోత్సాహకంతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని పంచాయతీల సర్పంచులు భావించారు. ఎన్నికలు జరిగిన సుమారు తొమ్మిది నెలల తరువాత అంటే 2021 డిసెంబరు మూడో వారంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు రూ.5.25 కోట్లు విడుదల చేసినట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంబంధిత గ్రామ పంచాయతీలు ట్రెజరీలో బిల్లులు సమర్పించాయి. తీరా బిల్లులు అప్‌లోడ్ చేసిన తరువాత ఖాతాల్లో తగినన్ని నిధుల లేవు అంటూ సమాచారం వచ్చింది. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర కమిషనరేట్‌కు జిల్లా పంచాయతీ అధికారులు నివేదించినా ఫలితం లేకపోయింది. మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం (2021-22) ముగిసిపోవడంతో ప్రోత్సాహకాల కింద విడుదల చేసిన నిధులు మురిగిపోయాయి. ఆ తరువాత సర్పంచులు ఎన్ని పర్యాయాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. మరోవైపు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది.
మూడేళ్ల తరువాత గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి, కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా ఖాజానాకు మళ్లించుకోకుండా గ్రామ పంచాయతీలకే కేటాయించింది. దీంతో సర్పంచులు ఎంతో సంతోషించారు. అదే విధంగా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కూడా విడుదల చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ పదవీ కాలంలో మరో ఎనిమిది నెలలు మాత్రమే వుందని, ఈలోగానే ఏకగ్రీవ పోత్రాహక నిధులు విడుదల చేస్తే, పది కాలాలపాటు గుర్తుండిపోయే అభివృద్ధి పనులు చేయిస్తామని చెబుతున్నారు
మండలాల వారీగా ఏకగ్రీవం అయిన పంచాయతీల సంఖ్య... ఎలమంచిలి-2, రాంబిల్లి-7, అచ్యుతాపురం-5, మునగపాక-3, మాడుగుల-4, కె.కోటపాడు-5, దేవరాపల్లి-2, చీడికాడ-5, చోడవరం-3, బుచ్చెయ్యపేట-6, కశింకోట-2, రావికమతం-5, నక్కపల్లి-5, గొలుగొండ-3, కోటవురట్ల-4, పాయకరావుపేట-2, రోలుగుంట-1, మాకవరపాలెం-1, ఎస్.రాయవరం-1, జీకేవీధి-3, జి.మాడుగుల-1, కొయ్యూరు-1, పెదబయలు-1, భీమునిపట్నం-3, ఆనందపురం-4, పద్మనాభం-2, పెందుర్తి-1, పరవాడ-1, సబ్బవరం-3
Updated Date - Jun 09 , 2025 | 01:26 AM