ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైఅలర్ట్‌

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:29 AM

కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్‌ ప్రకటించినట్టు తెలిసింది.

  • పహల్గాం ఘటన నేపథ్యంలో నగరంలో ఎక్కడికక్కడ తనిఖీలు

  • కీలక ప్రాంతాల్లో పోలీస్‌ నిఘా

  • రైల్వేస్టేషన్‌ను జల్లెడపట్టిన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ బృందాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్‌ ప్రకటించినట్టు తెలిసింది. తూర్పుతీరంలో కీలక నగరం కావడంతో ఉగ్రవాదులు, సంఘ విద్రోహులు నగరాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం ఉందో, లేదో తెలియదుగానీ నగర పోలీసులతోపాటు రైల్వే రక్షకదళం, కోస్టుగార్డు విభాగాలు అప్రమత్తమయ్యాయి. కీలక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. రైల్వేస్టేషన్‌లో ప్రభుత్వ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ)తోపాటు రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్‌) సంయుక్తంగా శనివారం తనిఖీలు చేపట్టాయి. అన్ని ప్లాట్‌ఫారాలను స్నిపర్‌ డాగ్‌లతో జల్లెడ పట్టించారు. అలాగే ప్రయాణికుల వివరాలు, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైల్వే పార్శిళ్లను కూడా బాంబ్‌ డిటెక్టర్లుతో స్కానింగ్‌ చేశారు. విశాఖలో ఆర్కే బీచ్‌, జగదాంబ జంక్షన్‌, రైల్వేస్టేషన్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరించినట్టు సోషల్‌ మీడియాలో ఒక మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. అయితే అదంతా వాస్తవం కాదని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫలానా ప్రాంతంలో హైఅలర్ట్‌గా ఉండాలంటూ ఎలాంటి హెచ్చరికలు ఇంతవరకూ అందలేదని డీజీపీ జారీచేసినట్టుగా ఒక ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


మత్స్యకారులకు రూ.24.27 కోట్ల భృతి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

సముద్రంలో చేపల వేట సాగించే వారికి మత్స్యకార భృతి కింద రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవ్సతరానికి రూ.24,27,60,000 మంజూరుచేసింది. ఈ మొత్తాన్ని జిల్లాలో 12,138 మంది కుటుంబాలకు శనివారం పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మత్స్యకారులకు ఈ భృతిని పంపిణీ చేశారు. వీడియో సమావేశం ద్వారా ఇందులో పాల్గొన్న విశాఖ జిల్లా అధికారులు అక్కడ సీఎం చంద్రబాబు ప్రసంగం ముగిసి, నిధులు విడుదల చేసిన అనంతరం మెగా చెక్‌ను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ చేతుల మీదుగా మత్స్యకార సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఇన్‌చార్జి జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


రూ.70 కోట్లకు ‘స్నేహ మాక్స్‌’ టోపీ

సంస్థ కార్యాలయం ఎదుట డిపాజిట్‌దారుల ఆందోళన

సీతంపేట, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

అధిక వడ్డీ ఆశ చూపి విశ్రాంత ఉద్యోగుల వద్ద నుంచి రూ.లక్షల్లో డిపాజిట్లు సేకరించిన ‘స్నేహ మాక్స్‌’ సంస్థ రూ.70 కోట్లకు టోపీ పెట్టింది. ఆ సంస్థ యజమాని కటికల శివ భాగ్యారావు హైదరాబాద్‌కు మకాం మార్చేయడంతో బాఽధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం సీతంపేట రాజేంద్రనగర్‌లోని స్నేహ మాక్స్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. డిపాజిట్‌దారుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు పిరుబండి ప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి బోని అప్పారావులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2008లో కటికల శివ భాగ్యారావు స్నేహ మాక్స్‌ సంస్థను ఏర్పాటుచేశాడు. ఎస్సీ, ఎస్టీలకు ఆ సంస్థలో ఉద్యోగాలిచ్చాడు. స్నేహ మాక్స్‌ కో-ఆపరేటివ్‌ సంస్థలో విశ్రాంత ఉద్యోగులతో డిపాజిట్లు కట్టించారు. బ్యాంకుల్లో కేవలం 7 శాతం వడ్డీ ఇస్తారని, అదే స్నేహ మాక్స్‌ సంస్థలో డిపాజిట్‌ చేస్తే 12 శాతం వడ్డీ వస్తుందని నమ్మించాడు. ఇలా పలు సంస్థల విశ్రాంత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ డిపాజిట్లు కట్టించాడు. కొద్ది నెలలు వడ్డీని సక్రమంగానే ఇచ్చాడు. వడ్డీ కూడా తమ సంస్థలోనే డిపాజిట్‌ చేసే మరింత అధికంగా డబ్బులు వస్తాయని నమ్మిండు. ఇలా సుమారు 300 మంది వద్ద నుంచి రూ.70 కోట్లు సేకరించాడు. ఎనిమిది నెలల నుంచి సీతంపేట సంస్థలో కనిపించకుండా హైదరాబాద్‌కు మకాం మార్చేశాడు. వడ్డీ, కట్టిన డిపాజిట్లు అడిగితే అదిగో, ఇదిగో...అంటూ తప్పించుకున్నాడు. దీంతో 160 మంది బాధిత డిపాజిట్‌దారులు సంఘంగా ఏర్పడ్డారు. తమకు న్యాయం చేయాలని నగర పోలీసు కమిషనర్‌ను అభ్యర్థించగా దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని (బాధితులంతా ఆ స్టేషన్‌ పరిధిలో ఉన్నారు) సూచించడంతో స్నేహ మాక్స్‌ సంస్థపైన, యజమాని భాగ్యారావు, కొందరు డైరెక్టర్లపై ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఆందోళన కార్యక్రమంలో బాధిత డిపాజిట్‌ పరిరక్షణదారుల సంఘం ప్రతినిధులు జె.వి. ప్రభాకర్‌, నక్కా రత్నరాజు, బాల భాస్కర్‌రావు, బీర బాలయోగి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 01:29 AM