నరకప్రయాణం
ABN, Publish Date - May 19 , 2025 | 01:08 AM
అనకాపల్లి నుంచి చోడవరం వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి తుమ్మపాల నుంచి వెంకన్నపాలెం వరకు భారీ గోతులు ఏర్పడి అత్యంత దారుణంగా తయారైంది. కొన్నిచోట్ల తారుతోపాటు రాళ్లు, పిక్కలు లేచిపోయి రోడ్డు మొత్తం ధ్వంసం అయ్యింది. కొద్దిపాటి వర్షం కురిసినా.. గోతుల్లో నీరు చేరి వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఏది రోడ్డో? ఏది గోయ్యో? తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట దగ్గరకు వచ్చే వరకు గోతులు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
అనకాపల్లి- చోడవరం రోడ్డులో పలుచోట్ల భారీ గోతులు
తుమ్మపాలలో మూడు కి.మీ.ల మేర ఛిద్రమైన రహదారి
మార్టూరు జంక్షన్, దర్జీనగర్, ఊడేరు, మామిడిపాలెం, ముద్దుర్తి వద్ద ఇదే పరిస్థితి
వర్షం కురిస్తే చెరువులను తలపిస్తున్న గోతులు
రాత్రిపూట ప్రమాదాలబారిన ద్విచక్ర వాహనదారులు
తుమ్మపాల (అనకాపల్లి), మే 18 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నుంచి చోడవరం వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి తుమ్మపాల నుంచి వెంకన్నపాలెం వరకు భారీ గోతులు ఏర్పడి అత్యంత దారుణంగా తయారైంది. కొన్నిచోట్ల తారుతోపాటు రాళ్లు, పిక్కలు లేచిపోయి రోడ్డు మొత్తం ధ్వంసం అయ్యింది. కొద్దిపాటి వర్షం కురిసినా.. గోతుల్లో నీరు చేరి వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఏది రోడ్డో? ఏది గోయ్యో? తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట దగ్గరకు వచ్చే వరకు గోతులు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడిన తరువాత అనకాపల్లి- చోడవరం రహదారికి ప్రాధాన్యం పెరిగింది. మాడుగుల, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు అనకాపల్లిలోని వివిధ జిల్లాస్థాయి కార్యాలయాల్లో పనుల కోసం వచ్చిపోతుంటారు. ఇంకా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మండలాల ప్రజలు జాతీయ రహదారికి చేరుకోవాలంటే ఈ మార్గంలో నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాయి క్వారీలు, క్రషర్లు వున్నాయి. వీటి నుంచి పిక్క, రాయి, క్రషర్ డస్ట్ వంటివి ఈ రోడ్డు గుండానే రవాణా అవుతుంటాయి. ఇంకా మాడుగుల, రావికమతం, రోలుగుంట మండలాల్లో వున్న గ్రానైట్ క్వారీల నుంచి భారీ బండరాళ్లను ఈ మార్గంలోనే తరలిస్తుంటారు. దీంతో అనకాపల్లి- చోడవరం మార్గంలో వాహనాల రద్దీ గణనీయం పెరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఏడాది కూడా నిర్వహణ పనులు చేయకపోవడంతో రహదారిపై అడుగడుగునా గోతులు ఏర్పడ్డాయి. ఇవి క్రమేపీ పెద్దవై.. రోడ్డు మొత్తం విస్తరించి, కొన్నిచోట్ల తారు రోడ్డు ఆనవాళ్లు కనిపించడంలేదు. ముఖ్యంగా అనకాపల్లి పట్టణం వైపు గుండాల జంక్షన్ నుంచి చోడవరం వైపు తుమ్మపాల గ్రామం దాటే వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మొత్త ం ఛిద్రమైంది. ఇంకా మార్టూరు జంక్షన్, దర్జీనగర్, ఊడేరు, మామిడిపాలెం, ముద్దుర్తి వద్ద భారీ గోతులు ఏర్పడ్డాయి. దర్జీనగర్ వద్ద దాదాపు కిలోమీటరు మేర తారురోడ్డు ఆనవాళ్లు లేకుండా పోయింది. కొద్ది రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేరి, రోజుల తరబడి నిలిచిపోతున్నది. ఈ రోడ్డులో రాత్రి పూట వీధి దీపాలు వెలగకపోవడంతో ద్విచక్ర వాహనదారులు గోతుల వద్ద ప్రమాదాలకు గురవుతున్నారు. గర్భిణులు, వృద్ధులు, ఆస్పత్రికి వెళ్లే రోగులు ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు కుదుపులతో చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఛిద్రమైన రోడ్డుతో అవస్థలు
జె.అప్పలరాజు, చదరం నగేశ్, తుమ్మపాల 16ఎకెపి-టీఎంపీ-5, 16ఎకెపి-టీఎంపీ-6
తుమ్మపాల మెయిన్‌రోడ్డు గోతులతో దారుణంగా తయారైంది. వివిధ పనుల మీద అనకాపల్లి వెళ్లి రావడానికి నానా అవస్థలు పడుతున్నాం. వర్షం కురిస్తే గోతుల్లో నీరు చేరి ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కుటుంబంతో ద్విచక్ర వాహనం మీద వెళ్లాలంటే భయపడాల్సి వస్తున్నది. రోడ్డు సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
Updated Date - May 19 , 2025 | 01:08 AM