ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారీ వాహనాల బీభత్సం

ABN, Publish Date - Jun 18 , 2025 | 01:34 AM

నగరంలో భారీ సరకు రవాణా లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

  • ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ ....

  • ఇష్టారాజ్యంగా నగరంలోకి రాకపోకలు

  • అపరిమితవేగంతో ప్రయాణం

  • అదుపుతప్పి ముందువెళ్లే వాహనాలను ఢీకొడుతున్న వైనం

  • తరచూ ఏదో ఒకచోట ప్రమాదం

  • నగర రోడ్లపై నిత్యం టెన్షన్‌

  • పట్టించుకోని పోలీసులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో భారీ సరకు రవాణా లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అపరిమిత వేగంతో వెళుతూ అదుపుతప్పి ముందు వెళ్లే వాహనాలను ఢీ కొడుతున్నాయి. బైక్‌లు, కార్లు వంటి వాహనాలైతే అక్కడిక్కడే బోల్తాపడి ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ తరహా వాహనాల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా సరే పోలీసులు పట్టించుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సరకు రవాణా చేసే భారీ లారీల కారణంగా రోడ్లు దెబ్బతినడంతోపాటు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాటి రిజిస్ర్టేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ కొంతమంది మట్టి, ఇసుక, బొగ్గు, వంటివి రవాణా చేసే వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో అలాంటి వాహనాలను కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేయిచేస్తున్నారు. ఆ తర్వాత నేషనల్‌ పర్మిట్‌ పేరుతో ఎక్కడైనా వాహనాన్ని తిప్పుకునేందుకు వీలుండడంతో నగరానికి తీసుకువస్తున్నారు. శివారు ప్రాంతాల నుంచి గ్రావెల్‌, మట్టిని నగరంలోకి తీసుకురావడం, ఇక్కడి నుంచి ఏదైనా సరకును లేదంటే పోర్టు నుంచి బొగ్గును తిరిగి తీసుకువెళ్లడం చేస్తున్నారు. ఈ భారీ వాహనాల డ్రైవర్లు విపరీతమైన వేగంతో వాహనాన్ని నడుపుతుంటారు. ఈ క్రమంలో ఏదైనా అనుకోని కారణంతో ముందువెళ్లే వాహనాలు ఆగితే...వేగాన్ని నియంత్రించుకోలేక వెనుక నుంచి ఢీకొడుతున్నారు. దీనివల్ల ముందువెళ్లే వాహనాలతోపాటు అందులో ప్రయాణించేవారి ప్రాణాలకు నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15న హనుమంతవాక జంక్షన్‌ నుంచి వెంకోజీపాలెం వైపు వస్తున్న కారును వెనుక నుంచి వస్తున్న భారీ సరకు రవాణా లారీ ఢీకొంది. దీంతో కారు రోడ్డుపై బోల్తాపడింది. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణించేవారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆ తరువాత కూడా అటువంటి ప్రమాదాలు అనేకం జరిగాయి. తాజాగా సోమవారం మర్రిపాలెం వద్ద అలాంటి భారీసరకు రవాణా లారీ అపరిమిత వేగంతో గురుద్వారా వైపు వస్తూ ముందువెళుతున్న కారును ఢీకొట్టింది. కారును కొన్ని మీటర్లు దూరం లారీ లాక్కుపోయింది. ఈ ఘటనలో కారు బాగా ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. కారును ఈడ్చుకుపోవడం చూసినవారంతా భయాందోళనకు గురై పెద్దగా కేకలు పెడుతూ లారీ వెనుక పరుగుపెట్టారు. అందులో ఉన్నవారంతా చనిపోయివుంటారని ఆందోళన చెందారు. అయితే కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్నవారికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

భారీ లారీలను నగరంలో రాకుండా చేయాలి

సరకు రవాణా చేసే భారీ లారీలు పగటిపూట కూడా ఇష్టారాజ్యంగా తిరగడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారీ వాహనాలు నిషేధ వేళల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భారీ లారీల కారణంగా తరచూ రోడ్డుప్రమాదాలు జరుగుతున్నా కనీసం చలనం లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 01:34 AM