నమ్మించి నట్టేట ముంచేశాడు
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:50 AM
మండలంలోని సత్యవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధిక వడ్డీల పేరుతో సుమారు రూ.15 కోట్ల వరకు అప్పులు చేసి పరారవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మేరకు శనివారం బాధితులైన కలిగట్ల శ్రీనివాసరావు, వర్మరాజు, పలువురు మహిళలు శనివారం సత్యవరంలో విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక వడ్డీలకు అప్పులు చేసి రూ.15 కోట్లతో వ్యక్తి పరారీ
లబోదిబోమంటున్న బాధితులు
హోం శాఖ మంత్రి అనిత ఆదుకోవాలని వేడుకోలు
పాయకరావుపేట రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సత్యవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధిక వడ్డీల పేరుతో సుమారు రూ.15 కోట్ల వరకు అప్పులు చేసి పరారవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మేరకు శనివారం బాధితులైన కలిగట్ల శ్రీనివాసరావు, వర్మరాజు, పలువురు మహిళలు శనివారం సత్యవరంలో విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. సత్యవరానికి చెందిన పెదిరెడ్డి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గత పాతికేళ్లలో ముందుగా ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం చేసేవాడని తెలిపారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు కాకినాడ జిల్లా తునిలో వస్త్ర నడిపి మూసేశాడని, అనంతరం బంగారం షాపు పెట్టాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో సత్యవరంతో పాటు పరిసర గ్రామాలైన పెదరాంభద్రపురం, మాసాహెబ్‌పేట, పాల్తేరు, అన్నవరం, బొద్దవరం, తదితర ప్రాంతాల్లోని ప్రజలందరితో మంచిగా ఉంటూ వచ్చాడు. తనకు అత్యవసరమంటూ ఆయా గ్రామాలకు చెందిన సుమారు 200 మంది వద్ద నుంచి ప్రతినెలా వడ్డీలు చెల్లించేలా సుమారు 15 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆరంభంలో నెలనెలా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఎంతో నమ్మకంగా ఉండేవాడని బాధితులు తెలిపారు. ఆ తరువాత నుంచి ఇదిగో.. అదిగో అంటూ తప్పించుకు తిరిగేవాడని, ఇప్పుడు ఏకంగా పరారైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఎక్కువగా మహిళలు, వృద్ధులు, కూలి పని చేసుకునే వారే ఉన్నారు. పలువురు మహిళలు తమ పిల్లల పెళ్లిళ్ల సమయానికి నగదు ఆసరాగా ఉండడంతో పాటు వడ్డీలు అధికంగా ఇస్తుండడంతో అప్పులిచ్చి ఇప్పుడు మోసపోయామని బావురుమంటున్నారు. కొంతమంది బాధితులు బంగారు ఆభరణాల కోసం అడ్వాన్స్‌గా నగదు చెల్లించామని చెబుతున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో బాధితులు కూనిశెట్టి నాగేశ్వరరావు, యగదాసు గంగారావు, యు.సత్యవతి, ఎన్.సుధ, వై.బేబి, వై.కుమారి, నారాయణలక్ష్మి, హరికృష్ణ, గంగాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 12:50 AM