అన్నదాత మోములో ఆనందం
ABN, Publish Date - Aug 02 , 2025 | 11:25 PM
రైతులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది.
జిల్లాలో 1,44,222 మంది రైతులకు అన్నదాత సుఖీభవ
వైసీపీ ప్రభుత్వంలో రూ.13,500 ఇవ్వగా..
కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెంపు
తొలి విడతగా ప్రతి రైతు ఖాతాలోకి రూ.7 వేలు జమ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రైతులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా శనివారం జిల్లాలోని 22 మండలాల్లో 1,44,222 మంది రైతులకు రూ.7 వేలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మరో రెండు విడతల్లో రూ.13 వేలు జమ కానుంది. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఏడాదిలో ఒక రైతుకు రూ.13,500 మాత్రమే అందించగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దానిని రూ.20వేలకు పెంచింది. దీంతో రైతులు వ్యవసాయ పనులకు పెట్టుబడి సాయం దొరికిందని సంబరపడుతున్నారు. అలాగే ప్రతి ఏడాది తొలి విడతగా రూ.7 వేలు, రెండో విడతగా రూ.7 వేలు, మూడో విడతగా రూ.6 వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే శనివారం ఇక్కడ అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం తొలి విడత సొమ్ము జమ చేసింది. జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, రాజకీయ నేతలు రైతులకు నమూనా చెక్కును అందజేశారు.
ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు
గొల్లూరి జగన్నాథం, రైతు, సంతవలస, డుంబ్రిగుడ మండలం
అన్నదాత సుఖీభవ కింది ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో నిజంగా ఏడాదికి రూ.20 వేలు ఇవ్వగలరా? అనే అనుమానం కలిగింది. కాని తొలి విడతగా రూ.7 వేలు జమ చేయడం మంచి పరిణామం. కూటమి ప్రభుత్వం రైతులకు మరింత మేలు చేయాలి.
కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
బేరా సత్యనారాయణ పడాల్, రైతు, యర్రబొమ్మలు
ఖరీఫ్ సాగుకు ముందుగా రైతుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నగదు జమచేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడం చాలా సంతోషం. ఈ నగదు వ్యవసాయ పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగింది. ఈ రోజు రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం.
Updated Date - Aug 02 , 2025 | 11:25 PM