ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహో దోపిడీ

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:26 AM

జీవీఎంసీ మలేరియా విభాగం పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • ఫాగింగ్‌కు డీజిల్‌ పేరుతో అక్రమాలు

  • జీవీఎంసీ మలేరియా విభాగంలో మాయ

  • గంటకు వంద లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నట్టు లెక్కలు

  • మూడు నెలల కిందట అధికారులు లెక్కించగా గంటకు 40 లీటర్లు అవుతున్నట్టు నిర్ధారణ

  • ప్రతి నెలా డీజిల్‌ కోసం రూ.58.79 లక్షలు వ్యయం

  • చాలడం లేదని అదనంగా రూ.24.69 లక్షల చొప్పున కేటాయింపు

  • గత కమిషనర్‌ హయాంలో ఫిర్యాదులు రావడంతో విచారణ

  • ప్రాథమికంగా అక్రమాలు నిర్ధారించిన అధికారులు

  • కమిషనర్‌ బదిలీతో నిలిచిపోయిన చర్యలు

  • కార్పొరేటర్లు, అధికారులకు వాటాలు అందుతున్నాయని ఆరోపణలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ మలేరియా విభాగం పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దోమల నియంత్రణకు ఫాగింగ్‌ పేరుతో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్టు కొందరు కార్పొరేటర్లే ఆరోపిస్తున్నారు. కాగితాలపై చూపే లెక్కలకు క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదంటున్నారు. ఈ విభాగంలో అవినీతిపై గత కమిషనర్‌ సంపత్‌కుమార్‌కు కొందరు కార్పొరేటర్లు ఫిర్యాదుచేయడంతో మెకానికల్‌ విభాగం అధికారులతో విచారణ చేపట్టారు. ఇందులో అక్రమాలు వాస్తవమేనని తేలింది. బాధ్యులపై చర్యలు తీసుకునేలోగా కమిషనర్‌కు బదిలీ అయింది. తాజాగా అధికారులు మరింత అవినీతికి తెరతీసినట్లు ప్రజారోగ్యవిభాగంలోని సిబ్బందే చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది.

నగరంలో దోమల నియంత్రణకు మలేరియా విభాగం ఆధ్వర్యం లో ఫాగింగ్‌ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో పెద్ద ఫాగింగ్‌ యంత్రాలు (మెగా ఫాగింగ్‌) ఏడు, మినీఫాగింగ్‌ మిషన్లు 80 ఉన్నాయి. ఇవి కాకుండా 33 పవర్‌ స్ర్పేయింగ్‌ మిషన్లతో కలిపి 120 ఫాగింగ్‌ యంత్రాలున్నాయి. మెగాఫాగింగ్‌ యంత్రంతో పెద్దరోడ్లున్న ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేస్తారు. ఈ వాహనంతో రోజుకు ఎనిమిది గంటల చొప్పున నెలకు ఒక్కో జోన్‌లో తొమ్మిది రోజులు మాత్రమే ఫాగింగ్‌ చేస్తారు. టాటాఏస్‌పై అమర్చే ఈ మిషన్‌ ఫాగింగ్‌ చేయడానికి గంటకు వంద లీటర్లు, యంత్రాన్ని తీసుకెళ్లే వాహనానికి రోజుకి 20 లీటర్లు డీజిల్‌ ఖర్చవుతున్నట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు.

అవినీతికి తెర తీశారు

ఇక్కడే పెద్ద అవినీతి జరుగుతోందని ఇంజనీరింగ్‌ అధికారులే ఆరోపిస్తున్నారు. మెగాఫాగింగ్‌ యంత్రంతో ఫాగింగ్‌ చేయడానికి గంటకు 30 లీటర్లు అవుతుందని, యంత్రం కండిషన్‌ బాగా లేకుంటే గంటకు గరిష్టంగా 40 లీటర్లు మించదని చెబుతున్నారు. ఒక యంత్రంతో రోజుకు ఎనిమిది గంటలు ఫాగింగ్‌ చేస్తున్నట్టు లెక్క చూపించి, ఐదారు గంటలు మించి చేయడం లేదంటున్నారు. దీనిని బట్టి ఒక్కో మెగా ఫాగింగ్‌ యంత్రం వద్ద గంటకు సగటున 60 లీటర్లు చొప్పున ఆరు గంటలకు 360 లీటర్లు, ఫాగింగ్‌ చేయకుండానే చేసినట్టు చూపిస్తున్న రెండు గంటలకు 200 లీటర్లు మొత్తం 560 లీటర్లు పక్కదారి పడుతోందంటున్నారు. ఇవి ఏడు వాహనాలు ఉండడంతో రోజుకు 3,920 లీటర్ల డీజిల్‌ దారిమళ్లుతోందని చెబుతున్నారు. ఒక్కో వాహనం నెలకు తొమ్మిది రోజులు ఫాగింగ్‌ చేయాల్సి ఉంటుంది దీంతో నెలకు 36 వేల లీటర్లు డీజిల్‌ పక్కదారి పడుతోందని మెకానికల్‌ విభాగం ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇక చిన్నయంత్రాలతో ఫాగింగ్‌ కోసం ప్రతినెలా కనీసం రూ.35 లక్షలు పక్కదారి పడుతోందని చెబుతున్నారు.

విచారణ కమిటి తేల్చిందిదీ...

కొంతమంది కార్పొరేటర్లు తమవార్డులో సరిగా ఫాగింగ్‌ జరగడంలేదని, రికార్డులో ఫాగింగ్‌చేసినట్టు చూపించి డీజిల్‌ను పక్కదారి పట్టించేస్తున్నారని గత ఏడాది డిసెంబరులో అప్పటి కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. ఒక మలేరియా ఇన్‌స్పెక్టర్‌ డీజిల్‌ను బంకు నుంచి విడిపించి, వేరొకరి ఇచ్చే అంశంపై అప్పటి మలేరియా అధికారితో మాట్లాడినట్టు కాల్‌రికార్డ్‌ బయటపడడంతో దీనిపై విచారణ జరిపాలని సంపత్‌కుమార్‌ అప్పటి మెకానికల్‌ విభాగం ఈఈ చిరంజీవిని ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురు అధికారులను వేర్వేరు ప్రాంతాల్లో ఫాగింగ్‌ జరుగుతున్నచోటకు వెళ్లి గంటకు ఎంతడీజిల్‌ ఖర్చవుతుందో పరిశీలించాలని ఈఈ ఆదేశించారు. వారంతా మెగాఫాగింగ్‌కు గంటకు 30 నుంచి 40 లీటర్లు మాత్రమే ఖర్చవుతున్నట్టు తేల్చడంతో అప్పటి కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. బాధ్యులపై కమిషనర్‌ చర్యలకు సమాయత్తమవుతున్న సమయంలో బదిలీ అయిపోయింది.

అక్రమాలపై ఆరోపణలు

ఫాగింగ్‌లో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలుండగా, నిధులు చాలడం లేదని అదనంగా కేటాయించాలని మలేరియా విభాగం అధికారులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు విన్నవించినట్టు తెలిసింది. ఫాగింగ్‌కు నెలకు రూ.58.79 లక్షలు కేటాయిస్తుండగా, మూడు నెలలుగా అదనంగా రూ.24.69 లక్షలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఫాగింగ్‌ పేరుతో కొంతమంది అధికారులు, సిబ్బంది నిధులను నొక్కేస్తున్నారని కొందరు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇందులో కొందరు కార్పొరేటర్లకు, అధికారులకు వాటాలు అందుతుండడంతో అక్రమాలకు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ దృష్టిసారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిరాధార ఆరోపణలు

ఫాగింగ్‌ పేరుతో జరుగుతున్న అక్రమాలపై ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా అక్రమాలు జరగడానికి అవకాశమే లేదని కొట్టిపారేశారు. గిట్టనివారే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. మలేరియా విభాగంలో ప్రస్తుతం ఆరు మెగా ఫాగింగ్‌ యంత్రాలతోనే ఫాగింగ్‌ జరుగుతోందన్నారు. గంటకు వందలీటర్లు డీజిల్‌ ఖర్చవుతోందని గత కమిషనర్‌ విచారణలో కూడా తేలిందని చెప్పడం కొసమెరుపు.

----------------------------------

జీవీఎంసీ పరిధిలో మెగా ఫాగింగ్‌ వాహనాలు- 7

మినీ ఫాగింగ్‌ యంత్రాలు - 80

పవర్‌ స్ర్పేయర్లు- 33

నెలకు డీజిల్‌, పెట్రోలుకు కేటాయింపు- రూ.58 లక్షలు

రెండునెలలుగా అదనపు కేటాయింపు -రూ.28 లక్షలు

మొత్తంగా నెలకు చూపిస్తున్న ఖర్చు - రూ.86 లక్షలు

------------------------

Updated Date - Aug 04 , 2025 | 12:26 AM