ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహా ఉత్కంఠ

ABN, Publish Date - May 20 , 2025 | 01:28 AM

జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ఆసాంతం హైడ్రామా నడిచింది. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి హోదాలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ప్రకటించారు.

  • కోరం లేక డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నేటికి వాయిదా

  • పదవి కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ

  • చివరకు జనసేనకు కేటాయించాలని నిర్ణయం

  • 43వ వార్డు కార్పొరేటర్‌ ఉషశ్రీ పేరు ప్రకటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

  • వ్యతిరేకించిన ‘దేశం’ కార్పొరేటర్లు

  • అధిష్ఠానం నిర్ణయమంటూ చివరికి 64వ వార్డు కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డి పేరు ఖరారు

  • ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన యాదవ, కాపు సామాజిక వర్గాలకు చెందిన 15 మంది కార్పొరేటర్లు

విశాఖపట్నం, మే 19 (ఆంధ్ర జ్యోతి):

జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ఆసాంతం హైడ్రామా నడిచింది. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి హోదాలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ప్రకటించారు. అయితే డిప్యూటీ మేయర్‌ పదవి కోసం టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఆదివారం అర్ధరాత్రి వరకూ ఎటూ తేల్చుకోలేకపోయారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్‌ పదవి నుంచి తొలగించినందున, ఆ వర్గానికి చెందిన మహిళను డిప్యూటీ మేయర్‌ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు తమకు అవకాశం వస్తుందని ఆశించారు. మరోవైపు డిప్యూటీ మేయర్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తొలగించినందున, ఆ వర్గానికే తిరిగి పదవిని కేటాయించాలనే వాదన వినిపించింది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఆశలు పెట్టుకున్నారు. చివరకు ఆదివారం రాత్రి నగరంలోని ఒక హోటల్‌లో సుదీర్ఘ భేటీ నిర్వహించిన కూటమి ప్రజా ప్రతినిధులు డిప్యూటీ మేయర్‌ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన నుంచి 43వ వార్డు కార్పొరేటర్‌ పి.ఉషశ్రీతోపాటు 64వ వార్డు కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. సోమవారం ఉదయం కూటమి కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులంతా దసపల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉషశ్రీ, గోవిందరెడ్డి పేర్లను తాము పరిశీలిస్తున్నామని, ఉషశ్రీని ఖరారు చేయాలని భావిస్తున్నామని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ చెప్పారు. దీనికి టీడీపీకి చెందిన కార్పొరేటర్లంతా అభ్యంతరం చెప్పడంతోపాటు వైసీపీ నుంచి ఇటీవలే జనసేనలో చేరిన ఆమెకు ఇస్తే తామంతా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి వచ్చిన సీల్డ్‌ కవర్‌లో దల్లి గోవిందరెడ్డి పేరు ఉన్నందున ఆయన్నే డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా వంశీకృష్ణ ప్రకటించారు. దీంతో డిప్యూటీ మేయర్‌ పదవిని ఆశించిన టీడీపీకి చెందిన యాదవ, కాపు సామాజిక వర్గాలకు చెందిన 15 మంది కార్పొరేటర్లు ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పి జీవీఎంసీ కౌన్సిల్‌హాల్‌కు వెళ్లకుండా బీచ్‌రోడ్డులోని ఒక హోటల్‌కు వెళ్లిపోయారు.

కోరం లేకపోవడంతో నేటికి వాయిదా

కోరం లేకపోవడంతో డిప్యూటీ మేయర్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి హోదాలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ప్రకటించారు. జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు మొత్తం 111 మంది ఓటు హక్కు కలిగిన సభ్యులు ఉన్నారు. వీరిలో సగం మంది సభ్యులు అంటే 56 మంది సమావేశానికి హాజరుకావాల్సి ఉంటుంది. కానీ ఏడుగురు ఎమ్మెల్యేలు (వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణశ్రీనివాస్‌, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు), ఒక ఎమ్మెల్సీ (వేపాడ చిరంజీవిరావు)తోపాటు 48 మంది కార్పొరేటర్లు మొత్తం 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, 12 గంటలకు కూడా కోరం లేకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించారు.

కోరం లెక్కింపులో అధికారుల అత్యుత్సాహం

54 మంది హాజరైతే...

56 మంది ఉన్నట్టు ఎన్నికల అధికారికి లెక్కలు

మరోసారి లెక్కించాలని జేసీ ఆదేశం

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):

డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అధ్యక్షతన జీవీఎంసీ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, అప్పటికి కేవలం పది మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. తర్వాత ఒక్కొక్కరుగా రావడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎదురుచూస్తానని, తర్వాత హాల్‌ తలుపులు మూసివేసి హాజరైన సభ్యులను లెక్కించి, కోరం సరిపోతే ఎన్నిక ప్రక్రియ ప్రారంభిస్తానని, లేనిపక్షంలో మంగళవారానికి వాయిదా వేస్తానని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. 11.45 గంటలకు కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. అప్పటికి ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణశ్రీనివాస్‌, పంచకర్ల రమేష్‌బాబు, కొణతాల రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాత్రమే ఉన్నారు. టీడీపీకి చెందిన కాపు, యాదవ సామాజికవర్గం కార్పొరేటర్లు ఎన్నికను బహిష్కరించి, వేరే హోటల్‌లో సమావేశమయ్యారని తెలియడంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలకు, జీవీఎంసీ మేయర్‌ పీలా శ్రీనివాసరావుకు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి కార్పొరేటర్లను పిలవాలని కోరారు. తర్వాత మరికొందరు కార్పొరేటర్లు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు హాల్‌లోకి వచ్చారు. సరిగ్గా 12 గంటలకు హాల్‌ తలుపులను మూసివేయాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. వరుసల వారీగా సభ్యులను లెక్కించాలని ‘రో అధికారులను’ ఆదేశించారు. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 54 మంది సభ్యులు హాజరైతే 56 మంది హాజరయ్యారని, కోరం సరిపోయిందంటూ అధికారులు ఎన్నికల అధికారికి వివరించారు. అయితే వరుసల వారీగా సభ్యులను లెక్కించిన ఎన్నికల అధికారి లెక్కలో తేడా ఉందని, మరోసారి లెక్కించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 54 మంది మాత్రమే హాజరైనట్టు నివేదిక ఇచ్చారు. ఎన్నికల అధికారి ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నాసరే పెద్దపొరపాటు జరిగిపోయేది. సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత ఎన్నికల అధికారి తనకు తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.

అసంతృప్త కార్పొరేటర్లతో కూటమి ఎమ్మెల్యేల సంప్రతింపులు

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజోతి):

డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో సోమవారం ఎన్నికను బహిష్కరించిన కార్పొరేటర్లతో కూటమి ఎమ్మెల్యేలు సంప్రతింపులు జరిపారు. పొత్తు ధర్మంలో భాగంగానే జనసేనకు డిప్యూటీ మేయర్‌ పదవిని ఇవ్వాల్సి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు తమకు సన్నిహితులైన కార్పొరేటర్లకు ఫోన్‌ చేసి వివరించారు. రెండో డిప్యూటీ మేయర్‌ పదవిని కచ్చితంగా టీడీపీ తీసుకుంటుందని అప్పుడు సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని సమష్టిగా అభ్యర్థిని ఎంపిక చేద్దామని బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంగళవారం జరిగే డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు హాజరుకావాలని కోరారు. అయితే అసంతృప్త కార్పొరేటర్లు పలువురు తమ సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత, మేయర్‌ ఎన్నిక సందర్భంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువుపెట్టినట్టు తెలిసింది. మంగళవారం కూడా తాము హాజరయ్యే ప్రసక్తి లేదని కొందరు తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో మంగళవారం ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - May 20 , 2025 | 01:28 AM