ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మన్యంలో కాల్పుల కలకలం

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:44 PM

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాలోని కొయ్యూరు, వై.రామవరం మండలాల సరిహద్దులో మావోయిస్టులు, పోలీసుల మధ్య సోమవారం కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపింది.

మార్చి నెలలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీని పరిశీలిస్తున్న ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ (ఫైల్‌)

కూంబింగ్‌ పోలీసులు, మావోయిస్టుల మధ్య రెండు సార్లు ఎదురు కాల్పులు

అల్లూరి జిల్లా ఏర్పడిన తరువాత తొలి ఘటన ఇదే

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో కూంబింగ్‌తో జిల్లాలోకి ప్రవేశిస్తున్న మావోయిస్టులు

ముందస్తు సమాచారంతో జల్లెడ పడుతున్న ప్రత్యేక పోలీసు బలగాలు

గత నెలలోనే శబరి ఏరియా కమిటీకి చెందిన ఇద్దరి అరెస్టు

గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోని 11 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాలోని కొయ్యూరు, వై.రామవరం మండలాల సరిహద్దులో మావోయిస్టులు, పోలీసుల మధ్య సోమవారం కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపింది. వాస్తవానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోలీసులు గత కొన్నాళ్లుగా విస్తృతంగా గాలింపులు, వాహన తనిఖీలు చేపడుతుండడంతో మావోయిస్టులు జిల్లాలో తలదాచుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో మావోయిస్టుల కార్యకలాపాలు సైతం క్రమంగా మందగించాయి. అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగానే ఉంటున్నారు. గంజాయి నిర్మూలన, మావోయిస్టు సానుభూతిపరుల ప్రవర్తనలపై నిఘా పెడుతూ జిల్లాలో మావోయిస్టులు అడుగు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని కొయ్యూరు మండలం మంప పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే కాకులమామిడి, కంఠవరం ప్రాంతంలో సోమవారం రెండు మార్లు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగడం సంచలనమైంది.

ముందే పసిగట్టి అప్రమత్తమైన జిల్లా పోలీసులు

జిల్లాలోని కొయ్యూరు, వై.రామవరం మండలాల సరిహద్దు ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా మావోయిస్టుల కదలికలున్నాయని జిల్లా పోలీసులు ముందుగానే గుర్తించారు. జిల్లాలోని ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు లేకపోగా, కేవలం కొయ్యూరు మండలంలో వాళ్ల కదలికలు ముమ్మరంగా ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. దీంతో రెండు నెలల క్రితం కొయ్యూరు పరిసర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్‌ టీమ్‌ సంచరిస్తుందని పోలీసులకు సమాచారం అందడంతో ముమ్మరంగా గాలింపులు, తనిఖీలు చేపట్టారు. జిల్లా పోలీసులు సైతం కొయ్యూరు మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గత నెలలో శబరి దళం కమాండర్‌గా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం డోకుపదు గ్రామానికి చెందిన మడకం మంగల్‌ అలియాస్‌ రమేశ్‌(35)ను, అలాగే సభ్యుడిగా ఉన్న అదే రాష్ట్రం దబ్బపాదు గ్రామానికి చెందిన మాడివి రమేశ్‌ అలియాస్‌ ప్రదీప్‌(23)ను మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తడికవాగు సమీపంలో పోలీసులు పథకం ప్రకారం మాటేసి అరెస్టు చేశారు. వాళ్ల నుంచి ఒక 303 తుపాకీ, ఐదు తూటాలు, రూ.2,400, మందుల పెట్టే, విప్లవ సాహిత్యం, ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు గ్రామ స్థాయిలో సహాయ సహకారాలు అందించే మిలీషియా సభ్యులపైనా పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా మావోయిస్టుల కదలికల నేపథ్యంలో గతంలో గాలికొండ ఏరియా కమిటీతో సంబంధాలున్న మిలీషియా సభ్యులపై నిఘా పెట్టారు. దీంతో గత నెలలో మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమిటీ పరిధిలో మిలీషియా సభ్యులుగా పని చేస్తున్న పాంగి నర్సింగ్‌, తాంబేలి వెంకటరావు, పాంగి సొన్న, మర్రి కేశవరావు, మత్రి సత్తిబాబు, మర్రి సింగ్రు, పాంగి రత్ను, పాంగి కృష్ణ, పాంగి రట్టు, మర్రి పులు అనే 11 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు.

తాజా కాల్పుల్లోనూ దీటుగా ఎదుర్కొన్న పోలీసులు

ప్రస్తుతం జిల్లాకు సరిహద్దులో ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో మావోయిస్టులు తాత్కాలిక షెల్టర్‌ కోసం కొయ్యూరు, వై.రామవరం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాలకు వస్తున్నారని ముందే జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం నుంచే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను దింపి కూంబింగ్‌ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పదిన్నర గంటలకు కొయ్యూరు మండలం కాకులమామిడి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను గమనించిన మావోయిస్టు బృందం(15 మంది సభ్యులు), పోలీసులపై కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో కాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన సామగ్రి దొరికింది. తమపై కాల్పులు జరిపిన మావోయిస్టులను వెంబడిస్తున్న క్రమంలో కంఠవరం అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మరోమారు పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, అయితే ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. పోలీసులు ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉంటూ రెండు మార్లు మావోయిస్టులు కాల్పులు జరిపినా, అందుకు దీటుగా సమాధానం చెప్పారన్నారు. అయితే తప్పించుకున్న మావోయిస్టులు సోమవారం సాయంత్రానికే సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:45 PM