సాకేత్‌కు గ్రూప్-1 పోస్టు
ABN, Publish Date - Jun 25 , 2025 | 01:05 AM
విశాఖకు చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి గ్రూప్-1 (డిప్యూటీ కలెక్టర్) పోస్టు కేటాయించేందుకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
సాకేత్‌కు గ్రూప్-1 పోస్టు
మంత్రి మండలి ఆమోదం
విశాఖపట్నం స్పోర్ట్సు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):
విశాఖకు చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి గ్రూప్-1 (డిప్యూటీ కలెక్టర్) పోస్టు కేటాయించేందుకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ క్రీడారంగంలో ప్రతిభ చూపి గ్రూప్-1 ఉద్యోగం పొందిన నగర తొలి క్రీడాకారుడు సాకేత్ కావడం విశేషం. సాకేత్ బాల్యం నుంచి టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకుని సాధన చేశాడు. తొలి అడుగులు విశాఖలో వేసినా....ఉన్నత శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి నైపుణ్యం సాధించాడు. అనతికాలంలో ఉన్నత శ్రేణి టెన్నిస్ క్రీడాకారుడిగా పరిణితి పొందాడు.
ఆసియా క్రీడల్లో పతకాలు
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సాకేత్...సనమ్ సింగ్‌తో కలిసి డబుల్స్‌లో రజత పతకం, సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ప్రపంచ టెన్నిస్ క్రీడారంగంలో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీలైన ఆస్ర్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, డేవిస్ కప్ వంటి టోర్నీలకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటాడు. 2014లో ఇండోర్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఛాలెంజర్ టోర్నీలో పాల్గొని టైటిల్ కైవసం చేసుకున్నాడు. 2015లో వియత్నాంలో జరిగిన ఏటీపీ ఛాలెంజర్ ట్రోఫీలో జార్దన్ థాంప్సన్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2015లో టర్కీలో జరిగిన ఏటీపీ ఛాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాకేత్, 2016లో ఇండియా, న్యూఢిల్లీలో జరిగిన ఏటీపీ ఛాలెంజర్ టోర్నీలో రజత పతకం చేజిక్కుంచుకున్నాడు. తన కెరీర్‌లో 2023 జనవరి 16న సాధించిన 74వ ర్యాంకు అత్యుత్తమం కావడం విశేషం.
అర్జున అవార్డు
సాకేత్ మైనేని క్రీడా ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో అర్జున అవార్డు పురస్కారంతో సత్కరించింది. డబుల్స్ ఈవెంట్‌లో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన రోహన్ బోపన్న, సనమ్‌సింగ్ వంటి ఆటగాళ్లతో జతగా ఆడి విజయాలు సొంతం చేసుకున్నాడు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు. సాకేత్ మైనేనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్టు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు, సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు హర్షం వ్యక్తంచేశారు.
Updated Date - Jun 25 , 2025 | 01:05 AM