ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రేటర్‌ కమిషనర్‌పై గుర్రు

ABN, Publish Date - Jul 25 , 2025 | 01:19 AM

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌పై టీడీపీ కార్పొరేటర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు.

  • తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని టీడీపీ కార్పొరేటర్ల ఆరోపణ

  • కలిసేందుకు వెళితే గంటల తరబడి కూర్చోబెడుతున్నారని ఆవేదన

  • ఫ్లోర్‌లీడర్‌ కార్యాలయంలో పలువురు సమావేశం

  • తొలుత మేయర్‌కు ఫిర్యాదు చేయాలని, అప్పటికీ పరిస్థితి మారకుంటే కౌన్సిల్‌ ఎండగట్టాలని నిర్ణయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌పై టీడీపీ కార్పొరేటర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు. తమను కమిషనర్‌ కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వార్డులోని సమస్యల పరిష్కారానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే గంటల తరబడి బయట కూర్చోబెడుతున్నారని, ఇచ్చిన విజ్ఞప్తులపై కనీసం సంతకం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. గురువారం టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఛాంబర్‌లో పలువురు కార్పొరేటర్లు భేటీ అయి కమిషనర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడంతోపాటు మేయర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్‌గార్గ్‌ గత నెల 21న బాధ్యతలు స్వీకరించారు. ఆయన వార్డుల్లో విస్తృతంగా పర్యటించడంతోపాటు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అలాగే అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహించి జీవీఎంసీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై అవగాహన తెచ్చుకుంటున్నారు. నిత్యం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. గత కమిషనర్‌ల మాదిరిగా కార్పొరేటర్లకు పెద్దగా సమయం కేటాయించడం లేదు. అధికార, ప్రతిపక్ష అనే భేదం లేకుండా ఎవరైనా కార్పొరేటర్లు తనను కలిసేందుకు వస్తే...వీలు దొరికినప్పుడు వారిని లోపలకు పిలిచి సమస్యలను వింటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కార్పొరేటర్లు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది వైసీపీ కార్పొరేటర్లకు పెద్దగా ఇబ్బంది అనిపించకపోయినా, అఽధికారంలో ఉన్న టీడీపీ, జనసేన కార్పొరేటర్లకు మాత్రం మింగుడుపడడం లేదు. అధికార పార్టీ కార్పొరేటర్లమైన తాము కమిషనర్‌ను కలిసేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం అవమానకరమేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఛాంబర్‌లో కొందరు కార్పొరేటర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ పనితీరు గురించి చర్చకు రాగా, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఇద్దరు జోక్యం చేసుకుని ఇటీవల తామిద్దరం కలిసి కమిషనర్‌ను కలిసేందుకు వెళితే రెండు గంటలపాటు నిరీక్షించినా తమను పిలవలేదని, దీంతో విసిగిపోయి వెళ్లిపోయామని అన్నారు. మరికొందరు కార్పొరేటర్లు కల్పించుకుని తమది కూడా అదే పరిస్థితి అని, తాము ఎప్పుడు కమిషనర్‌ను కలవాలని వెళ్లినా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వార్డు సమస్యలపై గతంలో కమిషనర్‌లకు వినతిపత్రం అందజేస్తే, వెంటనే దానిపై ‘ఫైల్‌ పుటప్‌’ అనో, కమిషనర్‌ సంతకం చేసో.. సంబంధిత విభాగం అధికారులకు పంపించేవారని, దానిపై చర్యలు కనిపించేవని ఇంకొందరు అన్నారు. కానీ ప్రస్తుత కమిషనర్‌ తమ నుంచి వినతిపత్రం అందుకుని పక్కనపడేస్తున్నారని, సంతకం చేసి నోట్‌ చేసుకోండి సార్‌...అని చెప్పినా తర్వాత చేస్తానంటూ పంపించేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్‌ తీరు ఇలాగే ఉంటే వార్డుల్లో అభివృద్ధి పనులు జరగవని, ప్రజల సమస్యలు తీరవని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై తొలుత మేయర్‌కు ఫిర్యాదు చేయాలని, అప్పటికీ పరిస్థితి మారకుంటే కౌన్సిల్‌ సమావేశంలో కమిషనర్‌ తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ సమస్య ఒకరిద్దరు కార్పొరేటర్లది కాదని, అందరూ అలాగే బాధపడుతున్నారని వారంతా పేర్కొనడం విశేషం.

Updated Date - Jul 25 , 2025 | 01:19 AM