ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైవాడ ఆఽధునికీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN, Publish Date - May 23 , 2025 | 12:53 AM

జిల్లాలో సుమారు పదిహేను వేల ఎకరాలకు సాగునీరు, విశాఖకు తాగునీరు అందిస్తున్న రైవాడ జలాశయం విస్తరణ, ఆధునికీకరణ, అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పనులకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా జలవనరుల శాఖ అధికారులు రూ.336 కోట్లతో అంచనాలు రూపొందించి పంపారు.

స్లూయిస్‌ను తనిఖీ చేస్తున్న నిపుణుల బృందం (ఫైల్‌ ఫొటో)

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర జలసంఘం ఆమోదం

రూ.336 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు

ఎర్త్‌ డ్యామ్‌, స్లూయిస్‌, సబ్‌వే, స్పిల్‌వే, గేట్లు, ఇతరత్రా పనులు

1.67 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా కొత్త స్పిల్‌వే నిర్మాణం

రేడియల్‌ గేట్ల స్థానంలో హైడ్రాలిక్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గేట్లు

ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభం

పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ పర్యవేక్షణ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సుమారు పదిహేను వేల ఎకరాలకు సాగునీరు, విశాఖకు తాగునీరు అందిస్తున్న రైవాడ జలాశయం విస్తరణ, ఆధునికీకరణ, అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పనులకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా జలవనరుల శాఖ అధికారులు రూ.336 కోట్లతో అంచనాలు రూపొందించి పంపారు.

శారదా నదిపై దేవరాపల్లి మండలం రైవాడ గ్రామానికి సమీపంలో నాలుగున్నర దశాబ్దాల క్రితం రిజర్వాయర్‌ నిర్మించారు. దీని నుంచి సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అయితే విశాఖ నగర తాగునీటి అవసరాల కారణంగా ఇంతవరకు దాదాపు 15 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. జీవీఎంసీకి నిరంతరాయంగా 50 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నది. రిజర్వాయర్‌ నీటి నిలువ సామర్థ్యం 3.6 టీఎంసీలు. పరివాహక ప్రాంతం ఏజెన్సీలో వుండడం, అధిక వర్షపాతం కారణంగా ఏటా జలాశయం పూర్తిగా నిండుతుంటుంది. అదనపు నీటిని స్పిల్‌వే ద్వారా దిగువకు విడిచిపెడుతుంటారు. భారీ వర్షాలు కురిసి జలాశయం పూర్తిగా నిండితే స్పిల్‌వే గేట్ల ద్వారా గరిష్ఠంగా 67 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి అనుగుణంగా డిజైన్‌ చేశారు. అయితే 1990 మే నెలలో సంభవించిన తుఫాన్‌ దెబ్బకు కుంభవృష్టిగా వర్షాలు కురవడంతో రైవాడ నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని స్పిల్‌వే గేట్ల ద్వారా బయటకు విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో ప్రాజెక్టు మనుగడపై ఆందోళన వ్యక్తమైంది. ఆధునికీకరణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో స్పిల్‌వేతోపాటు పలు కట్టడాలు బలహీనంగా మారాయి. స్పిల్‌వేకు పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. గేట్లు సరిగా పనిచేయడంలేదు. అత్యంత ప్రమాదకర స్థితిలో రైవాడ రిజర్వాయర్‌ ఉందని ఇంజనీరింగ్‌ నిపుణులు చాలా కాలం నుంచి హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన గత వైసీపీ పాలకులు వీటిని అమలుచేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దశాబ్దాల క్రితం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ అంశంపై తెరపైకి వచ్చింది. ఈ జాబితాలో రైవాడ రిజర్వాయర్‌ వుంది.

ఇటీవల కేంద్ర జల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో పలు జలశయాల అభివృద్ధి, మరమ్మతు పనుల ప్రస్తావన వచ్చింది. జిల్లాలో రైవాడ జలాశయం ఆధునికీకరణ, విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నప్పటికీ ఎందుకు వినియోగించుకోవడంలేదని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను కేంద్ర జల సంఘం ప్రశ్నించింది. దీంతో రైవాడ జలాశయం విస్తరణ, అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ తయారు చేసి పంపాలని రాష్ట్ర అధికారులు, జిల్లా జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. రూ.336 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపడంతో అక్కడి నుంచి ఆమోదం లభించినట్టు తెలిసింది.

రూ.336 కోట్లతో ఆధునికీకరణ

రైవాడ జలాశయం ఆధునికీకరణ పనులను రూ.336 కోట్లు అవసరం అవుతాయని జలవనరుల శాఖ జిల్లా అధికారులు నివేదిక రూపొందించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అమరావతి నుంచి కేంద్ర జల సంఘం పరిశీలన కోసం పంపారు. ఆధునికీకరణలో భాగంగా ఎర్త్‌ డ్యామ్‌, స్లూయిస్‌, సబ్‌వే, స్పిల్‌వే, గేట్లు ఆధునికీకరణ, ఇతరత్రా పనులు చేస్తారు. స్పిల్‌వే గేట్ల నుంచి గరిష్టంగా 1.67 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్‌ చేస్తారు. నీటి ప్రాజెక్టుకు స్పిల్‌వే కీలకం. అందువల్ల బీటలు వారిన రైవాడ స్పిల్‌వేకు మరమ్మతులు చేయడంకన్నా కొత్త స్పిల్‌వే నిర్మించడం ఉత్తమమని జలవనరుల శాఖ ప్రతిపాదించింది. అయితే కాపర్‌ డ్యామ్‌ నిర్మించిన తరువాతే స్పిల్‌వే నిర్మించాలి. ఇందుకోసం ప్రస్తుత స్పిల్‌వే ఉంచాలా? తొలగించాలా? అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న రేడియల్‌ గేట్ల స్థానంలో హైడ్రాలిక్‌ గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇనుప గేట్లు కాకుండా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గేట్లు పెట్టాలని ప్రపంచ బ్యాంకు నిపుణులు సూచించారు. ప్రస్తుతం 12 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల ఎత్తులో ఉన్న పది గేట్లకు బదులు 16 మీటర్ల వెడల్పు, ఏడు మీటర్ల ఎత్తుతో 11 గేట్లు ఏర్పాటు చేస్తారు. రైవాడ జలాశయం ఆధునికీకరణ పనులకు కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే పనులు మొదలుపెడతారు. సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌-పుణె) ఆధ్వర్యంలో పనులు జరుగుతాయి.

Updated Date - May 23 , 2025 | 12:53 AM