ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా!
ABN, Publish Date - May 16 , 2025 | 12:42 AM
ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇందుకు సంబంధించి గురువారం జీవో జారీ చేసి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి ఒకచోట ఐదు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి చేస్తూ నిబంధన పెట్టింది.
నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం
ఒకేచోట ఐదేళ్ల సర్వీసు నిండితే బదిలీ తప్పదు
రెండేళ్లు దాటినా.. బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు
దివ్యాంగులు, కారుణ్య ఉద్యోగులకు మినహాయింపు
జిల్లాలో 1,500 మందికి స్థాన చలనం?
అనకాపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇందుకు సంబంధించి గురువారం జీవో జారీ చేసి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి ఒకచోట ఐదు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి చేస్తూ నిబంధన పెట్టింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు కూడా బదిలీకి దరఖాస్తు చేసుకొనేందుకు (రిక్వెస్టు) అవకాశం కల్పించింది. 40 శాతం దివ్యాంగులైన ఉద్యోగులు, కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన వారికి బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలని జీవోలో పేర్కొన్నది. బదిలీల ప్రక్రియను ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) ప్రారంభించి జూన్ 2వ తేదీతో ముగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే విద్య, పోలీసు, ఎక్సైజ్ శాఖల్లో ప్రస్తుతానికి బదిలీలు లేవు. రెవెన్యూ, వైద్య, వ్యవసాయ, సంక్షేమ శాఖలు, ఖజానా, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, గృహ నిర్మాణ, తదితర శాఖల్లో బదిలీలు వుంటాయి. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన మూడు వేల మందికిపైగా ఉద్యోగులు వున్నారు. జిల్లా ఏర్పడి మూడేళ్లే అయినందున జిల్లా కేంద్రంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు చాలా తక్కువగానే ఉంటారని భావిస్తున్నారు. ఇక డివిజన్ కేంద్రాలు, మండలాలు, గ్రామాల్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు, రిక్వెస్టు బదిలీలు కలిపి 1,500 మంది వరకు స్థానచలనం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. బదిలీల కోసం ఆయా శాఖల అధిపతులు శుక్రవారం నుంచి ఉద్యోగుల ఉంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా బదిలీల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
బదిలీలు చేయడం సంతోషం
శ్రీరామ్మూర్తి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి
ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు విశాఖపట్నం నుంచి అనకాపల్లి వచ్చిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలి. బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వానికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
Updated Date - May 16 , 2025 | 12:42 AM